బీహార్: ఉచితాలు నితీష్‌ను గట్టెక్కిస్తాయా?
S.I.Rపై ఉన్న ప్రజాగ్రహాన్ని పోగొడతాయా? నిపుణులు ఏమంటున్నారు? అసలు జనం ఏం కోరుకుంటున్నారు?
బీహార్(Bihar) రాష్ట్రంలో నితీష్ కుమార్(CM Nitish Kumar) నేతృత్వంలోని NDA ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తున్నట్టుంది. ఎన్నికల సంఘం (EC) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉచితాలపై దృష్టి పెట్టారు. పేద మహిళలు, నిరుద్యోగ యువత, నిరుపేద వృద్ధులను లక్ష్యంగా చేసుకుని కొన్ని వారాలుగా ఆయన అనేక ప్రజాకర్షక పథకాలను వదులుతున్నారు. వాటిలో ఉచిత విద్యుత్, విద్యార్థులకు స్టైఫండ్, యువతకు ఉద్యోగాలు, వితంతువులు, వృద్ధులకు పెన్షన్ల పెంపు ఉన్నాయి.
ఉచిత కరెంట్ పథకం..
ఆగస్టు 1న ఉచిత విద్యుత్ పథకాన్ని నితీష్ ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని మొత్తం 1.86 కోట్ల వినియోగదారులలో 1.67 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఎన్నికల తేదీని EC అధికారికంగా ప్రకటించడానికి సుమారు ఒకటిన్నర నెలల ముందు ఈ పథకాన్ని ఆయన ప్రారంభించారు.
పింఛన్ల పెంపు..
జూన్ చివరి వారంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు పెంచారు. రూ.400 నుంచి రూ.1,100కి పెంచడంతో 1.11 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతోంది. జూలై 11న లబ్ధిదారులు కొత్త ఫించన్ డబ్బు అందుకున్నారు.
ప్రోత్సాహకం పెంపు..
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద పనిచేస్తున్న 90వేల మంది కాంట్రాక్టు సామాజిక ఆరోగ్య కార్యకర్తలు (ASHA), 7,500 మంది మమతా కార్మికులకు నెలవారీ ప్రోత్సాహకం రూ.1,000 నుంచి రూ.3,000 అందుకుంటున్నారు. వారికి వరుసగా రూ.300, రూ.600 కు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కూడా ప్రకటించారు.
తక్కువ వడ్డీతో ఎక్కువ రుణం..
జీవిక ప్రాజెక్ట్ కింద 1.4 కోట్ల జీవిక దీదీలు మునుపటి 10 శాతానికి బదులుగా 7 శాతం వడ్డీ రేటుతో రూ.3 లక్షల వరకు బ్యాంకు రుణాలు పొందవచ్చని పేర్కొన్నారు నితీష్. అంగన్‌వాడీ కార్యకర్తలు స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుకు రూ. 11వేలు నగదును అందించనున్నట్లు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులు, గార్డులు, ఆరోగ్య బోధకుల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
విద్యార్థులకు స్టైపెండ్..
విద్యార్థులకు నెలవారీ స్టైఫండ్‌లను ప్రకటించిన నితీష్..12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు నెలకు రూ. 4వేలు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నెలకు రూ. 5వేలు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ. 6వేలు అందజేస్తామని చెప్పారు. రాబోయే ఐదు సంవత్సరాలలో వివిధ సంస్థలలో లక్ష మంది యువతకు ఇంటర్న్‌షిప్‌లను అందించే ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. 1 కోటి ఉద్యోగాలను సృష్టిస్తామని హామీ ఇచ్చింది.
తంటంతా SIRతోనేనా?..
నితీష్ ప్రజాకర్షక పథకాలు, ప్రకటనలు బాగానే ఉన్నా.. SIR చేపట్టాలని ఈసీ తీసుకున్న నిర్ణయం ఆయనను ఇబ్బందుల్లో పడేసినట్లు కనిపిస్తోంది. ‘‘జీవన వ్యయం పెరుగుతున్న క్రమంలో ఉచిత విద్యుత్తు ఒక ఉపశమనం అనడంలో సందేహం లేదు. కాని ఉచితాలపై పాట్నా జిల్లాలోని ఆశా కార్యకర్త సునీతా కుమారి ది ఫెడరల్‌తో ఇలా ఉన్నారు.
‘అది పాత డిమాండే..’
"ప్రోత్సాహకం పెంచాలన్నది మా పాత డిమాండ్. గ్రామీణ ప్రాంతాల్లో గంటల తరబడి పనిచేస్తున్నా.. ప్రోత్సాహకాన్ని రూ. 3వేలకు పెంచడం పట్ల ప్రయోజనం ఉండదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ స్వల్ప పెంపు ఏమీ కాదు. ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వం మంచి పెంపు ఇస్తుందని ఆశిస్తున్నాం," అని పాట్నా జిల్లాలోని ఫుల్వారీ షరీఫ్ బ్లాక్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌తో సంబంధం ఉన్న సునీత అన్నారు.
‘‘ప్రభుత్వం ప్రతి బిడ్డ జననానికి రూ. 600 అదనంగా ఇస్తామని చెప్పింది. ఇదేం అంత సంతోషించదగ్గ విషయం కాదు. ఈ ప్రోత్సాహకంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు ఆటోలో వెళ్లడానికి, ఓ కప్పు టీతాగడానికి సరిపోతుంది. అంతే’’ అని మమతా కార్మికురాలు సర్దా దేవి పేర్కొన్నారు.
వాస్తవానికి ఇది దీర్ఘకాల పోరాటం ఫలితమంటున్నారు బీహార్ రాజ్య ఆశా కార్యకర్త సంఘ్ అధ్యక్షుడు శశి యాదవ్. ఇప్పటివరకు సాధించింది సగం విజయమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య కార్యకర్తలను 24x7 పని చేయించి, వారికి కనీస జీతం ఇవ్వకుండా దోపిడీ చేస్తోందని ఆమె ఆరోపించారు. "వారికి న్యాయం కోసం మా పోరాటాన్ని కొనసాగిస్తాము. ఈ నెలలో పెద్ద నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించుకున్నాం," అని ప్రతిపక్ష CPI(ML) MLC కూడా అయిన శశి తెలిపారు.
'ఉద్యోగాలు కావాలి, ఉచితాలు కాదు'
పాట్నాలోని ఇషోపూర్‌కు చెందిన సాంప్రదాయ గాజుల కళాకారుడు నలభై ఏళ్ల మొహమ్మద్ అష్రఫ్ ఇలా అన్నారు. ‘‘ ఉచితాలు కొంతమందికి మాత్రమే ప్రయోజనం చేకూర్చవచ్చు. కానీ నాలాంటి వేలాది మందికి ప్రయోజనం చేకూర్చకపోవచ్చు. క్షయవ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత తన వృత్తిని వదులుకోవలసి వచ్చిన అష్రఫ్.. ఒక సంవత్సరం మంచి జీవనోపాధిని పొందడం కష్టమై పోయిందని చెప్పారు.
"కొంతమంది లబ్ధిదారులు నితీష్‌కు ఓటు వేయవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో చాలా మంది ఆయనను వెళ్లగొట్టాలని కోరుకుంటున్నారు," అని ఆయన ది ఫెడరల్‌తో అన్నారు .
"నేను ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతున్నా. జీవనోపాధి కోసం బ్యాటరీతో పనిచేసే ఆటో రిక్షా కొనడానికి బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తున్నా. వైద్యులు నా పాత వృత్తిని వదిలేయాలని సలహా ఇచ్చారు" అని అష్రఫ్ జోడించారు.
‘ఉచితాలతో ఓట్లు పడవు..’
రోజువారీ కూలీ రాజన్ రాయ్ మాట్లాడుతూ.. ఉచితాలు ప్రకటించినందు వల్ల నితీష్‌కు ఓట్లు పడవని చెప్పారు. "ఉచిత విద్యుత్ మాకు జీవనోపాధిని దోహదపడదు. నాలాంటి కార్మికులకు పని కల్పిండచానికి పరిశ్రమలు లేదా కర్మాగారాలు లేవు. మాకు పని దొరుకుతుంది. కాని రోజూ దొరకదు.”అని ధరాయ్ చక్ గ్రామ నివాసి రాజన్ అన్నారు.
పెన్షన్ పెంపు శుభవార్త..
సునీత, సర్ద మాదిరిగా కాకుండా చాలా మంది లబ్ధిదారులు వృద్ధులు, వితంతువులకు పెన్షన్ పెంపుపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాట్నాలోని పోలీస్ కాలనీ సమీపంలోని పహార్పూర్ ప్రాంతంలో ఉంటున్న 75 ఏళ్ల మహ్మద్ ఆలంగీర్ ఇలా అన్నారు. ‘‘నా వృద్ధాప్య పింఛనును రూ.400 నుంచి రూ.1100 కు పెంచడం సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం మమ్మల్ని (వృద్ధులను) జాగ్రత్తగా చూసుకుంది. ఈ పెంపు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాం,’’ అని ఆలంగీర్ ది ఫెడరల్‌తో అన్నారు .
మహిళల ఓట్లను రాబట్టుకోడానికి నితీష్ వ్యూహాత్మకంగా మణి ట్రాన్స్‌ఫర్‌కు ప్లాన్ చేశారని ఒక రాజకీయ విశ్లేషకుడు అన్నారు. పాలక జేడీ(యూ) ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘నితీష్ తన సుదీర్ఘ పదవీకాలంలో మహిళా సాధికారత కోసం అనేక పథకాలను ప్రారంభించారు. పాఠశాల బాలికలకు ఉచిత సైకిళ్లను అందించడం, ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించడం, పాఠశాలల్లో బాలికల నమోదుకు కృషి చేయడం, పంచాయతీ రాజ్ వ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం వంటివి ఉన్నాయని గుర్తుచేశారు.
'ఉచితాలు నితీష్‌ను రక్షించలేవు'
పాట్నాలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ (TISS) మాజీ ప్రొఫెసర్ పుష్పేందర్ కుమార్ మాట్లాడుతూ..‘‘ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకోవడంలో భాగంగా అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించడంసాధారణమే అయినా..ఈసారి బీహార్‌లో అది పనిచేస్తుందన్న నమ్మకం లేదు,’’ అని పేర్కొన్నారు.
‘నితీష్‌ను ప్రమాదంలో పడేసిన SIR ?’
మొత్తంమీద ప్రజల సెంటిమెంట్ NDA ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న సమయంలో.. EC స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితా దాని ఎన్నికల విజయ అవకాశాలను మరింత ప్రమాదంలో పడేసినట్లు కనిపిస్తోంది.
లక్షలాది మంది ఓటర్ల ఓటు హక్కును తొలగించడానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్రం EC ద్వారా SIR చేయిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆధార్, ఓటరు ఐడి, రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకోకుండా కేవలం బర్త్ సర్టిఫికేట్‌ను ప్రామాణికంగా తీసుకుంటామని EC చెప్పడంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.