Fengal Cyclone | పుదుచ్చేరిలో నలుగురి మృతి
తుఫాను ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన సీఎం ఎన్ రంగసామి నష్టాన్ని అంచనా వేసి నివేదికను కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం (ఫెంగల్ తుఫాను) కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరితో పాటు చెన్నైలోనూ తీవ్ర ప్రభావం చూపింది. పుదుచ్చేరిలో నలుగురు మృత్యువాతపడ్డారు. తుఫాను ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన సీఎం ఎన్ రంగసామి నష్టాన్ని అంచనా వేసి నివేదికను కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. తుఫాను తాకిడికి పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామని హోం మంత్రి ఎ నమశ్శివాయ చెప్పారు. విద్యుత్ సరఫరాను సోమవారం ఉదయం దశలవారీగా పునరుద్ధరించామని అధికారులు తెలిపారు. కొన్ని విద్యుత్ సబ్ స్టేషన్లు నీటమునిగాయని, వెంటనే నీటిని బయటకు పంపేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
వరత ప్రాంతాల్లో సీఎం పర్యటన..
వెంకట నగర్, కామరాజ్ నగర్, వల్లలార్ సాలై, కామరాజర్ సాలైతో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి. నివాసితులు ఇళ్లలోనే ఉండిపోయారు. నీటి ముగిసిన కాలనీల్లో ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాష్‌నాథన్ విడివిడిగా సందర్శించి బాధితులతో మాట్లాడారు. గత 50 ఏళ్లలో పుదుచ్చేరిలో ఇంత భారీ వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి అని కలెక్టర్ కులోత్తుంగన్ తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారి కోసం పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అరక్కోణం (తమిళనాడు)కి చెందిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం, ఆర్మీ సిబ్బంది సాయంతో సీనియర్ సిటిజన్లు, చిన్న పిలల్లను రిహాబిలిటేషన్ క్యాంపులకు తరలించినట్లు కలెక్టర్ తెలిపారు.
విల్లుపురంలో ఎన్నడూ లేనంతగా..
విల్లుపురం పట్టణం, సమీపంలోని గ్రామాలు తుఫాను ప్రభావానికి ఎక్కువగా లోనయ్యాయి. వరద నీరు లోతట్టు ప్రాంతాలకు ప్రవహించింది. విక్రవాండి, ముండియంపాక్కం మధ్య రైల్వే బ్రిడ్జిపై నీరు ప్రమాద స్థాయికి మించి ప్రవహించడంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. కొన్నింటి రూట్ మార్చారు.
ముంపు బారిన ధర్మపురి, కృష్ణగిరి జిల్లాలు..
ధర్మపురి, క్రిష్ణగిరి జిల్లాలు కూడా ముంపునకు గురయ్యాయి. క్రిష్ణగిరి గత రెండు మూడు దశాబ్దాలుగా చూడని వరద చూశామని స్థానికులు చెబుతున్నారు. కార్లు, వ్యాన్లు నీటి ప్రవాహంలో లోతట్టు ప్రాంతాలకు కొట్టుకుపోయాయి. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఉత్తంగరై నుంచి కృష్ణగిరి, తిరువణ్ణామలైకు వెళ్లే దారిని మూసి వేశారు.