![ఐటీ తగ్గింపు బీజేపీని గెలిపించిందా? ఐటీ తగ్గింపు బీజేపీని గెలిపించిందా?](https://telangana.thefederal.com/h-upload/2025/02/08/511376-it.webp)
ఐటీ తగ్గింపు బీజేపీని గెలిపించిందా?
ప్రభుత్వ ఉద్యోగుల అధికంగా ఉన్న చోట్ల బీజేపీ గెలుపొందడానికి అది ఒక కారణంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. జాట్, ఎస్సీ స్థానాలను కాషాయ జెండా రెపరెపలాడనుంది.
27 ఏళ్ల విరామం తర్వాత ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ(BJP) 46.9 శాతం ఓటు షేర్ సాధించింది. 2020లో 40.7 శాతంగా ఉన్న ఈ ఓటు శాతం ఈసారి 6 పాయింట్లు పెరిగింది. 1998 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన తర్వాత బీజేపీకి ఇదే తొలి విజయం.
ఈ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనూ బీజేపీ సత్తాచాటింది. 2015 నుంచి ఆప్ బలంగా ఉన్న 12 ఎస్సీ నియోజకవర్గాల్లో ఈ సారి 4 చోట్ల (బవానా, గోకల్‌పుర్, మంగళ్‌పురి, మదీపూర్) బీజేపీ ఆధిక్యం చాటుకుంది.
ఐటీ తగ్గింపు, పే కమిషన్ ప్రభావం..
ప్రభుత్వ ఉద్యోగులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ మెరుగైన ప్రదర్శన కనబర్చినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ, ఆర్కే పురం, ఢిల్లీ కాంటోన్మెంట్ ప్రాంతాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కేంద్ర ప్రభుత్వం రూ. 12 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఆదాయపు పన్ను(IT) తగ్గింపు ప్రకటించడమే కాకుండా, 8వ పే కమిషన్ ఆమోదం పొందడం బీజేపీకి కలిసొచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కూడా న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పరివేష్ వర్మ(Parvesh Verma)తో పోటీ పడుతూ ఒక దశలో వెనుకబడ్డారు. మరో ప్రముఖ ఆప్ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి అతిశీ (Atishi) కూడా కాల్కాజీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి చేతిలో వెనుకబడ్డారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ.. ఆప్ మంత్రులు సత్యేంద్ర జైన్, సౌరభ్ భారద్వాజ్ వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
ముస్లింలున్న ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యం..
ఇతర నియోజకవర్గాలతో పాటు ఓఖ్లా వంటి ముస్లిం ప్రజలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇది ఈ నియోజకవర్గంలో బీజేపీకి వచ్చిన తొలి ఆధిక్యం. ఇక హర్యాణా, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఢిల్లీ నియోజకవర్గాల్లోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. జాట్, గుజర్ వర్గాల ప్రజలు అధికంగా ఉన్న 23 నియోజకవర్గాల్లో కనీసం 18 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది.
ఈ విజయానికి ప్రధాన కారణాలలో ఒకటిగా ఆప్ మాజీ మంత్రి కైలాష్ గెహ్లాట్ బీజేపీలో చేరడం కావొచ్చు. గత ఎన్నికల్లో జాట్ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించడంలో కీలకంగా ఉన్న గెహ్లాట్.. ఈసారి బీజేపీ తరఫున బిజ్వాసన్ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఆయన అసలు నియోజకవర్గం నజఫ్గఢ్‌లో కూడా బీజేపీ ముందుంది.