బీహార్ ఎన్నికల్లో సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ సీట్ల వాటా ఎంత?
x

బీహార్ ఎన్నికల్లో సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ సీట్ల వాటా ఎంత?

ఈ సారి పంపకాల్లో కాంగ్రెస్, ఆర్జేడీలు తగ్గాలన్న దీపాంకర్ భట్టాచార్య..


Click the Play button to hear this message in audio format

బీహార్‌(Bihar)లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌లో జరగనున్న నేపథ్యంలో అటు ఎన్డీఏ, ఇటు మహా కూటమి(Mahagathbandhan)లో సీట్ల పంపకాలపై పార్టీల్లో చర్చలు ఊపందుకున్నాయి. ప్రతిపక్ష మహా కూటమి భాగస్వామ్య పార్టీ సీపీఐ(ఎంఎల్) లిబరేషన్.. ఈ సారి తమకు 40 సీట్లు కేటాయించాలని ఆ పార్టీ (CPI(ML) Liberation) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 243 స్థానాలకు గత ఎన్నికల్లో 19 స్థానాలు మాత్రమే కేటాయించారని, ఈ సారి 40 స్థానాల్లో పోటీచేయాలనుకుంటున్నామని చెప్పారు. కాంగ్రెస్(Congress), ఆర్జేడీ(RJD) సీట్ల సర్దుబాటుపై బాగా ఆలోచించుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో హస్తం పార్టీ అతి ఆశే.. మహాఘట్బంధన్‌ను దెబ్బతీసిందన్నారు. ‘‘2015లో కాంగ్రెస్ పోటీ చేసిన 40 సీట్లలో 27 గెలుచుకుంది. కానీ 2020లో 70 సీట్లలో పోటీ చేసి 19 మాత్రమే దక్కించుకుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు 70 సీట్లు డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గెలుపోటములపై సమగ్రంగా అంచనాలు వేసుకుని డిమాండ్ చేయాలి’’ అని హితవు పలికారు. ఇప్పటికే తమ పార్టీ 40 సీట్ల జాబితాను మహా కూటమిని సమర్పించామని భట్టాచార్య చెప్పారు.


2020 ఎన్నికల్లో ఎవరికి ఎన్ని?

RJD పోటీ చేసిన 144 సీట్లలో 75 సీట్లను గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. CPI(ML) లిబరేషన్ తాను పోటీ చేసిన 19 సీట్లలో 12 సీట్లను గెలుచుకుని సత్తా చాటింది. CPI, CPI(M) చెరో రెండు స్థానాలను గెలుచుకున్నాయి.


మహా కూటమి భాగస్వాములెవరు?

ప్రస్తుతం ఆరు పార్టీలతో మహా కూటమి ఏర్పడింది - ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, సీపీఐ, సీపీఐ(ఎం), కొత్తగా చేరిన ముఖేష్ సాహ్ని నేతృత్వంలోని వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ). త్వరలో లోక్ జనశక్తి పార్టీ (పరాస్ వర్గం), జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కూడా ఈ కూటమితో జతకట్టే అవకాశం ఉంది.

"మనం ఈ సారి మరికొంత మందికి అవకాశం ఇవ్వాలి. JMM పోటీ చేస్తుందా..లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ అసలు విషయం ఏమిటంటే.. కూటమి పెద్దదైంది. దానికి తగ్గట్లుగా సీట్ల సర్దుబాటు జరగాలి. "అని చెప్పారు భట్టాచార్య.

మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఆయన మాట్లాడుతూ.. "అధికారిక ప్రకటన ఏదీ ఉండకపోవచ్చు, కానీ భారత కూటమిలో ఆర్జేడీ అతిపెద్ద పార్టీ. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్‌(Tejashwi Yadav)కు ఆ అవకాశం ఇస్తారని అనుకుంటున్నా " అని తన అభిప్రాయాన్ని చెప్పారు.

Read More
Next Story