వెళ్లండి.. కాని స్వేచ్ఛను దుర్వినియోగం చెయొద్దు
అరెస్టు చేసి రెండున్నరేళ్లు జైల్లో ఉంటారు. అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కాటరాక్ట్ ఆపరేషన్ కోసం ఆయన హైదరాబాద్‌కు వస్తున్నారు.
ఎల్గార్ కేసు: వరవరరావు(Varavara rao)కు బెయిల్ మంజూరైంది. కాటరాక్ట్ (కంటి శుక్లం) ఆపరేషన్ చేయించుకునేందుకు ముంబైలోని జాతీయ దర్యాప్తు సంస్థ (National investigation agency) (ఎన్‌ఐఏ) కోర్టు అనుమతినిచ్చింది. ఎడమ కంటి శస్త్ర చికిత్స నిమిత్తం వారం రోజుల పాటు (డిసెంబర్ 5 నుంచి 11వరకు) హైదరాబాద్ వెళ్లేందుకు న్యాయమూర్తి రాజేష్ కటారియా అనుమతించారు.
అయితే ప్రయాణ వివరాలు, హైదరాబాద్‌లో ఎక్కడ ఉండేది.. కాంట్రాక్టు నంబర్ తదితర వివరాలను ఎన్‌ఐఏకు డిసెంబర్ 4లోపు ఇవ్వాలని, ప్రయాణ అనుమతిని దుర్వినియోగం చేయవద్దని కోర్టు వరవరరావుకు సూచించింది.
తాత్కాలిక బెయిల్ ఆపై రెగ్యులర్..
2018లో ఎల్గార్ (Elgar case) పరిషత్-మావోయిస్ట్ లింకుల కేసులో వరవరరావును అరెస్టు చేశారు. ఈ కేసులో బాంబే హైకోర్టు 2021 మార్చిలో వైద్య కారణాలపై ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
ఆగస్టు 2022లో సర్వోన్నత న్యాయస్థానం వైద్యపర కారణాలతో వరవరరావుకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా ముంబైలోని ప్రత్యేక కోర్టు పరిధిని దాటి వెళ్లరాదని సూచించింది.
హైదరాబాద్ నుంచి తిరిగొచ్చాక, మరో కంటి శస్త్ర చికిత్స కోసం ట్రయల్ కోర్టును అనుమతి కోరవచ్చని జస్టిస్ ఏఎస్ గడ్కరీ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది.
ఇంతకు కేసేమిటి?
డిసెంబర్ 31, 2017న పూణేలో జరిగిన ఎల్గార్ పరిషత్ సదస్సులో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలతో రావుతో పాటు కొంతమంది వామపక్ష భావజాల కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి ప్రసంగం దేశద్రోహం పరిధిలోకి వస్తుందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
వరవరరావు గురించి..
పెంద్యాల వరవరరావు తెలంగాణకు చెందిన మావోయిస్టు సానుభూతిపరుడు.కవి. మావోయిస్టు (Maoist) భావజాలాన్ని ప్రచారం చేయడానికి విప్లవ రచయితల సంఘం (విరసం) (Virasam) స్థాపనకు బాధ్యత వహించారు. రావును గతంలో పలు సందర్భాల్లో అరెస్టు చేశారు. 1973లో ఏపీలో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద తొలిసారి అరెస్టయ్యారు.