హర్యానాలో కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఇదే..వాగ్దానం చేసిన రాహుల్..
రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్ద కాలం నుంచి భరిస్తున్న బాధల నుంచి హర్యానా ప్రజలకు విముక్తి కల్పిస్తుందని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్ద కాలం నుంచి భరిస్తున్న బాధల నుంచి హర్యానా ప్రజలకు విముక్తి కల్పిస్తుందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శనివారం ఆయన హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, ప్రతిపక్ష నాయకుడు భూపిందర్ సింగ్ హుడా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇతర నాయకులతో కలిసి పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. రైతుల సంక్షేమం కోసం కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అమరవీరుల కుటుంబాలకు రూ.2 కోట్లు సాయం అందిస్తామన్నారు. ఉపాధి, కోసం కార్మిక-ఇంటెన్సివ్ యూనిట్లు, హర్యానా మైనార్టీ కమిషన్ తిరిగి ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అగ్నివీర్ పథకం దేశభక్తి గల యువత ఆకాంక్షలను దూరం చేసిందని, ద్రవ్యోల్బణం మహిళల స్వావలంబనను దూరం చేసిందని రాహుల్ ఆరోపించారు. నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల హక్కులను హరించే ప్రయత్నం చేశారని, నోట్ల రద్దు, జీఎస్టీ ద్వారా లక్షలాది మంది చిరు వ్యాపారులకు నష్టం కలిగించారని విమర్శించారు. తమ స్నేహితులకు ప్రయోజనం చేకూర్చేందుకు హర్యానా ఆత్మగౌరవాన్ని కూడా లాగేసుకున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ హామీల గురించి చెబుతూ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం రెండు లక్షల మందికి పర్మినెంట్ ఉద్యోగాలిస్తామని చెప్పారు. డ్రగ్స్ రహిత హర్యానాగా తీర్చిదిద్దుతామన్నారు. రూ. 25 లక్షల వరకు ఉచిత చికిత్స, మహిళలకు నెలకు రూ. 2,000, రూ. 500 గ్యాస్ సిలిండర్, పేదలకు 100 గజాల ప్లాట్లు ఇస్తామని చెప్పారు. రూ.3.5 లక్షలతో రెండు గదుల ఇళ్లు, పాత పెన్షన్ విధానం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నెలకు రూ.6వేలు పింఛను, 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు ఎంఎస్‌పీ హామీ, తక్షణ పంట నష్టపరిహారం, క్రిమీ లేయర్ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచుతామని వివరించారు.
అక్టోబరు 5న హర్యానా ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.