సాగర్ జలాల వివాదంలో కేంద్రం జోక్యం..  రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్ బలగాలు
x
CRPF FORCE AT SAGAR

సాగర్ జలాల వివాదంలో కేంద్రం జోక్యం.. రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్ బలగాలు

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా రెండు రాష్ట్రాల పోలీసుల్ని బయటకు పంపింది. కేంద్ర ప్రభత్వ ఆధ్వర్యంలోని సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించింది.


(ది ఫెడరల్ ప్రతినిధి, హైదరాబాద్)

నాగార్జున సాగర్‌ జలాల వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం కొలిక్కితెచ్చింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాల మధ్య రాజీ కుదిర్చింది. పిట్టపోరు పిట్టపోరు పిల్చి తీర్చినట్టుగా రెండు రాష్ట్రాల పోలీసుల్ని బయటకు పంపింది. కేంద్ర ప్రభత్వ ఆధ్వర్యంలోని సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించింది.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఇరు రాష్ట్రాల ఘర్షణ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు నాగార్జున సాగర్ ప్రాజక్ట్ వద్దకు చేరాయి. శుక్రవారం రాత్రికి సాగర్ డ్యామ్‌ను సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. అయితే ఇప్పటికీ డ్యామ్‌కు కుడి ఎడమ వైపులా ఏపీ- తెలంగాణ పోలీసులు మోహరించి ఉన్నాయి. నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల్లో రెండు రాష్ట్రాల పోలీసులు మోహరించి ఉన్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సాగర్ డ్యాం కుడి వైపుకు సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. మరికొద్దిసేపట్లో ఎడమ వైపునకు కూడా సీఆర్పీఎఫ్ బలగాలు వెళతాయి.

సాగర్ జలాల విడుదల విషయంలో నవంబర్ 28వ తేదీకి ముందు ఉన్న పరిస్థితి కొనసాగించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఉత్తర్వులు జారీ చేశారు. సాగర్ డ్యామ్ ను సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రెండు రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్ సెక్రటరీలకు ప్రతిపాదనలు చేశారు. ఇందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు..

తెలంగాణ సీఎస్ శాంతి కుమారి వాదన ఇలా ఉంది..

'నవంబరు 29వ తేదీ రాత్రి ఏపీకి చెందిన దాదాపు 500మంది సాయుధ పోలీసులు అర్ధరాత్రి సాగర్ డ్యామ్పైకి వచ్చి సీసీ కెమెరాలు ధ్వంసం చేయడంతో పాటు 5, 7 నంబరు గేట్లు తెరిచి దాదాపు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణలో ఉండగా ఏపీ ప్రభుత్వం చేసిన చర్య రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించింది. ఏపీ ప్రభుత్వం ఈ విధమైన అతిక్రమణలకు పాల్పడటం ఇది రెండోసారి. ఏపీ చర్యతో హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన 2కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. 2014 నుంచి కొనసాగుతున్న మాదిరిగానే స్టేటస్ కోని కొనసాగించాలని సీఎస్ శాంతి కుమారి కేంద్ర హోంశాఖను కోరారు.

న‌ల్గొండ జిల్లా నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టు కుడి కాల్వ‌కు ఏపీ అధికారులు బుధ‌వారం అర్థ‌రాత్రి నీటిని విడుద‌ల చేయ‌డంతో తీవ్ర ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. అనుమ‌తి లేకుండా ప్రాజెక్టులోని 13 గేట్ల‌ను ఎత్తివేయ‌డానికి పెద్ద‌సంఖ్య‌లో పోలీసులు, ఏపీ నీటిపారుద‌ల‌శాఖ అధికారులు చేరుకున్నారు. సాగ‌ర్ జ‌లాల్లో త‌మ‌కూ వాటా ఉంద‌ని ఏపీ అధికారులు అక్క‌డున్న తెలంగాణ అధికారుల‌తో వాగ్వాదానికి దిగారు. తాత్కాలిక విద్యుత్ ఆధారంగా నీటిని విడుద‌ల చేసుకున్నారు.

ఏపీ వైపుకు ఎటువంటి వాహ‌నాలు రాకుండా ఆ రాష్ట్ర పోలీసులు బారికేడ్లు పెట్టారు. నాగార్జున‌సాగ‌ర్ 5వ నెంబ‌రు గేటు నుండి సుమారు 500 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేసుకున్న‌ట్లు తెలంగాణ అధికారులు అంచ‌క‌నా వేశారు. ఇలాగే మ‌రో రెండు రోజులు నీటిని విడుద‌ల చేస్తే డెడ్ స్టోరేజ్‌కు చేరుకోవ‌డం ఖాయ‌మ‌ని అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక చేసేది లేక నీటి విడుద‌ల‌కు అవ‌స‌ర‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రాను తెలంగాణ అధికారులు ఆపేసి, ఆంధ్రా అధికారుల‌కు షాక్ ఇచ్చారు. అప్ప‌టితో ఏపీకి నీటి సర‌ఫ‌రా ఆగిపోయింది. మ‌రి కొద్దిసేప‌టికి తాత్కిలిక విద్యుత్ ద్వారా నీటి స‌ర‌ఫ‌రాకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ వివాదం విషయంలో రాజకీయ జోక్యం చేసుకోవద్దని, నేతలెవరూ మాట్లాడవద్దని ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖలో...

నాగార్జునసాగర్‌ కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శికి కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి లేఖ రాశారు. అక్టోబర్‌ నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. నవంబర్‌ 30వ తేదీ తర్వాత నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి అందలేదని స్పష్టం చేశారు. మరో వైపు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యామ్‌ వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్‌ డ్యామ్‌పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏపీ వైపు భారీగా పోలీసులు మోహరించారు. ఆ రాష్ట్రానికి చెందిన సుమారు 1200 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. కృష్ణా బోర్డు అధికారులు సాగర్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో కృష్ణా, గోదావ‌రి న‌దీ బోర్డులను ఏర్పాటు చేశారు. అప్పుడే శ్రీ‌శైలం జ‌లాశ‌యాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, నాగార్జున‌సాగ‌ర్ డ్యామ్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని కేంద్ర జ‌ల‌సంఘం నిర్ణ‌యించింది. కానీ అందుకు భిన్నంగా ఇరు రాష్ట్రాలు నీటిని వాడుకుంటున్నాయి. శ్రీ‌శైలం జ‌లాశ‌యంలో ఎడ‌మ విద్యుత్ కేంద్రాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. అటువైపు ఆంధ్రాకు సంబంధించిన వారిని అనుమ‌తించ‌డం లేదు. నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టులోని మొత్తం 39 గేట్ల‌లో 26 గేట్లు తెలంగాణ‌, 13 గేట్లు ఆంధ్రా అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాయి.

ఆంధ్రా పోలీసుల‌పై తెలంగాణ అధికారుల ఫిర్యాదు..

ఏపీ పోలీసులు అర్థ‌రాత్రి వేళ అక్క‌డున్న సీసీ కెమెరాల‌ను ధ్వ‌సం చేయ‌డంపై నాగార్జున‌సాగ‌ర్ పీఎస్‌లో కేసు న‌మోదు చేశారు. అనుమ‌తి లేకుండా డ్యామ్ పైకి వ‌చ్చి కుడి కాల్వ‌కు నీటిని విడుద‌ల చేశార‌ని తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు, నీటి పారుద‌లశాఖ అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నాగార్జున‌సాగ‌ర్ పోలీసులు ఏపీ పోలీసులు, నీటిపారుద‌ల‌శాఖ అధికారుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదైంది.

ఏపీ అధికారుల చ‌ర్య‌లు సరికావన్న తెలంగాణ..

నాగార్జ‌న‌సాగ‌ర్ కుడికాల్వకు ఎటువంటి స‌మాచారం, అనుమ‌తి లేకుండా 13 గేట్లు ఎత్త‌వేయ‌డం నీటి ఒప్పందాల‌ను అతిక్ర‌మించ‌డ‌మే అని తెలంగాణ ఇంజ‌నీర్ ఇన్ ఛీఫ్ జి.అనిల్‌కుమార్ అన్నారు. ఎపీ ప్ర‌భుత్వం నుండి ఎలాంటి ఇండెంట్ రాలేద‌న్నారు. అర్థ‌రాత్రి స‌మ‌యంలో పోలీసులే స్వ‌యంగా అక్క‌డున్న సీసీ కెమెరాల‌ను ధ్వంసం చేయ‌డం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని చెప్పారు. ప్ర‌భుత్వ సూచ‌న‌తో ముందుకు వెళ్తామ‌న్నారాయ‌న‌. గ‌తంలో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం అక్టోబ‌రు నెల‌లో 5 టీఎంసీల నీటిని అంద‌జేశామ‌ని, మిగిలిన 10 టీఎంసీలు 2024 జ‌న‌వ‌రి, ఏప్రియ‌ల్ నెల‌ల్లో విడుద‌ల చేయాల్సి ఉంద‌న్నారు. ఇప్ప‌టికే కృష్ణ రివర్ బోర్డు మేనేజ్ మెంట్ ఆదేశాలు జారీ చేసింద‌న్నారు. ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు ఏపీ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌ల జ‌ర‌ప‌నున్నామ‌న్నారు.

ప్రాజెక్టు సీఈ అజయ్ కుమార్ కామెంట్స్..

తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న ఒప్పందం మేరకు నీటిని విడుదల చేస్తున్నాం. అక్టోబర్ లో 5 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరిగిందని చెప్పారు. నీటి కోసం మా దగ్గర నుంచి ఎటువంటి అనుమతి ఏపీ అధికారులు కోరలేదు. దౌర్జన్యంగా 29 అర్ధరాత్రి 13 వ గేటు వరకు వచ్చారు. 5, 7 నంబర్ గేట్లు ద్వారా నీటిని విడుదల చేసుకున్నారు. ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఎంత నీరు విడుదల ఆయింది అనేది తెలియదు. కె.ఆర్.ఎం.బీ ఆదేశాల మేరకు నీటిని బంద్ చేయాలి. వారి సూచన మేరకు మేము వేచి చూస్తాం.

పరస్పర ఆరోపణలు...

ఇదిలా ఉంటే, ఏపీ తీరును తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు ఆక్షేపించారు. ఇంతకాలం లేని సమస్యను ఇప్పుడెందుకు ఏపీ ప్రభుత్వం తెర పైకి తీసుకువచ్చిందని ప్రశ్నించారు నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, కల్లుగీత కార్మిక సంఘం నాయకుడు పల్లె రవికుమార్. దీని వెనుక ఏపీలోని అధికార పార్టీ స్వప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణలను వైసీపీ పల్నాడు జిల్లా వైసీపీ నాయకులు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఖండించారు. నాగార్జున సాగర్ జలాల్లో ఏపీ వాటను కాపాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని అభిప్రాయపడ్డారు.

Read More
Next Story