
హత్యచేసి.. ఆపై సూట్‌కేసులో పెట్టి..
హర్యానాలో ఓ యువ మహిళ కాంగ్రెస్ కార్యకర్త హిమాని నర్వాల్ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
హర్యానా రాష్ట్రం రోహ్‌తక్ జిల్లా సంప్లా పట్టణంలోని బస్‌స్టాండ్ వద్ద శనివారం (మార్చి 1) ఒక సూట్‌కేసులో మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై సంప్లా ఎస్‌హెచ్ఓ బిజేందర్ సింగ్ మాట్లాడుతూ.. "సూట్‌కేస్‌ని ఓపెన్ చేయగానే తీవ్రగాయాలతో ఉన్న మహిళ మృతదేహం కనిపించింది. వెంటనే ఎస్‌హెచ్ఓ, ఫోరెన్సిక్ నిపుణులకు సమాచారం ఇచ్చాం. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించాం. అనంతరం మృతురాలు హిమాని నర్వాల్(22)గా గుర్తించాం,’’ అని తెలిపారు.
అమానుష హత్య..
హిమాని హత్య వార్తపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీ సీఎం భూపీందర్ సింగ్. "ఒక యువతిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టిన ఘటన షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రశ్నిస్తోంది. ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. ప్రభుత్వం నిందితులకు కఠిన శిక్షించాలి’’ అని డిమాండ్ చేశారు. రోహ్‌తక్ ఎమ్మెల్యే భారత్ భూషణ్ బత్రా ఈ హత్య కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)తో దర్యాప్తు చేయించాలని ఎస్పీని కోరారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
కేసు నమోదు..
ఘటనపై సంప్లా పోలీస్‌స్టేషన్‌లో అగంతకులపై భారతీయ న్యాయ సంహితా (BNS) సెక్షన్లు 103(1) మరియు 238(a) కింద కేసు నమోదైంది.
‘‘హిమాని చేతులకు మెహందీ ఉంది. స్కార్ఫ్ ఆమె మెడకు చుట్టి ఉంది. వేరే ప్రాంతంలో హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి బస్‌స్టాండ్ వద్ద పడేసి ఉండవచ్చు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నాం.’’అని ఎస్‌హెచ్ఓ తెలిపారు.
చురుకైన కార్యకర్త..
యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ బివి మాట్లాడుతూ..‘‘హిమాని నర్వాల్ యూత్ కాంగ్రెస్‌లో రోహ్‌తక్ రూరల్ ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు. యూత్ కాంగ్రెస్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేది. భారత్ జోడో యాత్ర సహా అన్ని కార్యక్రమాలలో తన బాధ్యతను సమర్థంగా నిర్వహించారు," అని శ్రీనివాస్ పేర్కొన్నారు. నర్వాల్ హత్యపై లోతుగా దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే బిబి బత్రా డిమాండ్ చేశారు.
హిమాని నర్వాల్ ఎవరు?
హిమాని నర్వాల్(Himani Narwal) హర్యానాలోని రోహ్‌తక్‌లో యూత్ కాంగ్రెస్(Congress) కార్యనిర్వాహకురాలు. సోనిపట్ జిల్లా కథురా గ్రామానికి చెందిన ఈమె శివాజీ కాలనీలో అద్దె ఇంట్లో ఉండేది. ఆమె తల్లి, సోదరుడు ఢిల్లీ నజఫ్గఢ్‌లో ఉంటున్నారు. హిమాని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో చురుకుగా పాల్గొన్నారు. అలాగే హర్యానా కాంగ్రెస్ సభల్లో, సామాజిక కార్యక్రమాల్లో హర్యాణ్వీ కళాకారులతో కలిసి ప్రదర్శనలు కూడా ఇచ్చారు. హిమాని మృతదేహం లభ్యమైన సమయంలో హర్యానాలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి.