
బీహార్ ఎన్నికలు: టికెట్ రాలేదని బట్టలు చించుకుని..
టిక్కెట్ కోసం డబ్బులు డిమాండ్ చేశారన్న ఆర్జేడీ నాయకుడు..
పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఓ వ్యక్తి వీరంగం సృష్టించారు. ఒంటిమీద బట్టలు చించుకుని, రోడ్డుపై పడి బోరున ఏడ్చేశారు. ఈ ఘటన ఆదివారం (అక్టోబర్ 19) బీహార్(Bihar) రాష్ట్రంలో జరిగింది. అది కూడా ఆర్జేడీ(RJD) చీఫ్ లాలు ప్రసాద్ (Lalu Prasad) ఇంటి ముందు. సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరలవుతోంది.
ఆర్జేడీ నాయకుడయిన మదన్ సా టిక్కెట్ తనకే వస్తుందని ఎంతో ఆశ పెట్టుకున్నారు. అయితే చివరి క్షణంలో ఆయనకు పార్టీ హ్యాండిచ్చింది. దీంతో నానా రభస చేశారు. ఆయన ఏమన్నారంటే..
#WATCH | Madan Shah tears his clothes, breaks down, falls to the ground and says, "...They will not form the government; Tejashwi is very arrogant, doesn't meet people...They are giving away tickets...Sanjay Yadav is doing all this...I have come here to die. Lalu Yadav is my… https://t.co/QdvLl6fkbA pic.twitter.com/NM50bPzxPJ
— ANI (@ANI) October 19, 2025
‘‘నాది ఆర్జేడీతో చాలా ఏళ్ల అనుబంధం. మధుబన్ టిక్కెట్ నాకే వస్తుందనుకున్నా. 2020లో ఇక్కడి నుంచి పోటీచేశా. అయితే స్వల్ప మెజార్టీతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయా. టికెట్ కోసం నా పిల్లల పెళ్లిళ్లు వాయిదా వేసుకుని రూ. 2.70 కోట్లు ఇచ్చాను. టికెట్ ఇవ్వకపోయినా.. కనీసం డబ్బులయినా తిరిగి ఇవ్వండి. ఇదంతా రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్ కనుసన్నల్లో జరిగింది. ఆయనే మధుబన్ సీటును దగ్గరుండి డాక్టర్ సంతోష్ కుష్వాహాకు కట్టబెట్టారు. కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలను పార్టీ విస్మరిస్తోంది. డబ్బున్న వారికి మద్దతు ఇస్తోంది" అని సాహ్ ఏడుస్తూ వేడుకోవడం వీడియోలో కనిపించింది.
డబ్బులకు టిక్కెట్లు అమ్ముకున్నారని వస్తున్న ఆరోపణలపై ఆర్జేడీ నేతలు ఎవరూ కూడా నోరు విప్పలేదు. 243 మంది సభ్యులున్న అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి.14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తొలిదశ పోలింగ్‌కు నామినేషన్ పత్రాల దాఖలు సోమవారంతో ముగుస్తుంది. ఈ లోగా ఏం జరుగుతుందో చూడాలి.