ఆప్ చీఫ్‌కు బిగ్ రిలీఫ్.. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు
x

ఆప్ చీఫ్‌కు బిగ్ రిలీఫ్.. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్ కాగా.. సీబీఐ కేసులో తాజాగా బెయిల్ దక్కింది.


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం రూ.10లక్షల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో ఈ బెయిల్‌ మంజూరుచేసింది. ఇప్పటికే రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌పై ఈడీ, సీబీఐ వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

మొదటిసారిగా మార్చి 21, 2024న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. తరువాత జూన్ 26న అవినీతి కేసులో CBI ఆయన అరెస్టు చేసింది. ఇప్పటికే ED కేసులో ఉన్నత న్యాయస్థానం నుంచి బెయిల్ పొందారు.

మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేసింది. అనంతరం లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరుచేయగా.. జైలు నుంచి విడుదలయ్యారు. గడువు ముగియడంతో జూన్‌ 2న తిరిగి లొంగిపోయారు. కాగా.. ఇదే కేసులో జూన్‌ 20న రౌస్‌ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది. దీనిపై ఈడీ అభ్యంతరం వ్యక్తంచేయడంతో మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జూలైలో ఆయనకు మధ్యంతర బెయిల్‌ దక్కింది. ఈ నేపథ్యంలో బెయిల్‌ వచ్చిన వెంటనే సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. దీంతో ఈడీ కేసులో ఊరట లభించినా.. సీబీఐ జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా తిహార్ జైలులో ఉండాల్సి వచ్చింది.

కేజ్రీవాల్‌కు కోర్టు షరతులు..

సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేస్తూనే ఆమ్ ఆద్మీ చీఫ్ కు కొన్ని కండీషన్లు పెట్టింది. ట్రయల్ కోర్టుకు విచారణ హాజరుకావాలని, సాక్ష్యాలను టాంపర్ చేయకూడదని సూచించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయానికి లేదా ఢిల్లీ సెక్రటేరియట్‌కు వెళ్లకూడదని నిబంధన విధించింది. గవర్నర్ అనుమతి లేకుండా ప్రభుత్వ ఫైళ్లపై సంతకం కూడా చేయకూడదని షరతులు విధించింది.

Read More
Next Story