
'ఆర్జేడీ మ్యానిఫెస్టోపై కాంగ్రెస్‌కే నమ్మకం లేదు'
ఔరంగాబాద్ ర్యాలీలో ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కూటమిపై విరుచుకుపడిన ప్రధాని మోదీ..
ఆర్జేడీ( RJD) ఎన్నికల హామీలపై మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్(Congress) కూడా నమ్మకం కుదరడం లేదని ప్రధాని మోదీ(PM Modi) శుక్రవారం (నవంబర్ 7) పేర్కొన్నారు. బీహార్(Bihar) రాష్ట్రం ఔరంగాబాద్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. బీహార్ ప్రజలు ప్రతిపక్షాల "తప్పుడు వాగ్దానాలను" తిరస్కరించారని చెప్పారు. నక్సల్స్ హింస, బాంబు పేలుళ్లను కారణమైన "ఆటవిక పాలన’’ను జనం మళ్లీ కోరుకోవడం లేదన్నారు.
మొదటి దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదవడంపై మాట్లాడుతూ.. "నరేంద్ర, నితీష్ ట్రాక్ రికార్డ్" పై ప్రజల నమ్మకానికి అది నిదర్శనమని చెప్పారు. 121 నియోజకవర్గాలలో తొలిదశ ఎన్నికలు విజయవంతంగా ముగియడంపై ఎన్నికల సంఘాన్ని ప్రధాని ప్రశంసించారు. బీహార్‌లో సుపరిపాలనకు హామీ ఇచ్చే NDA ప్రభుత్వం మళ్లీ కొనసాగాలని ప్రజలు ఓట్లు వేశారని పునరుద్ఘాటించారు. రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ఆపరేషన్ సింధూర్‌ను ఉటంకిస్తూ "నేను వాగ్దానం చేసినవే చేస్తాను" అని అన్నారు.
RJD, కాంగ్రెస్ లక్ష్యంగా..
"లక్ష కోట్లలో ఎన్ని సున్నాలు ఉన్నాయో ఆర్జేడీ వాళ్లకు తెలియకపోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం గురించి వారు ఆలోచించరు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రజల భూములను లాకున్న వారు ఇప్పుడు బెయిల్‌పై బయట ఉన్నారు" అని RJDని టార్గెట్ చేశారు మోదీ.
"కాంగ్రెస్, ఆర్జేడీలకు అవమానించడం తప్ప మరేమీ తెలియదు. వారు ఛతీ మైయాను డ్రామాగా అభివర్ణించారు. మహా కుంభ్ గురించి కూడా చెడుగా మాట్లాడిన వారికి నవంబర్ 11న జరిగే రెండో దశ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి’’ అని ఓటర్లను కోరారు.

