పెద్దల సభకు కాంగ్రెస్ పిలగాడు  ఎవరీ బల్మూర్, ఏమా కథ!
x
బల్మూర్ వెంకట్

పెద్దల సభకు కాంగ్రెస్ పిలగాడు ఎవరీ బల్మూర్, ఏమా కథ!

ప్రగతి భవన్ ను ముట్టడించి బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసినందుకా.. జనం నాడి తెలిసిన వైద్యుడని ఇచ్చారా.. ఏమైనా పెద్దల సభకు ఓ చిన్న వయస్కుడు.. ఇదో రికార్డు..


ప్రయోగాలు చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ దిట్ట. చరిత్ర మరుగున పడిన వారిని ఒక్కసారిగా పైకి తీసుకువస్తుంది. చక్రం తిప్పుతున్న వారిని శంకరగిరి మాన్యాలూ పట్టిస్తుంది. అసలు కాంగ్రెస్‌ పార్టీ రూటే సెపరేటు. 'కాంగ్రెస్‌ పార్టీ చాలా భిన్నమైన పార్టీ. ఎవర్ని ఎప్పుడు గుర్తించాలో కాంగ్రెస్‌ నాయకత్వానికి తెలుసు' అన్నారు ఆ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్‌. నిజానికి ఎమ్మెల్సీ పదవిని ఆశించిన వారిలో ఈయన ఒకరని వార్తలు వచ్చాయి. అలాంటిది ఆయనకు కాకుండా అతి చిన్న వయస్కుడైన విద్యార్థి నాయకుడు, టీఎస్ పీఎస్సీ అవినీతి అక్రమాలపై దండెత్తిన యువకుడు బల్మూరు వెంకట్‌ని పెద్దల సభకు ఎంపిక చేసి చరిత్ర సృష్టించింది. దేశ రాజకీయాల్లోనే ఇదో సరికొత్త రికార్డు. ఇండియాలోనే అతి చిన్న వయస్కులైన ఎమ్మెల్యేతోపాటు ఎమ్మెల్సీ.. ఈ పార్టీకి చెందిన వారే కావడం విశేషం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పోటీ చేసి గెలుపొందిన మైనంపల్లి రోహిత్‌.. దేశంలోనే అతి చిన్న వయసున్న ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టి రికార్డు సృష్టించారు. తాజాగా.. NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్‌ వెంకట్‌ సైతం చిన్న వయసులోనే శాసనమండలిలో అడుగుపెడుతూ మరో రికార్డు నమోదు చేయబోతున్నారు.

ఎవరీ బల్మూర్ వెంకట్...


పూర్తి పేరు బల్మూరి వెంకట్‌ నర్సింగరావు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. బల్మూరి వెంకట్‌ తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, కాల్వ శ్రీరాంపూర్ మండలం, తారుపల్లి గ్రామంలో జన్మించాడు. ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలంటే మక్కువ చూపే వెంకట్.. వివిధ ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2015లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఎన్‌ఎస్‌యూఐ కు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2017లో, 2018లో ఎన్ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2018 ముందస్తు ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించినప్పటికీ టికెట్ దక్కలేదు. బల్మూరి వెంకట్‌ నర్సింగరావును 2021 అక్టోబర్ 10న జరిగే హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత జరిగిన బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఓసారి ప్రగతి భవన్ గేట్లు తన్ని లోపలికి పోయేందుకు ప్రయత్నించి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రాహుల్ కి దగ్గరయ్యారు. ఇటీవలి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టే విని ఇప్పుడు పార్టీ తరఫున పెద్దల సభకు ఎన్నికయ్యారు.

పెద్దల సభకు అతి పిన్న వయస్కుడు...


ఇక పెద్దల సభగా పేరొందిన శాసనమండలిలో కూడా NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్‌ వెంకట్‌ సరికొత్త రికార్డు నమోదు చేయనున్నారు. ఆయన్ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ పార్టీ బరిలో దింపుతోంది. అసెంబ్లీలో తగిన బలం ఉండటంతో బల్మూర్‌ వెంకట్‌ ఏకగ్రీవంగా ఎన్నికవడం లాంఛనమే. కేవలం 30 ఏళ్ల వయసులోనే శాసనమండలిలో అడుగు పెట్టబోతున్నారు బల్మూర్‌ వెంకట్‌. NSUI అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ తరఫున అనేక ఉద్యమాలు చేసిన వెంకట్‌ సేవలను కాంగ్రెస్‌ హైకమాండ్‌ గుర్తించింది. ఈ క్రమంలోనే పార్టీలో ఎంతమంది సీనియర్లు ఉన్నా.. వారందరినీ పక్కనపెట్టి బల్మూర్‌ను పెద్దల సభకు పంపుతోంది కాంగ్రెస్‌ పార్టీ. మొత్తం మీద.. 26 ఏళ్ల వయసులోనే దేశంలోనే అతి తక్కువ వయసున్న ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్‌ ఇప్పటికే రికార్డు సృష్టిస్తే.. 30 ఏళ్ల వయసులోనే పెద్దల సభకు వెళ్లనున్న బల్మూర్‌ వెంకట్‌ మరో రికార్డు నమోదు చేయనున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 30 సంవత్సరాల 9 నెలలు. ఇప్పటికున్న రికార్డు ప్రకారం 33 ఏళ్ల వయసులో ఓ యువకుడు గుజరాత్ శాసనమండలికి ఎన్నికయ్యారు. ఇప్పుడా రికార్డును బల్మూర్ వెంకట్ బ్రేక్ చేశారు.

26 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే...


ఇక, ఎమ్మెల్యేలలోనూ అతి పిన్న వయస్కుడు కాంగ్రెస్ అభ్యర్థే. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ధుల్లో మైనంపల్లి రోహిత్‌.. అతిచిన్న వయసున్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. కేవలం 26 ఏళ్లకే మెదక్‌ స్థానం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారాయన. పొలిటికల్‌ ఇంట్రెస్ట్ బాగా ఉన్న రోహిత్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఆయన తండ్రి మైనంపల్లి హన్మంతరావు.. పొలిటికల్‌ కెరీర్‌ని ఫణంగా పెట్టి మరీ కొడుకు కోసం కష్టపడ్డారు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను కాదనుకొని.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్‌ నుంచి మల్కాజిగిరిలో మైనంపల్లి హన్మంతరావు, మెదక్‌ నుంచి రోహిత్‌ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో రోహిత్‌ గెలుపొందినా.. హన్మంతరావు మాత్రం ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం దేశంలోనే అతి చిన్న వయసు గల ఎమ్మెల్యేగా రోహిత్‌రావు రికార్డు నమోదు చేశారు. ఆయన తర్వాత తెలంగాణలో అతి చిన్న వయసులో అసెంబ్లీలో ఉన్నది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి. ఆమె వయసు 27 ఏళ్లు. ఇక పెద్దల సభలో అతి పిన్న వయస్కుడు బల్మూర్ వెంకట్.



Read More
Next Story