
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై సీబీఐ కేసేమిటి?
సుప్రీం ఛీప్ జస్టిస్ అనుమతి లేకుండా హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై సీబీఐ(CBI) ఎఫ్ఐఆర్(FIR) ఎలా నమోదుచేసిందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఢిల్లీ(Delhi) హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ(Yashwant Varma) ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. ఆయన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరగడంతో భారీగా నోట్ల కట్టలు (Unaccounted Cash Recovery) బయటపడ్డాయని వార్తలొచ్చాయి. దీనిపై సుప్రీంకోర్టు (Supreme Court) కొలీజియం విచారణ ప్రారంభించింది. అంతర్గత విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయను ఆదేశించింది. యశ్వంత్‌వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొంది.
అయితే జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు, నోట్ల కట్టల వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా 2021 నుంచి విధులు నిర్వహిస్తున్నారు.
ఇంతకు వర్మపై సీబీఐ కేసేమిటి?
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) 2018 ఫిబ్రవరి 22న యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ (RCBD1/2018/E/002) నమోదు చేసింది. బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన సింబహోలీ షుగర్స్ లిమిటెడ్ ప్రమోటర్లు, డైరెక్టర్లపై 11 మందిపై కేసు ఫైల్ చేశారు. 10 వ నిందితుడిగా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో యశ్వంత్ వర్మ పేరు ఉంది.
కానీ అప్పటికే అంటే 2014 అక్టోబర్ నుంచి వర్మ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఫిర్యాదు చేసిందెవరు?
సింబహోలీ కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్లు కలిసి షుగర్‌కేన్ రైతుల పేరిట రూ.97.85 కోట్లు, తరువాత మరో రూ.110 కోట్లు రుణంగా తీసుకుని మోసం చేసినట్లు మీరట్‌కు చెందిన ఒరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సహాయ ప్రధాన మేనేజర్ మనోహర్ ధింగ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వర్మకు కంపెనీ ఎంత చెల్లించింది?
వర్మ 2009 జూన్ 30న కంపెనీలో అడిషనల్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2013 జూలై 31న జరిగిన సర్వసభ సమావేశంలో రొటేషన్ విధానంలో డైరెక్టరు పదవి నుంచి తప్పుకున్నారు. కంపెనీకి సేవలందించినందుకు ‘‘అలహాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ చేసే ప్రముఖ సీనియర్ అడ్వకేట్ యశ్వంత్ వర్మకు ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రొఫెషనల్ ఫీజుగా రూ. 0.86 లక్షలు చెల్లించిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అంతకుముందు వర్మకు రూ. 3.71 లక్షలు చెల్లించినట్లు కూడా పేర్కొంది.
రాజకీయ కోణం ఉందా?
ఈ కేసులో రాజకీయ కోణం కూడా ఉంది. ఎందుకంటే ఈ కేసులో నిందితుల్లో ఒకరైన గుర్పాల్ సింగ్.. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అల్లుడు. FIR నమోదైన నెలలోనే గుర్పాల్ సింగ్‌ను విచారణకు పిలిచారు.
ఈడీ కేసు..
CBI FIR తర్వాత మనీలాండరింగ్ కింద Enforcement Directorate కూడా కేసు విచారణ చేపట్టింది. ఈడీ కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ జి.ఎస్.సి. రావుకు అలహాబాద్ హైకోర్టు గత ఏడాది సెప్టెంబరులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని బట్టి ED విచారణ ఇంకా కొనసాగుతోందని స్పష్టమవుతుంది.