నాటి సుప్రీం చారిత్రాత్మక తీర్పునకు కల్నల్ సోఫియా విజయాలే కారణం..
x

నాటి సుప్రీం చారిత్రాత్మక తీర్పునకు కల్నల్ సోఫియా విజయాలే కారణం..

మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ వర్తింపజేయాల్సిందేనని తీర్పునిచ్చిన అత్యున్నత న్యాయస్థానం..


Click the Play button to hear this message in audio format

సుప్రీంకోర్టు(Supreme Court)2020 ఫిబ్రవరి 17న చారిత్రాత్మక తీర్పునిచ్చింది. సర్వీసుతో సంబంధం లేకుండా సైన్యంలోని మహిళా అధికారులకు పురుష అధికారులతో సమానంగా కమాండ్ స్థానాలు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. మహిళలకు కమాండ్ హోదాలకు నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ.. తన తీర్పులో కర్ణల్ సోఫియా ఖురేషి(Sofiya Qureshi) విజయాలను కోర్టు ప్రస్తావించింది.

‘‘ఖురేషి 'ఎక్సర్సైజ్ ఫోర్స్ 18'లో భారత బృందానికి నేతృత్వం వహించిన తొలి మహిళా అధికారి. 2006లో కాన్గోలో ఐక్యరాజ్యసమితి శాంతిరక్షణ మిషన్‌లో పాల్గొన్నారు. ఆమె సేవలు మహిళల శక్తిని స్పష్టం చేశాయి.’’ అని పేర్కొంది.

మీడియా ముందుకు రావడంతో సుప్రీంకోర్టు తీర్పు మరోసారి వెలుగులోకి..

'ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor)పై మీడియాకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన బ్రీఫింగ్‌లో కర్ణల్ ఖురేషి, భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రితో కలిసి పాల్గొన్నారు. మిషన్‌కి సంబంధించిన సాంకేతిక, సైనిక అంశాలను మహిళా అధికారులిద్దరూ వివరించారు. ఖురేషి విజయాలను పరిగణనలోకి తీసుకుని మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్‌ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మరోసారి గుర్తుకు వచ్చాయి.

పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా..

మీడియా సమావేశానికి కొన్ని గంటల ముందు భారత సాయుధ దళాలు పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో తొమ్మిది ఉగ్రస్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఈ దాడులు చేసింది. 100 మంది ఉగ్రవాదులు హతమయినట్లు సమాచారం. తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సన్నిహితులు మరణించారని జెఎం చీఫ్ మౌలానా మసూద్ అజార్ అంగీకరించాడు.

ఖురేషి ప్రస్థానం..

1974లో గుజరాత్‌లోని వడోదరలో జన్మించిన ఖురేషి.. 1997లో మనోనమనియం సుందరనార్ యూనివర్సిటీ నుండి బయోకెమిస్ట్రీలో మాస్టర్స్ పూర్తిచేశారు. 1990లో సైన్యంలో చేరి, కమిషన్డ్ ఆఫీసర్‌గా భారత సైన్యంలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించారు. ఆసియాన్ దేశాలు పాల్గొన్న ‘ఫోర్స్ 18’లో భారత సైనిక శిక్షణ బృందానికి నేతృత్వం వహించిన తొలి మహిళా అధికారి కూడా. ఆమెకున్న విశేష అనుభవం కారణంగా ఎన్నో ఉన్నత స్థాయి పదవుల్లో కొనసాగారు. 2006లో కాంగో శాంతిస్థాపక మిషన్‌లో ఖురేషి చేసిన సేవలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయి.

శాశ్వత కమిషన్ అంటే ఏమిటి?

షార్ట్ సర్వీస్ కమిషన్ కింద మహిళలు సైన్యంలో 10 నుంచి 14 ఏళ్లు మాత్రమే సేవలు అందిస్తున్నారు. ఆ తర్వాత వారు పదవీ విరమణ చేయాలి. కానీ ఇప్పుడు వారు శాశ్వత కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్యంలో తమ సేవలు కొనసాగించవచ్చు. వారికి పెన్షన్, మిగతా అన్ని భత్యాలూ లభిస్తాయి. 1992లో షార్ట్ సర్వీస్ కమిషన్ కోసం మహిళల మొదటి బ్యాచ్‌ను భర్తీ చేశారు. అప్పట్లో ఇది ఐదేళ్ల వరకే ఉండేది. ఆ తర్వాత ఆ సేవల పరిధిని 10 ఏళ్లకు, 2006లో 14 ఏళ్లకు పెంచారు.

Read More
Next Story