అంబటి రాయా.. అదిరిందయ్యా ట్విస్ట్!  నిన్న జగన్ తో, ఇవాళ పవన్ తో..
x
Pavan Kalyan, Ambati Rayudu

అంబటి రాయా.. అదిరిందయ్యా ట్విస్ట్! నిన్న జగన్ తో, ఇవాళ పవన్ తో..

వైసీపీని వీడి 48 గంటలు తిరక్కముందే మళ్ళీ మరో పొలిటికల్ పిచ్ పై నిలిచారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఇంతకీ రాయుడికి ఏమి కావాలి?


ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు-ATR- మళ్ళీ వార్తల్లో వ్యక్తి అయ్యారు. వైసీపీని వీడి 48 గంటలు తిరక్కముందే మళ్ళీ మరో పొలిటికల్ పిచ్ పై నిలిచారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. ఇంతకీ అంబటి రాయుడికి ఏమి కావాలి? దేనికింత ఆరాటం?

అంబటి రాయుడికి తొందరెక్కువా?

నిజమే అంటుంటారు రాయుడి గురించి తెలిసిన ఎక్కువ మంది. అది ఇప్పుడు మరోసారి రుజువైందా అంటే అవుననే సమాధానం వస్తోంది ఆయన అభిమానుల నుంచి. “అంబటి రాయుడు ఎందుకొచ్చాడో ఎందుకు వెళ్లాడో ఆయనకే తెలియాలి. ఆయన మనసులో ఏముందో చెప్పలేం కదా” అన్నది రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు కామెంట్. అది క్రికెట్ ఆటైనా రాజకీయరంగమైనా అంబటి రాయుడు ఒకే తరహాలో బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నట్టుగా ఆయన నిర్ణయాలు ఉన్నాయి. అప్పుడెప్పుడో ఒకసారి క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించి.. ఆ మరునాడు లేదన్నాడు. మళ్ళీ క్రికెట్ ఆడతాను అని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే మాదిరిగా వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతుంది.

వైసీపీలో చేరిక, నిష్క్రమణ...


2023 డిసెంబర్ 28న వైసీపీలో చేరిన అంబటి రాయుడు వారం తిరగకుండానే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ మర్నాడు నేను మళ్ళీ క్రికెట్ ఆడబోతున్నానని, దుబాయిలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్నానని, వైసీపీ నుంచి అందుకే బయటకు వచ్చానని చెప్పారు. అది జరిగి 48 గంటలు కాకముందే ఈవేళ నేరుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఎన్నికల్లో పోటీకి సంసిద్ధత వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటల పాటు వీళ్లిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం.

ఇంతకీ అంబటి రాయుడికి ఏం కావాలి?

అంబటి రాయుడు గుంటూరు జిల్లా వాసి. గుంటూరులో పుట్టిన అంబటి రాయుడు నిజానికి మంచి క్రికెటర్. కుడిచేతి బ్యాట్స్‌మన్. అటువంటి వ్యక్తి ఇప్పుడు తన అదృష్టాన్ని రాజకీయ రంగంలో పరీక్షించుకావాలనుకోవడంలో తప్పు లేదు. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ఇవాళ రాజకీయమే. వైసీపీలో చేరినప్పుడు ఆయన తనకు గుంటూరు పార్లమెంటు లేదా పొన్నూరు అసెంబ్లీ సీటు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ససేమిరా అన్నారని, దాంతో రాయుడు గుడ్ బై చెప్పారని రాజకీయ వర్గాలు చెబుతున్న మాట.

మరి పవన్ ను ఎందుకు కలిసినట్టు...

ఇది జరిగిన రెండ్రోజుల్లోనే పవన్ కళ్యాణ్ ని ఎందుకు కలిసినట్టు? వైయస్ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏమడిగారో పవన్ కళ్యాణ్ ను కూడా అడిగారని తెలిసింది. ఆయన పార్లమెంట్ కంటే అసెంబ్లీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గుంటూరులో పుట్టి పెరిగిన అంబటి రాయుడుకి తన సొంత సామాజిక వర్గమైన కాపులు అండగా నిలుస్తారని అంచనా. జనసేనపైన ఆ ముద్ర ఉండనే ఉంది గనుక అటువైపు వెళితే బాగుంటుందని రాయుడుకి తన సన్నిహితులు చెప్పినట్టు తెలిసింది. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో కాపులున్నా 1952 నుంచి ఇప్పటి వరకు అంటే గత 17వ లోక్ సభ ఎన్నికల వరకు కాపు సామాజికవర్గానికి చెందిన ఒక్కరూ పోటీ చేయలేదు. గెలవలేదు. అందుకనే అంబటి రాయుడు పొన్నూరు అసెంబ్లీ వైపు మళ్లారు. అక్కడ కాపులు కూడా గణనీయంగానే ఉన్నారు. కానీ ఆ సీటును టీడీపీ వదులుకుంటుందా అనేది అనుమానమే.

పొన్నూరు సీటును టీడీపీ వదులుకుంటుందా...

టీడీపీ జనసేన పొత్తు ఉన్నా లేకున్నా పొన్నూరు నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, వ్యాపారవేత్త కిలారు రోశయ్య గెలిచారు. అంతకుముందు మూడు నాలుగు సార్లు దూళిపాళ్ల నరేంద్ర కుమార్ చౌదరి గెలుస్తూ వచ్చారు. అటువంటి సీటును ఇప్పుడు అంబటి రాయుడు అడుగుతున్నట్టు సమాచారం. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకి ఇస్తే, అప్పుడు అంబటి రాయుడు రంగంలోకి దిగాల్సి ఉంటుంది. నిజంగానే అంబటి రాయుడు పొన్నూరు నుంచి పోటీ చేస్తే చుట్టుపక్కల నియోజకవర్గాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇన్ని సమీకరణ మధ్య అంబటి రాయుడు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

క్రికెట్ లో అంబటి రూటే సెపరేటు...

రాయుడు 2002లో అండర్-19 భారత క్రికెట్ జట్టు తరఫున ఆడారు. ఇంగ్లాండు పర్యటనలో అక్కడ మూడవ వన్డేలో 177 పరుగులు సాధించారు. 305 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టు విజయానికి దోహదపడ్డాడు. 2003-04 లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ పోటీలో రాయుడు భారత జట్టుకు నేతృత్వం వహించాడు. 2015 ఫిబ్రవరి 14న ప్రారంభమైన ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు ఎంపికైన భారతజట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2010 నుండి చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడాడు.

రాయుడు ఐపీఎల్‌లో 204 మ్యాచ్‌లు ఆడి 4348 పరుగులు చేశాడు. 23సార్లు 50 పైన స్కోర్లు సాధించాడు. ముంబయి తరఫున మూడుసార్లు, చెన్నై తరఫున మూడుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నారు. అంబటి రాయుడు 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ చెప్పి, 2023లో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. మళ్ళీ మొన్న ఐపీఎల్ లో ఆడతానని ప్రకటించారు.

పుట్టింది గుంటూరులోనే...

అంబటి రాయుడు 1985, సెప్టెంబర్ 23న ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సాంబశివరావు, విజయలక్ష్మి. గుంటూరు, హైదరాబాదు, విశాఖపట్నంలో ప్రాథమిక విద్య సాగింది. హైదరాబాద్ సైనిక్ పురి లోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారు. రాయుడు తన స్నేహితురాలు చెన్నుపల్లి విద్యను 2009 ఫిబ్రవరి 14 న వివాహం చేసుకున్నారు.


Read More
Next Story