అస్థిత్వ ఉద్యమాలకు గుర్తింపు!  ఎస్సీ వర్గీకరణ రణానికి ముగింపు?
x
supreme court

అస్థిత్వ ఉద్యమాలకు గుర్తింపు! ఎస్సీ వర్గీకరణ రణానికి ముగింపు?

"సామాజిక సమానత్వాన్ని సాధించడానికి పరిమిత సంఖ్యలోనైనా రిజర్వ్‌డ్ సీట్లు, ఉద్యోగాలను హేతుబద్ధంగా పంపిణీ చేయడం చాలా ముఖ్యం"


షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపై కదిలాయి. వర్గీకరణ ఉండాల్సిందేనన్న ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఎస్సీ వర్గీకరణతో ఆ కమ్యూనిటీలో అట్టడుగున ఉండి ఎటువంటి పురోగతి లేకుండా ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు మేలు జరుగుతుందని భావించాయి. దీనివల్ల అప్పటికే ఆ కమ్యూనిటీలో తమ స్థితిగతులను మెరుగుపరుచుకున్న వారికి రిజర్వేషన్లలో ఎక్కువ వాటా రాకుండా చూడడంతో పాటు అదే వర్గంలో ఉంటూ ఎటువంటి అభివృద్ధికి నోచుకోని వారికి ఎక్కువ వాటా ఇవ్వడానికి పనికి వస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు ఏకగ్రీవంగా చెప్పేందుకు తమ విభేదాలను పక్కనపెట్టాయి.

2004 తీర్పులో ఏముందంటే...


ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఇవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 2004లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరడం ఇటీవలి కాలంలో చాలా పెద్ద పరిణామం. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, వివిధ రాష్ట్రాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాదులు ఈమేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి విన్నవించారు. 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ కుదరదు. ఎస్సీలందరూ సజాతీయులేనని, వాళ్లను వేర్వేరుగా వర్గీకరించడాన్ని రాజ్యాంగం అనుమతించదని సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. వర్గీకరించడమంటే వివక్ష, అవమానించడమే అవుతుందని తీర్పునిచ్చింది. ఎస్సీలందరూ శతాబ్దాలుగా ఒకే జాతీగా ఉంటున్నారని, ఉప-వర్గీకరణ చేయలేని వారుగా ఉంటున్నారని ఆవేళ పేర్కొంది.

ఇప్పుడు వచ్చిన సమస్యలేమిటంటే...

2004 నాటి సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీలలోని అట్టడుగు వర్గాలు చాలా నష్టపోయాయనే వాదనలు బయలుదేరాయి. ఎస్సీల్లో ఉండే వాళ్లందర్నీ ఒకే గాటన కట్టడం సరికాదంటూ అస్థిత్వ ఉద్యమాలు బయలుదేరాయి. మంద కృష్ణ నాయకత్వంలో మాదిగలకు ప్రత్యేక రిజర్వేషన్ల కోసం ఏకంగా మహా పాదయాత్రే జరిగింది. మరికొన్ని ఉపకులాలు కూడా ఉద్యమ బాట పట్టాయి. తమను తాముగా గుర్తించమంటూ ఉద్యమించాయి. అయినా ఫలితం లేకపోయింది. ఎస్సీలలో ఉంటూ విద్యా, ఉద్యోగ రంగాలలో ముందుగా లబ్ధి పొందిన వారు తమ సామాజిక స్థితిగతలను మార్చుకున్నారని, ఉపయోగించుకోని వారు, అసలు అటువంటి రిజర్వేషన్లు ఉన్నాయని తెలియని వారు చాలా మంది ఉన్నారని వర్గీకరణ కోరుతున్న ఎస్సీలు వాదించారు. ఆమేరకు కోర్టుల్లో కేసులు కూడా వేశారు. గత 20 ఏళ్లుగా సాగుతున్న వ్యవహారం ఇప్పుడు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

అటార్నీ జనరల్ ఏమన్నారంటే...

ఎస్సీ వర్గీకరణ లేకపోవడమంటే అసమానతను శాశ్వతం చేస్తున్నట్టు ఉంటుంది. చివరకు అదో ప్రత్యేక వర్గంగా ఉండిపోవాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఈ ధర్మాసనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు బీఆర్‌ గవాయ్‌, విక్రమ్‌నాథ్‌, బేల ఎమ్‌ త్రివేది, పంకజ్‌ మిథాల్‌, మనోజ్‌ మిశ్రా, సతీష్‌ సీ శర్మ ఉన్నారు. ఈ ధర్మాసనం ముందు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదిస్తూ.. చిన్నయ్య కేసు తీర్పు ఎస్సీ వర్గాల మధ్య తీవ్ర అసమానతలను విస్మరించింది, సజాతీయ సమూహంగా పరిగణించి ఎస్సీలందర్నీ ఒకే గాటన కట్టడం సరికాదన్నారు. కేంద్రం ఈమేరకు పార్లమెంటులో చట్ట సవరణ చేసి ఎస్సీ జాబితాలోని సమూహాల మధ్య కోటాను హేతుబద్ధీకరించాలన్నారు. ఈ వర్గాల మధ్య అసమానతలను అంతం చేయడానికి చర్యలు తీసుకునేలా రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు అటార్నీ జనరల్.

సోలిసిటర్ జనరల్ వాదన ఎలా సాగిందంటే..

ఇంకో అడుగు ముందుకు వేసిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మరింత స్పష్టత ఇచ్చారు. ఎస్సీ వర్గాల ఉప వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు. వందల ఏళ్లుగా బాధపడుతున్న వారికి న్యాయం దక్కాలని, వివక్షను రూపుమాపి అన్ని వర్గాలతో సమానంగా తీసుకురావాలన్నదే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అన్నారు. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల ప్రకటిత విధానానికి కేంద్రం కట్టుబడి ఉందని మెహతా అన్నారు.

పెద్ద కేటగిరీలో వారి సామాజిక, విద్యాపరమైన లేమి తీవ్రతను బట్టి కోటా ప్రయోజనాలను గ్రేడ్ చేయవచ్చునని, SCలను ఉప-వర్గీకరించడం వల్ల ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఉంటుందని తుషార్ మెహతా అన్నారు. "రాజ్యాంగ ఆదర్శమైన సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, విధానాలను రూపొందించడానికి తగిన స్పేస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది. ఇది వాస్తవ సమానత్వ అవకాశాలను సాధించడానికి ప్రయత్నిస్తుంది" అన్నారు తుషార్.

వర్గీకరణ లేకపోతే శాశ్వతంగా అసమానతే...

"ఉప-వర్గీకరణ లేకపోవడం రిజర్వ్‌డ్ కేటగిరీలో అసమానతను శాశ్వతం చేస్తుంది. ఈ విషయంలో తగిన విధానాన్ని రూపొందించకుండా ప్రభుత్వాలను నిరోధిస్తుంది. రిజర్వేషన్ ప్రయోజనాలు ప్రకృతిలో పరిమితమైనవి. రాష్ట్రం ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో పరిమిత సంఖ్యలో సీట్లను, ఉద్యోగాలలో పోస్ట్‌లను మాత్రమే రిజర్వ్ చేయగలదు. సామాజిక సమానత్వాన్ని సాధించే ఉద్దేశ్యాన్ని సాధించడానికి పరిమిత సంఖ్యలో రిజర్వ్‌డ్ సీట్లు, ఉద్యోగాలను హేతుబద్ధంగా పంపిణీ చేయడం చాలా ముఖ్యం" అని మెహతా అన్నారు.

"సమాజంలో తరతరాలుగా వివక్ష, ఎడబాటు, వెలిబాటు కొనసాగుతూనే ఉందని, ఇందులో ఎటువంటి సజాతియత లేదని, శతాబ్దాలుగా ఈ వర్గాల బాధల తారతమ్యాలలో సజాతీయత లేదు" అన్న కపిల్ సిబల్ వాదనతో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది.

అందరూ తలపండిన న్యాయవాదులే...

వివిధ రాష్ట్రాల తరఫున వాదిస్తున్న సీనియర్ లాయర్లు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. సీనియర్ న్యాయవాది శేఖర్ నఫాడే (తమిళనాడు), సిద్ధార్థ్ లూథ్రా (తెలంగాణ), కెకె వేణుగోపాల్ (ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గానికి), ఎస్ మురళీధర్ (ఆంధ్రప్రదేశ్), అరుణ్ భరద్వాజ్ (హర్యానా), నిధేష్ గుప్తా, సల్మాన్ ఖుర్షీద్, రాకేష్ ఖన్నా, డీఎస్ నాయుడు, గోపాల్ శంకరనారాయణన్ లాంటి వాళ్లు తమ వాదనల లిఖిత పూర్వక ప్రతులను సుప్రీం ధర్మాసనానికి అందించారు. ఈ కేసును త్వరగా విచారించి ముగించాలని కోరారు.

మంద కృష్ణ మాదిగ మాట నెగ్గినట్టేనా...

ఆమధ్య హైదరాబాద్ లో మంద కృష్ణ మాదిగ నిర్వహించిన మహా సమ్మేళనానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ విషయాన్నిఅధ్యయనం చేయడానికి ఓ కమిషన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపైకి వచ్చి 2004 నాటి చిన్నయ్య కేసు తీర్పును సమీక్షించాలని కోరడం అస్థిత్వ ఉద్యమాలకు పెద్ద గుర్తింపుగా అభివర్ణించారు డాక్టర్ చెన్నయ్య. ‘ఏకాభిప్రాయానికి రావడమంటే కేవలం పక్షపాత వైషమ్యాల నేపథ్యం వల్ల మాత్రమే కాదు. షెడ్యూల్డ్ కులాలలో తారతమ్యాలు ఉన్నాయన్న వాస్తవికతను గుర్తించడం. ఆ విషయాన్ని రాజకీయ పార్టీలు కూడా పసిగట్టి జాగ్రత్తగా మసులుకోవడం’ అన్నారు పౌరహక్కుల సంఘం నాయకుడు ఎం.శేషగిరిరావు.

చండీగఢ్ వాదన ఇదీ...

చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రాతినిధ్యం వహించిన న్యాయవాది కను అగర్వాల్... కేంద్ర ప్రభుత్వం SC జాబితాలో చేర్చడానికి గుర్తించిన వర్గాలకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను చార్ట్‌ను కోర్టుకు సమర్పించారు. ఆర్టికల్ 15, 16 ద్వారా సంక్రమించే అధికారాలను రాష్ట్రాలకు వదిలివేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణపై 2000లో ఆంధ్రప్రదేశ్, 2006లో పంజాబ్ చేసిన చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ తీర్పుపై ప్రస్తుతం సమీక్ష జరుగుతోంది. బుధవారం అనుకూల వర్గాల వాదనలు వినగా గురువారం ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే వారి వాదనలను సుప్రీంకోర్టు విననుంది.

Read More
Next Story