ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా ముందున్న సవాళ్లేమిటి?
x

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా ముందున్న సవాళ్లేమిటి?

‘‘ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ పూర్తి నియంత్రణ ఉండటం వల్ల రేఖాగుప్తా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తక్కువే’’- రాజకీయ విశ్లేషకులు


Click the Play button to hear this message in audio format

ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM)గా రేఖా గుప్తా(Rekha Gupta) పగ్గాలు చేపట్టారు. ఆమె ప్రమాణ స్వీకారం చేయడంతోనే ప్రధాన రాజకీయ ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. కాలుష్యం, విద్య, పాలన అంశాలు గుప్తా ముందున్న కీలక సవాళ్లు. వీటిని గుప్తా పరిష్కారం చూపగలదా? లేక బీజేపీ(BJP) అధిష్ఠానానికి లోబడి పని చేస్తారా? అనే విషయాలపై నీలూ వ్యాస్ హోస్టుగా వ్యవహరించే 'క్యాపిటల్ బీట్' డిబేట్‌లో.. సీనియర్ పాత్రికేయులు పునీత్ నికోలస్ యాదవ్, టీకే రాజలక్ష్మి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

బీజేపీ నమ్మకస్తురాలిగా పేరున్న రేఖాగుప్తాకు ఎలాంటి ప్రధాన వివాదాల్లేవు. ఆమె బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. వివిధ కుల, ప్రాంతీయ నేపథ్యాల నుంచి కేబినెట్‌లోకి ఆరుగురు మంత్రులను తీసుకోవడం వెనక.. పాలన, ఎన్నికల వ్యూహానికి బీజేపీ సమన్యాయం చేసినట్లు కనిపిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా..అసలు అధికారం గుప్తా చేతిలో ఉంటుందా? లేక కేంద్రలోని అగ్రనేతలే అన్ని నిర్ణయాలు తీసుకుంటారా? అన్న అంశంపై పునీత్ యాదవ్ వ్యాఖ్యానిస్తూ.. "ఈ ప్రభుత్వం కావచ్చు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కావచ్చు. ఢిల్లీ ప్రభుత్వానికి పూర్తి స్వయంప్రభుత్వ అధికారాలు లేవు. గత సీఎం షీలా దీక్షిత్‌(Sheila Dikshit)కు ఉన్న స్వతంత్రత రేఖాగుప్తాకు ఉండకపోవచ్చు. ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ పూర్తి నియంత్రణ ఉండటం వల్ల గుప్తా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తక్కువే అని చెప్పాలి. ఒకవేళ కీలక నిర్ణయాలు తీసుకున్న వాటిని కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు అమలు చేసే అవకాశాలే ఎక్కువ,’’ అని పేర్కొన్నారు.

సామాజిక సమతుల్యతా పాటించారా?

గుప్తా కేబినెట్‌లో మంత్రుల ఎంపికను పరిశీలిస్తే.. కుల, ప్రాంతీయ ప్రాతినిథ్యానికి అవకాశం ఇచ్చినట్లు కనిపిస్తోంది. మంత్రులుగా పర్వేష్ వర్మ, కపిల్ మిశ్రా, మంజిందర్ సింగ్ సిర్సా ప్రమాణ స్వీకారం చేశారు. "పర్వేష్ వర్మ(Parvesh Verma), కపిల్ మిశ్రా మినహా మిగతా మంత్రులకు పాలనా అనుభవం తక్కువ. ఈ కేబినెట్ అధికంగా పాలనా సామర్థ్యాని కంటే సామాజిక సమతుల్యతకే ప్రాధాన్యతనిచ్చినట్లుగా కనిపిస్తోంది," అని పేర్కొన్నారు పునీత్.

వివాదరహిత వ్యక్తికే పట్టం..

రాజలక్ష్మి మాట్లాడుతూ.. "రేఖా గుప్తా నియామకం వ్యూహాత్మకమే. ఇతరుల కంటే ఆమె వివాదరహిత వ్యక్తి. ఆమె నియామకంతో పార్టీకి ఏ ఇబ్బందులు ఉండవు. అందుకే ఆమెను ఎంచుకున్నారు,’’ అని పేర్కొన్నారు.

గత వివాదాలు మళ్లీ తెరపైకి..

గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. గతంలో ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక పాత వీడియోలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) మూసివేయాలని డిమాండ్ చేస్తూ.. ఖరీదైన గ్యాడ్జెట్లను వాడుతూనే.. ఉచిత సౌకర్యాల కోసం విద్యార్థులు డిమాండ్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. మరో వీడియోలో MCD ఎన్నికల సమయంలో ఆమె హింసాత్మకంగా వ్యవహరించిన ఘటనలు బయటకొచ్చాయి.

"ఈ ట్వీట్లు, వీడియోలు యాదృచ్ఛికంగా లేవు. బీజేపీ సిద్ధాంతాలను ప్రతిబింబిస్తున్నాయి. గుప్తా అధిష్ఠానానికి నిబద్ధతగా పనిచేసుకుంటూ వెళ్తే.. ఈ వివాదాలు పాలనపై పెద్దగా ప్రభావం చూపవు,’’ అని యాదవ్ అన్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర ఏంటి?

ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ (LG) ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ నిరంతరం వార్తల్లో నిలిచేవారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన కాస్త వెనక్కు తగ్గే అవకాశం ఉంది.

"LG ఇకపై ప్రభుత్వం నిర్ణయాలకు అడ్డుగా ఉండరు. ఫైళ్లు తిరస్కరించడం, విధానాలను నిలిపివేయడం వంటి ఘటనలు తగ్గిపోతాయి. ఇప్పుడు ఆయన బీజేపీ పాలనాకు అనుకూలంగా పని చేస్తారు," అని రాజలక్ష్మి అభిప్రాయపడ్డారు.

అనుభవం ఉన్న నేతను పక్కనపెట్టారా?

అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి అవుతారని చాలామంది భావించారు. అయితే చివరకు ఆయనకు ఆ అవకాశం దక్కకపోవడంపై రాజలక్ష్మి మాట్లాడుతూ.."బీజేపీ క్రమశిక్షణను బయటపెట్టే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నిర్ణయాన్ని అంగీకరించాల్సిందే అని వర్మకు స్పష్టం చేశారు."

యాదవ్ విశ్లేషిస్తూ.. "ప్రాంతీయంగా బలమైన నేతను ముఖ్యమంత్రిని చేయడానికి బీజేపీ కేంద్ర నాయకత్వం ఇష్టపడదు. మోదీ-షాహ్ ద్వయం అధికారం పూర్తిగా తమ చేతుల్లో ఉంచుకోవాలని చూస్తుంది," అని అన్నారు.

ఢిల్లీలో ఆప్ భవిష్యత్తు..

22 మంది ఎమ్మెల్యేలతో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇప్పుడు కఠోర రాజకీయ పరీక్ష ఎదుర్కొంటోంది. యాదవ్ అభిప్రాయపడుతూ.."బీజేపీ ఈసారి ఆప్‌ను ఉక్కిరిబిక్కిరి చేయడానికి సిద్ధంగా ఉంది. కేబినెట్‌లో కపిల్ మిశ్రా, పర్వేష్ వర్మ వంటి నేతలు ఉండటమే దానికి సంకేతం."

అయితే ఆప్ తన అసెంబ్లీ నేతగా అతిశీని ఎంపిక చేసుకుంటుందా? గోపాల్ రాయ్‌ను ఎంచుకుంటుందా? మళ్లీ ఢీ అంటే ఢీ అనే రాజకీయాలు నడిపిస్తారా? లేక మరింత న్యాయపూర్వకంగా వ్యవహరిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

మొత్తంమీద రేఖా గుప్తా కాలుష్యం, విద్య, పరిపాలనపై కీలక నిర్ణయాలు తీసుకుంటారా? బీజేపీ ప్రభుత్వపాలనా శైలి ఎలా ఉండబోతోంది? ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన ప్రతిపక్షంగా నిలుస్తుందా? ఢిల్లీ పాలన కేంద్రం చేతుల్లో ఉంటుందా? లేక గుప్తా తనదైన ముద్ర వేయగలరా? అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.


Read More
Next Story