రాష్ట్రపతి ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు.. సోనియాపై కేసు..
x

రాష్ట్రపతి ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు.. సోనియాపై కేసు..

రాష్ట్రపతిని ‘పేద మహిళ’(Poor Lady) అని అభివర్ణించిన సోనియా, ముర్ము ప్రసంగం ‘బోరింగ్‌’గా ఉందన్న రాహుల్‌


Click the Play button to hear this message in audio format

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) పై కేసు నమోదైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘పేద మహిళ’(Poor Lady) అని అభివర్ణించినందుకు బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సోనియా గాంధీ ద్రౌపది ముర్మును అవమానించడానికి ప్రయత్నించారంటూ సుధీర్ ఓజా అనే న్యాయవాది సీజీఎం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 10న కేసు విచారణకు రానుంది. ఇదే కేసులో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాలను కూడా సహ నిందితులుగా చేర్చాలని ఓజా కోరాడు. వారిపై కూడా చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ముర్ముపై సోనియా చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. గిరిజన సమాజం నుంచి వచ్చిన రాష్ట్రపతిపై సోనియా వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం,’’ అని ఓజా పిటీషన్‌లో పేర్కొన్నాడు.

రాహుల్ ఏమన్నారు?

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం తర్వాత సోనియా పాత్రికేయులతో మాట్లాడుతూ ‘చివరికి ఆ పేద మహిళ అలసిపోయింది’ అని అన్నారు. అదే సమయంలో రాహుల్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బోరింగ్‌గా అభివర్ణించారు. ఇక సోనియా వ్యాఖ్యలను బీజేపీ కూడా ఖండించింది. ఇది దురదృష్టకర, అవమానకర వ్యాఖ్య అని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. సోనియా వ్యాఖ్యపై ప్రధాని మోదీ(PM Modi) కూడా స్పందించారు. దేశం మరోసారి కాంగ్రెస్ రాజకుటుంబ అహంకారాన్ని చూడాల్సి వచ్చిందన్నారు. ‘‘రాష్ట్రపతి ద్రౌపది పార్లమెంటునుద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశం సాధించిన విజయాలు, దార్శనికతను దేశ ప్రజలకు తెలియజేశారు. హిందీ ఆమె మాతృభాష కాదు. అయినప్పటికీ చక్కగా మాట్లాడారు. కానీ కాంగ్రెస్ రాజకుటుంబం ఆమెను అవమానించడం ప్రారంభించింది. ఇది దేశంలోని గిరిజన సోదరసోదరీమణులకు అవమానకరం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Read More
Next Story