NEET డైరెక్టర్ జనరల్ తొలగింపు..
నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్‌ను కేంద్రం తప్పించింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.
ఏజెన్సీ పనితీరు పరిశీలించడానికి, పరీక్ష నిర్వహణకు అవసరమైన సిఫార్సులు చేయడానికి ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ప్యానెల్‌ను కూడా కేంద్ర మంత్రిత్వ విద్యా శాఖ ఏర్పాటు చేసింది.
"ఇక ముందు ప్రవేశ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు చేపడుతున్నాం. అవసరమైన సలహాలు, సూచనలు చేసేందుకు ప్యానెల్‌ను ఏర్పాటు చేశాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్‌పై కఠిన చర్యలు తీసుకున్నాం. కేసు విచారణ సీబీఐకి అప్పగించాం’’ అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
ఖరోలాకు ఇన్‌ఛార్జి బాధ్యతలు..
తదుపరి ఉత్తర్వుల వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT)లో ఉండాలని అధికారులు తెలిపారు. కొత్త డైరెక్టర్ జనరల్ వచ్చే వరకు ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ సింగ్ ఖరోలాకు NTA ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.
ఆరుగురి అరెస్ట్
రాష్ట్రంలో నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాకు చెందిన మరో ఆరుగురిని బీహార్ పోలీసులు శుక్రవారం (జూన్ 21) రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు ఒక అధికారి తెలిపారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు సికందర్ యాదవెందుతో సహా 13 మందిని గత నెలలో అరెస్టు చేశారు. వీరికి నార్కో అనాలిసిస్ మరియు బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
సుప్రీంలో పిటీషన్..
నీట్-యూజీలో జరిగిన అవకతవకలపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరిపించాలని పరీక్షకు హాజరైన 10 మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వీలైనంత త్వరగా కేసు దర్యాప్తు జరిపి సుప్రీం కోర్టు ముందు నివేదికను సమర్పించాలని వారు కోరారు.
అమల్లోకి కొత్త చట్టం ..
పేపర్ లీకులతో సతమతమవుతోన్న కేంద్రం యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. యుద్ధప్రాతిపదికన 'ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్)యాక్ట్-2024ను అమల్లోకి తెచ్చింది. జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ జూన్ 20న ఒక ప్రకటనలో తెలిపారు.
బిల్లుకు రాష్ట్రపతి అమోదం..
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు - 2024 ను ఫిబ్రవరి 9న రాజ్యసభ ఆమోదించింది. ఫిబ్రవరి 6న లోక్ సభ ఆమోదించింది. రాష్ట్రపతి ముర్ము ఫిబ్రవరి 12న బిల్లుకు ఆమోదం తెలిపారు.
గరిష్టంగా పదేళ్ల జైలుశిక్ష..
‘పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్-2024’ ప్రకారం ఎవరైనా ప్రశ్నపత్రం లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి సహకరించినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. లీకేజీకి పాల్పడే వారికి 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలుశిక్షతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే..ఆస్తులనూ కూడా జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునూ వారినుంచే వసూలు చేస్తారు.