
BLOల మరణంపై ఖర్గే ట్వీట్ ఏమిటి?
కాంగ్రెస్ చీఫ్ ప్రజలకు ఏమని కోరారు?
వివిధ రాష్ట్రాల్లో కొంతమంది బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO) చనిపోతుండడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (S.I.R) కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ ఉపాధ్యాయులతో చేయిస్తున్న విషయం తెలిసిందే. BLOలుగా పిలిచే వీరు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాల్సి ఉంటుంది.
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో బూత్ లెవల్ ఆఫీసర్లు(BLO)గా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు చనిపోయారు. అయితే వీరిద్దరూ ఒత్తిడి, అధిక పనిభారంతోనే చనిపోయారని వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేసింది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్..పెద్ద నోట్ల రద్దు, COVID-19 లాక్‌డౌన్‌ను గుర్తుకు తెస్తుందని కాంగ్రెస్(Congress) విమర్శిస్తోంది. బీఎల్‌వోలు మృత్యువాతపడుతున్నా.. ఎలక్షన్ కమిషన్ మౌనం వహించడం బాధాకరమని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) పేర్కొన్నారు. 19 రోజుల్లో 16 మంది BLOలు మరణించారని పత్రికల్లో వచ్చిన ఓ కథనాన్ని ఆయన తన ఎక్స్‌లో పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ.. వారిని ఎవరు ఆదుకుంటారు? ఎవరు న్యాయం చేస్తారు?" అని ఖర్గే ప్రశ్నించారు. దొంగిలించిన ఓట్లతో అధికారం దక్కించుకున్న బీజేపీకి ఎన్నికల సంఘం ఒత్తాసు పలుకుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోకపోతే, ప్రజాస్వామ్య స్తంభాలు కూలిపోవడం ఖాయమన్నారు. మీ గొంతుక విప్పి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఖర్చే పిలుపునిచ్చారు.
‘నిజంగా ఆందోళనకరం..’
పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)గా పనిచేస్తున్న మహిళ నవంబర్ 22న తన నివాసంలో మృతి చెందారు. అయితే ఆమె మరణానికి పని ఒత్తిడే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా BLO మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ‘‘నిజంగా ఆందోళనకరం’’ అమె పేర్కొన్నారు. అలాగే నవంబర్ 21న మధ్యప్రదేశ్‌లోని రైసెన్, దామో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు అనారోగ్యంతో చనిపోయారు.

