
‘ఆ డబ్బుతో మాకు సంబంధం లేదు’
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ స్టోర్ రూంలో అగ్నిప్రమాదం-కాలిపోయిన కరెన్సీ నోట్ల గుర్తింపు - విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు కొలీజియం
ఢిల్లీ (Delhi) హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ(Yashwant Varma) ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ శనివారం 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు.
వర్మ ఏమంటున్నారు?
‘‘మార్చి 14వ తేదీ మా నివాసానికి దగ్గర్లోని స్టోర్‌రూమ్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే మా కూతురు, ప్రైవేట్ సెక్రటరీ ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. మంటలను అదుపులోకి తెచ్చే సమయంలో భద్రత దృష్ట్యా మా కుటుంబ సభ్యులను, సిబ్బందిని అక్కడి నుంచి దూరంగా పంపారు. మంటలను ఆర్పిన అగ్ని మాపక సిబ్బందికి కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయంటున్నారు. తర్వాత వాటిని మా వాళ్లకుగాని, సిబ్బందికి గాని చూపలేదు. ఇంతలోనే మా ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయని మీడియాలో ప్రచారం జరిగిపోయింది. అసలు ఆ స్టోర్‌రూమ్‌లో నగదు ఉందన్న విషయం నాకుగాని, మా కుటుంబ సభ్యులకుగాని తెలీదు. పనికిరాని వస్తువులను ఉంచే స్టోర్ రూంలో ఎవరైనా నోట్ల కట్టలు ఉంచుతారా? ”అని ప్రశ్నించారు.
‘‘మార్చి 14వ తేదీన నేను, నా భార్య మధ్యప్రదేశ్‌లో పర్యటనలో ఉన్నాం. మా ఇంట్లో మా కూతురు, వృద్ధ తల్లి మాత్రమే ఉన్నారు. మార్చి 15 సాయంత్రం మాత్రమే మేము ఇండిగో విమానంలో భోపాల్ నుంచి ఢిల్లీకి వచ్చాం.” అని చెప్పారు యశ్వంత్ వర్మ.
జస్టిస్ ఉపాధ్యాయ నివేదికలో ఏముంది?
యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న వార్తలతో సుప్రీంకోర్టు (Supreme Court) కొలీజియం విచారణ ప్రారంభించింది. అంతర్గత విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. అందులో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతోపాటు ఢిల్లీ పోలీసు కమిషనరు అందించిన వివరాలు, ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. ఈ నివేదిక మొత్తాన్ని అనూహ్యంగా శనివారం రాత్రి తన వెబ్‌సైట్‌లో సుప్రీంకోర్టు ఉంచింది. అగ్ని మాపకశాఖ ఆపరేషన్ వివరాలూ ఫొటోలు, వీడియోల్లో ఉన్నాయి. సీజేఐ రాసిన లేఖ కూడా ఉంది. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉందని జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు.
విచారణకు త్రిసభ్య సంఘం..
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు. ఇందుకోసం 3 రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పంజాబ్-హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ వర్మకు కేసుల విచారణ పరంగా ఎలాంటి బాధ్యతలూ అప్పగించవద్దని దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయను సీజేఐ ఆదేశించారు.