సెబి ఛైర్‌పర్సన్‌పై ఆధారాలు బయటపెట్టిన కాంగ్రెస్..
x
విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్న పవన్ ఖేరా..

సెబి ఛైర్‌పర్సన్‌పై ఆధారాలు బయటపెట్టిన కాంగ్రెస్..

మాధబి బుచ్‌ నిబంధనలను అతిక్రమించారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సెబీ ఛైర్‌పర్సన్ ఉంటూనే ఐసీఐసీఐ బ్యాంక్‌‌కు సేవలందించి వేతనం పొందారన్నది ప్రధాన ఆరోపణ..


సెబి ఛైర్‌పర్సన్ మాధబి బుచ్‌ (Buch)పై కాంగ్రెస్ పార్టీ తాజాగా మరోసారి ఆరోపణలను మోపింది. సెబీ ఛైర్‌పర్సన్ బాధ్యతలు చేపడుతూనే.. ఐసీఐసీఐ బ్యాంక్‌‌కు సేవలందిస్తున్నా వేతనం తీసుకుంటున్నారని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగాధిపతి పవన్ ఖేరా ఆరోపించారు. ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

బుచ్ ఏప్రిల్ 5, 2017 నుంచి అక్టోబర్ 4, 2021 వరకు SEBI హోల్ టైమ్ మెంబర్ (WTM)గా, మార్చి 2, 2022 నుండి చైర్‌పర్సన్‌గా కొనసాగాయని ఖేరా చెప్పారు. ఆ సమయంలో ప్రైవేటు బ్యాంకులకు కూడా తన సేవలందిస్తూ డబ్బు గడించారనేది కాంగ్రెస్ ఆరోపణ.

కాంగ్రెస్ ఆరోపణల్లో కొన్ని..

1. 2017-21లో SEBI WTMగా ఉన్నప్పుడు కూడా బుచ్ ICICI బ్యాంక్ నుంచి రూ. 12.63 కోట్ల జీతం పొందారు.

2. 2017-24లో WTM తర్వాత SEBI చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు.. బుచ్ జీవిత బీమా సంస్థ ICICI ప్రుడెన్షియల్ నుంచి రూ. 22.41 లక్షల ఆదాయాన్ని పొందారు.

3. 2021 - 2023 మధ్య బుచ్ ICICI బ్యాంక్ నుంచి ESOP (employee stock options) నుంచి రూ. 2.84 కోట్లు పొందారు.

4. 2021 - 2023 మధ్య ICICI బ్యాంక్ నుంచి రూ. 1.1 కోట్లను ESOPపై TDS (మూలం వద్ద పన్ను మినహాయింపు) రూపంలో బుచ్ పొందారు.

5. ICICI బ్యాంక్ చెల్లించే ESOPపై TDS తప్పనిసరి. అయితే ఆదాయపు పన్ను రూ. 50 లక్షలు చెల్లించలేదు.

6. 2017లో బుచ్ SEBIలో చేరినప్పటి నుంచి ఈ రోజు వరకు ICICI నుంచి అందుకున్న మొత్తం రూ. 16.8 కోట్లు. ఆమె సెబీ నుంచి పొందిన ఆదాయం కంటే ఐదు రెట్లు ఎక్కువ.

7. 2017-18లో బుచ్ SEBIలో WTMగా చేరినప్పుడు.. ఆమె ICICI నుంచి 190 శాతం జీతం పొందింది. తర్వాతి సంవత్సరాల్లో 422 శాతం, 110 శాతం, 416 శాతానికి జంప్ (2020-21) అయ్యింది. సెబీ నిబంధనలకు విరుద్ధంగా బుచ్ నడుచుకున్నారని ఖేరా ప్రధాన ఆరోపణ.


నాన్-బయోలాజికల్ PM ఏం సమాధానం చెబుతారో?

"తన మౌనం ద్వారా సెబీ చైర్‌పర్సన్‌కు రక్షణ కల్పిస్తున్న నాన్-బయోలాజికల్ PM ఇప్పుడు ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారోనని’’ కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఎక్స్ వేదికగా స్పందించారు.

మోదీకి తెలియకుండా ఉంటుందా?

పీఎం నేతృత్వంలోని ఏసీసీ సెబీ చైర్‌పర్సన్‌ నిర్వాకం మోదీకి తెలియదా? కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు.

బుచ్ సెబిలో ఉన్న సమయంలో.. ఐసిఐసిఐకి కూడా సేవలందిస్తూ జీతం/ఆదాయాన్ని పొందుతున్నారన్న విషయం ప్రధానికి తెలియదా? అసలు సెబీ చైర్‌పర్సన్‌ను ఎవరు కాపాడుతున్నారు? అని ప్రశ్నించారు.

ఏసీసీలో మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు.

Read More
Next Story