జైలు నుంచి కేజ్రీవాల్ పాలన చేయవచ్చా? చట్టం ఏమి చెబుతోంది?
కేజ్రీవాల్ రూటే సెపరేటు. స్వల్పకాలంలో పార్టీ పెట్టి ఢిల్లీలో అధికారాన్ని చేపట్టి కేంద్రప్రభుత్వంపై తొడగొట్టి ఇప్పుడు జైలు పాలయ్యారు. జైలు నుంచే పాలన అంటున్నారు
లిక్కర్ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారా? అవుననే అంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు. ప్రస్తుతం దీనిపై దేశవ్యాప్తంగా చర్చసాగుతోంది. దీని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. చట్టం ఏమి చెబుతోందీ? ఇది అసలు ఆచరణ సాధ్యమా? జైల్లో ఆయన్ను ఎంత సేపు కలవడానికి చాన్స్ ఉంటుందనే దానిపై ప్రభుత్వాన్ని నడపడం ఆధారపడి ఉంటుంది. ఎవరైనా ముఖ్యమంత్రి లేదా కీలకపదవుల్లో ఉన్న వ్యక్తులు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు లేదా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినపుడు ఎవరో ఒకరికి బాధ్యత అప్పగించడం ఆనవాయితీగా వస్తోంది. అందుకు భిన్నంగా అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్ట్ కు నిరసనగా జైలు నుంచే సర్కార్ ను నడుపుతారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపగలరా?
కటకటాల వెనుక నుంచి ప్రభుత్వ కార్యకలాపాలను నడపడం లాజిస్టిక్‌గా అసాధ్యమైనది. కానీ అలా నడపకూడదన్న నిబంధనైతే లేదు. ఓ ముఖ్యమంత్రిని అలా చేయకుండా నిరోధించే చట్టం ఏదీ లేదు. చట్ట ప్రకారం ఏదైనా కేసులో దోషిగా తేలినప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి అనర్హుడవుతారు. లేదా పదవి నుంచి తొలగిస్తారు. అరవింద్ కేజ్రీవాల్ కేసులో ఇంకా అతనికి శిక్ష పడలేదు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం నిర్దిష్ట నేరాలకు అనర్హత నిబంధన ఉంది. దీని ప్రకారం దోషిగా తేలినప్పుడు మాత్రమే పదవి పోతుంది. దోషిగా నిర్ణయించాల్సింది కోర్టులు.
ఏయే సందర్భాలలో సీఎం పోస్ట్ పోతుందంటే...
ముఖ్యమంత్రులు కేవలం రెండు సందర్భాలలో తమ పదవులు కోల్పోతారు. ఒకటి అసెంబ్లీలో మెజారిటీ మద్దతు కోల్పోవడం లేదా ముఖ్యమంత్రి నేతృత్వంలోని అధికార ప్రభుత్వంపై ఎవరైనా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే అది విజయం సాధిస్తే పదవి కోల్పోవాల్సి వస్తుంది. లేదా ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఏదైనా కేసులో దోషిగా తేలినప్పుడు పదవులు కోల్పోతారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కొత్తగా రూపొందించిన ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడంపై సర్వత్రా ఖండన మండనలు వెల్లువెత్తుతున్నాయి. ‘అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రజలకు ప్రేమ, అభిమానం. ఏవో సాకు చూపి, కారణాలు చూపి కేజ్రీవాల్ అరెస్ట్ చేయొచ్చు.. కానీ అతని ఆలోచనలను అరెస్ట్ చేయలేరు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తే వీధిలో మరో కేజ్రీవాల్ పుట్టుకొస్తారు. సోదాల పేరుతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఫోన్ తీసుకున్నారు. కేజ్రీవాల్ సెక్రటరీ మొబైల్ కూడా తీసుకున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌తో బీజేపీ పన్నాగం బయటపడింది అని’ ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, అతిషి అన్నారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని అతిషి స్పష్టం చేశారు.
ఈడీ వాదన ఎలా ఉందంటే...
ఢిల్లీ న్యూ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారు అని ఈడీ మీడియాకు విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది. బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లతో కలిసి కుట్రకు తెరతీశారని ఆరోపించింది. న్యూ ఎక్సైజ్ పాలసీతో సౌత్ లాబీకు భారీగా లబ్ధి చేకూరిందని పేర్కొంది. అందుకు ప్రతీగా సౌత్ లాబీ ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల నగదు ఇచ్చిందని, లిక్కర్ పాలసీ కేసు విచారణ క్రమంలో కొందరు నిందితులు, సాక్షులు తమ వాంగ్మూలంలో అరవింద్ కేజ్రీవాల్ పేరును చెప్పారని అధికారులు రిమాండ్, చార్జిషీట్లలో రాశారు.
లిక్కర్ పాలసీ కేసులో నిందితుడు అయిన విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయానికి తరచు వెళ్లేవారని అధికారులు తెలిపారు. కేజ్రీవాల్‌ను కలువడానికి ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రను విజయ్ నాయర్ పంపారన్నది ఆరోపణ. తర్వాత మరోసారి ముగ్గురు కలిసి వీడియో కాల్ మాట్లాడారని వివరించారు. తను విశ్వసించే వారిలో నాయర్ ఒకరని మహేంద్రతో అరవింద్ కేజ్రీవాల్ అన్నారని ఈడీ అధికారులు చెబుతున్నారు. సౌత్ లాబీలో తొలి నిందితుడు రాఘవ్ మాగుంట అప్రూవర్ గా మారారు. రాఘవ్ తండ్రి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారని ఈడీ ఆరోపించింది అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు ఈవేళ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు. అక్కడ కూడా వ్యతిరేక ఉత్తర్వులు వస్తే ఆయన జైల్లో ఉండాల్సి వస్తుంది.