ఒడిషాలో బీజేడీని టార్గెట్ చేసిన బీజేపీ.. హెలికాప్టర్ వాడకంపై దర్యాప్తు
x

ఒడిషాలో బీజేడీని టార్గెట్ చేసిన బీజేపీ.. హెలికాప్టర్ వాడకంపై దర్యాప్తు

బిజు జనతాదల్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు సన్నిహితుడయిన పాండియన్.. ప్రభుత్వ హెలికాప్టర్‌ను వినియోగించడంపై బిజెపి దర్యాప్తు ప్రారంభించింది.


బిజు జనతాదల్ (BJD) హయాంలో మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు అత్యంత సన్నిహితుడయిన వికె పాండియన్.. ప్రభుత్వ హెలికాప్టర్‌ను విస్తృతంగా వినియోగించడంపై ప్రస్తుత అధికార బిజెపి దర్యాప్తు ప్రారంభించింది.

పట్నాయక్‌కు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాండియన్ హెలికాప్టర్లను విస్తృతంగా వినియోగించడంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని ఒడిశా వాణిజ్య, రవాణా మంత్రి బిభూతి భూషణ్ జెనా చెప్పారు.

“ఫిబ్రవరి 2020 నుంచి డిసెంబర్ 2023 మధ్య రాష్ట్రవ్యాప్తంగా పాండియన్ తరచుగా హెలికాప్టర్‌లో ప్రయాణించారు. రాష్ట్ర ఖజానాను దుర్వినియోగం చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ”అని జెనా చెప్పారు.

ఒడిశా అంతటా 450 హెలిప్యాడ్ల నిర్మాణం..

పాండియన్ హెలికాప్టర్‌ సులభంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా ఒడిశా రాష్ట్రంలో మొత్తం 450 హెలిప్యాడ్‌లు నిర్మించారని, వాటి ఒక్కో నిర్మాణానికి దాదాపు రూ.3 లక్షలు ఖర్చు చేశారని ఒడిశా ఎక్సైజ్ శాఖ మంత్రి పృథివీరాజ్ హరిచందన్ పేర్కొన్నారు. హెలిప్యాడ్‌ల నిర్మాణానికి ఎవరు అనుమతి ఇచ్చారు? వాటి తయారీకి ఎంత ఖర్చయ్యింది? అనే దానిపై కూడా విచారణ జరుగుతోందన్నారు. అక్రమ నిర్మాణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హరిచందన్‌ హెచ్చరించారు.

పరిష్కార వేదికలకు హెలికాప్టర్‌లో వెళ్లిన పాండియన్..

పాండియన్ గతంలో కొన్ని జిల్లాల్లో ప్రజా పరిష్కార వేదికలను ఏర్పాటు చేశారు. ఇలా 30 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 190 పరిష్కార వేదికలకు ఆయన హెలికాప్టర్‌లో వెళ్లారు. వేదికలలో 57,442 ఫిర్యాదుల్లో 43,536 సమస్యలను పరిష్కరించారని గత బిజెడి ప్రభుత్వం పేర్కొంది. అయితే హెలికాప్టర్ వాడకానికి ఎంత ఖర్చయ్యిందన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు.

హెలికాప్టర్ వినియోగాన్ని సమర్థించిన BJD

ఇదిలా ఉండగా.. పాండియన్ హెలికాప్టర్ వినియోగాన్ని బిజెడి నాయకుడు సంబిత్ రౌత్రే సమర్థించారు. ముఖ్యమంత్రి తరపున బహిరంగ విచారణలు నిర్వహించడం కోసం తాను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించినట్లు బిజెడి నాయకుడు సంబిత్ రౌత్రే తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి అనవసరంగా రాద్దాంతం చేస్తోందని రౌత్రియా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నాయకుడు, మాజీ ప్రధాన కార్యదర్శి బిజయ్ పట్నాయక్ కూడా పాండియన్ హెలికాప్టర్ వినియోగంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు.

ఎవరీ పాండియన్..

పాండియన్ ఓ తమిళియన్‌. ఐఏఎస్‌ అధికారి. ఒడిశాలో బాధ్యతలు నిర్వహించారు. స్వచ్చంధ విరమణ చేశాక ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు ప్రైవేటు కార్యదర్శిగా పనిచేశారు. ‘మోస్టు ఎఫీసియంట్‌గా వర్సన్‌’గా పేరు తెచ్చుకున్నారు. ఒడిశా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఒడిషాలోని ఒడియా అమ్మాయిని వివాహమాడారు. భార్య పేరు సుజాత. ఐఎఎస్‌ అధికారి అయిన ఈమె ఒడిశా మిషన్‌ శక్తి కార్యదర్శిగా ఉన్నారు.

Read More
Next Story