పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం
కాశీ విశ్వనాథ్ కారిడార్ తరహాలో బీహార్‌లోని విష్ణుపద్ మహాబోధి ఆలయ కారిడార్ల అభివృద్ధి చేయనున్నారు.
దేశ ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు పర్యాటక రంగం(Tourism sector) కీలకమని భావించిన కేంద్రం ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దేశంలోని 50 ప్రముఖ పర్యాటక ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి చేయనుంది. వీటిలో బౌద్ధ పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే ఒడిశా, నలందా టూరిజం స్పాట్లను అభివృద్ధి చేయనున్నారు. నదీ మార్గం ద్వారా చేరుకునే పర్యాటక ప్రదేశాలకు మరింత ప్రోత్సాహం ఇవ్వనున్నారు.
నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు..
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆతిథ్య రంగంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు. పర్యాటక ప్రదేశాల నిర్వహణ చేపట్టే రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నారు. వీసాలను సులభతరం చేయనున్నారు. సమూహంగా కలిసివెళ్లే వారికి వీసా ఫీజు మినహాయింపు ఇవ్వనున్నారు.
దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. 2024 జూలై బడ్జెట్‌లో ప్రకటించిన ప్రకారం బౌద్ధ పర్యాటక ప్రాంతాలకు (Buddhist sites) అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. PRASHAD (Pilgrimage Rejuvenation and Spiritual Heritage Augmentation Drive) పథకానికి రూ. 240 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పోధ్ గయ, సార్నాథ్, కుశీనగర్, ప్రఖ్యాత అజంతా, ఎల్లోరా గుహలను అభివృద్ధి చేయనున్నారు.
స్వదేశ దర్శన్ 2.0 పథకానికి రూ. 1,900 కోట్లు కేటాయించారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, బీహార్‌లోని విష్ణుపద్ మహాబోధి ఆలయ కారిడార్ల అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు యాత్రికులకు మెరుగైన అనుభూతిని అందించనున్నాయి.
వైద్య పర్యాటక అభివృద్ధి – ‘హీల్ ఇన్ ఇండియా’
భారతదేశం ఆరోగ్య పర్యాటకానికి (Medical Tourism) ప్రపంచ స్థాయిలో కేంద్ర బిందువుగా మారుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగం కలసి పని చేస్తూ వీసా సదుపాయాలను మరింత సులభతరం చేయడం ద్వారా అంతర్జాతీయ రోగులకు సహాయం చేయనుంది.