ఆమె వస్తారు.. ఈమె వెళతారు..


గెలిచిన పార్టీ, నచ్చిన పేరు, మెచ్చిన అధికారి.. ఇవన్నీ సర్వసాధారణం ప్రస్తుత పరిస్థితుల్లో. రేవంత్ ప్రభుత్వం కూడా ఇందుకు మినహాయింపు కాదని తేలిపోయింది. ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాగానే సీఎం ఆఫీస్‌లో అధికారుల టీంలో ఎవరుంటారు. ఎవరు వెళ్తారనే చర్చ జరుగుతోంది. ఇందులో స్మితా సబర్వాల్, అమ్రపాలి మహిళా ఐఏఎస్ అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకరు సీఎం ఆఫీస్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారని.. మరొకరు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

సెంట్రల్ సర్వీస్‌కు స్మితా సబర్వాల్‌?
మొన్నటి వరకు కేసీఆర్ టీంలో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటు కేంద్ర సర్వీస్‌లో ఉన్న మరో ఐఎఎస్ అమ్రపాలి రేవంత్ రెడ్డి టీంలో జాయిన్ కానున్నారనే చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి కొత్త టీం సిద్ధమవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులకు స్థానచలనం మొదలైంది. ఈ క్రమంలోనే ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, అమ్రపాలి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను సీఎంవో కార్యదర్శిగా నియమించారు అప్పటి సీఎం కేసీఆర్. ఆమెకు నీటిపారుదల శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ పనుల్ని స్మితా సబర్వాల్ పర్యవేక్షించేవారు. సెలవు రోజుల్లోనూ పర్యటిస్తూ తెలంగాణ టూరిజం, హ్యాండ్‌లూమ్ వస్త్రాలను ప్రమోట్ చేసేవారు. మరోవైపు సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు.
అయితే కొత్త సర్కారు కొలువుదీరినప్పటి నుంచి స్మితా సబర్వాల్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులంతా మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. కానీ స్మితా సబర్వాల్ మాత్రం ఇంతవరకు కొత్త సీఎంను కలవలేదు. తన భర్త ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. తాను కూడా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది.
ఆమ్రపాలి ఎంట్రీ ఖాయమేనా?
స్మితా సబర్వాల్ స్థానంలో తెలంగాణ సీఎం ఆఫీస్‌లోకి ఐఏఎస్ అధికారి అమ్రపాలి ఎంట్రీ ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే కేంద్రం సర్వీస్‌ ముగించుకొని తెలంగాణాకు వచ్చిన అమ్రపాలి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆమెకు సీఎం కార్యాలయంలో కీలక బాధ్యతలు కన్‌ఫామ్‌ అంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఏపీ క్యాడర్‌ నుంచి తెలంగాణకు...
ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌లో 2010 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారిణి అమ్రపాలి.. తెలంగాణలో పలు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. 2011లో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా మొదట విధుల్లో చేరిన అమ్రపాలి.. ఆ తరువాత రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేశారు. ఆతర్వాత వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసి యంగ్‌ అండ్ డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నగర కమిషనర్‌గా, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో జాయింట్‌ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి వద్ద ప్రైవేట్‌ సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించారు.
చిన్న వయసులోనే డెప్యూటీ కార్యదర్శిగా...
ఆ తర్వాత అమ్రపాలిని ప్రధాన మంత్రి కార్యాలయ డిప్యూటీ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అతి చిన్నవయస్సులోనే ఈ పదవిలో నియమితులైన వారిలో ఒకరిగా అమ్రపాలి నిలిచారు. పీఎంవో కార్యాలయంలో ఆమె 2023 అక్టోబర్‌ 23 వరకు సుమారు మూడేళ్ల పాటు సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారు. ఇప్పుడు కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యి.. మళ్లీ తెలంగాణకు వచ్చారు అమ్రపాలి.
ఇద్దరి మధ్యా ఎన్ని పోలికలో...
స్మితా సబర్వాల్, అమ్రపాలి మధ్య వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చాలా పోలికలు కనిపిస్తాయి. ఇద్దరు చిన్న ఏజ్‌లోనే సివిల్స్‌కు సెలెక్ట్ అయ్యారు. స్మితా సబర్వాల్ 4వ ర్యాంక్ సాధిస్తే.. అమ్రపాలి 39వ ర్యాంక్ సాధించారు. బాధ్యతల విషయంలోనూ ఇద్దరు చాలా స్ట్రిక్ట్ అనే పేరు సంపాదించారు.
ఒకరు ఇన్‌ మరొకరు అవుట్‌..
తెలంగాణ సీఎం కార్యాలయం నుంచి స్మితా సబర్వాల్ వెళ్లిపోతుండగా.. అమె స్థానంలో మరో ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి ఎంట్రీ ఇస్తుండటం అటు రాజకీయవర్గాల్లోనూ ...ఇటు బ్యూరోక్రాట్లలోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది.


Next Story