
గుజరాత్లో ఆందోళన కలిగిస్తున్న ఉపాధ్యాయుల మరణాలు
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ విధుల్లో బీఎల్వోలు విధులు నిర్వహిస్తోన్న టీచర్లు..
గుజరాత్(Gujarat)లో గతవారం బూత్ లెవల్ ఆఫీసర్లుగా (BLO) విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉపాధ్యాయులు మరణించారు. వీరి అకాలమరణం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.
పనిఒత్తిడి గురించి కలెక్టర్ దృష్టికి..
రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (S.I.R) మొదలయినప్పటి నుంచి BLOలపై పనిభారం పెరిగిపోయింది. తీవ్ర ఒత్తిడి కారణంగా కొంతమంది ఉపాధ్యాయులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పనిభారానికి వ్యతిరేకంగా వివిధ జిల్లాల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు కలెక్టర్లకు వినతిపత్రాలు కూడా అందజేశారు.
‘మా విన్నపాన్ని పట్టించుకోలేదు..’
గుజరాత్‌లోని అఖిల్ భారతీయ రాష్ట్రీయ షేక్షిక్ మహాసంఘ్ (ABRSM) జాతీయ ఉపాధ్యాయ సంఘం గుజరాత్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హిరేన్ వ్యాస్ ‘ ది ఫెడరల్’తో మాట్లాడుతూ.. గర్భిణీ ఉపాధ్యాయినులకు, 45 నుంచి 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి, దివ్యాంగ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నా.. తమ అభ్యర్థనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
"మేము BLO లుగా పని ప్రారంభించి నెల కూడా కాలేదు. ఇప్పటికే నలుగురు ఉపాధ్యాయులు పనిభారం భరించలేక చనిపోయారు. మరణించిన వారందరూ 45 ఏళ్లు పైబడిన వారు" అని వ్యాస్ పేర్కొన్నారు.
ఉపాధ్యాయులే ఎందుకు?
గుజరాత్లో 5.08 కోట్ల మంది ఓటర్ల ధృవీకరణ కోసం 50,963 మంది ప్రభుత్వ ఉద్యోగులను BLOలుగా నియమించారు (రాష్ట్ర ఎన్నికల సంఘం డేటా ప్రకారం), వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులే.
"ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది SIRలో భాగస్వాములు కావాలని EC పేర్కొంంది. అయితే గుజరాత్లో BLOలలో ఎక్కువ మంది ఉపాధ్యాయులే ఉన్నారు. ఇతర ప్రభుత్వ సిబ్బందిని BLOగా చేయమని అడగలేదు" అని అహ్మదాబాద్‌కు చెందిన ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ది ఫెడరల్‌తో అన్నారు.
‘బెదిరిస్తున్నారు..’
ఇంకో ఉపాధ్యాయుడు మాట్లాడుతూ..“నవంబర్ 4 నుంచి పని మొదలు పెట్టి డిసెంబర్ 4 కల్లా SIR ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. ఇది ఎలా సాధ్యం? ఈ విధులకు కేవలం ఉపాధ్యాయులనే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? అని ప్రశ్నించారు.
ఈ పని చేయడానికి నిరాకరించినా, డ్యూటీ లొకేషన్‌కు ఆలస్యంగా చేరుకున్నా చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారని మరో ఉపాధ్యాయుడు చెప్పారు.
సీఎం ABRSM లేఖ..
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు ABRSM లేఖ రాసింది. పాఠశాల సమయం తర్వాత ఇంటింటికీ వెళ్లడం ఉపాధ్యాయులను అలసిపోయేలా చేస్తుందని, గుజరాత్‌లోని మొత్తం BLOలలో 90 శాతం మంది ఉపాధ్యాయులేనని పేర్కొంది. చాలా మంది ఉపాధ్యాయులు రాత్రి 8 లేదా 9 గంటల వరకు పనిచేసి, తెల్లవారుజాము వరకు పత్రాలను డిజిటలైజ్ చేయడంతో వారి ఆరోగ్యం దెబ్బతింటోందని తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం.. BLO విధులను పన్నెండు వర్గాల ప్రభుత్వ సిబ్బందితో చేయించాల్సి ఉందని ఎత్తి చూపారు.
BLO మరణాలు..
నవంబర్ 22న గుజరాత్లో ఇద్దరు అసిస్టెంట్ బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) గుండెపోటుతో మరణించారు. దీంతో రాష్ట్రంలో BLOల మరణాల సంఖ్య ఐదుకు చేరుకుంది. మరణించిన BLOలలో 56 ఏళ్ల కల్పనాబెన్ పటేల్, 50 ఏళ్ల ఉషాబెన్ సోలంకి ఉన్నారు.
ఉషా సోలంకి, అనిల్ వాఘేరా (ఫైల్)
సూరత్ జిల్లా బార్డోలి తాలూకా మధి గ్రామానికి చెందిన కల్పనాబెన్ పటేల్, తాపి జిల్లాలోని బెల్ధా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలు. SIRలో భాగంగా ఆమెను అసిస్టెంట్ BLOగా నియమించారు.
"కల్పనాబెన్కు ఇదివరకు గుండె జబ్బు ఉన్న దాఖలాలు లేదు. కానీ నవంబర్ 21న ఆమె విధులకు ఆలస్యంగా హాజరయ్యారు. ఛాతీలో నొప్పిగా ఉందనడంతో మేం ఆమెను బార్డోలిలోని ఆసుపత్రికి తరలించాం. చికిత్స పొందుతూ చనిపోయారు. తీవ్రమైన గుండెపోటుతో ఆమె మరణించిందని డాక్టర్లు చెప్పారు, ’’ అని కల్పన భర్త, రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు శాంతిలాల్ పటేల్ ది ఫెడరల్‌తో అన్నారు.
"ఆమె 15 సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయురాలిగా ఉంది. ప్రతి వారాంతంలో ఇంటికి తిరిగి వెళ్లేది. కానీ ఆమె అలసిపోయినట్లు లేదా పనిభారం గురించి ఫిర్యాదు చేయడం ఇంతకుముందు నేనెప్పుడూ చూడలేదు. SIR ప్రారంభించినప్పటి నుంచి ఆమె రాత్రి ఆలస్యంగా ఇంటికి రావడం, మళ్లీ ఉదయం 6 గంటలకు పాఠశాలకు వెళ్లేది. పాఠశాల తర్వాత రాత్రి 8 లేదా 9 గంటల వరకు బెల్ధా గ్రామంలో ఆమె తిరగాల్సి వచ్చింది. ఆమె ఇంటికి చేరుకునే సమయానికి బాగా అలసిపోయేది. తినడానికి కూడా ఓపిక ఉండేది కాదు, ”అని శాంతిలాల్ పటేల్ పేర్కొన్నారు.
పటేల్ మరణించిన ఒక రోజు తర్వాత.. వడోదరలోని కడక్ బజార్ ప్రాంతంలో అసిస్టెంట్ బిఎల్ఓగా విధులు నిర్వహిస్తోన్న ఉషా సోలంకి కుప్పకూలిపోయారు. ఆమెను నగరంలోని ఎస్ఎస్జి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు డాక్టరు పేర్కొన్నారు. తీవ్ర గుండెపోటు వచ్చిందని చెప్పారు.
వడోదరలోని గోర్వాలోని మహిళా పారిశ్రామిక శిక్షణ సంస్థ, నైపుణ్య ధృవీకరణ కేంద్రంలో క్లరికల్ సిబ్బందిగా పనిచేసిన సోలంకి.. SIR విధి నిర్వహణలో ఉన్నప్పుడు మరణించిన ఏకైక బోధనేతర సిబ్బంది.
"ఆమెకు చాలా కాలంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. BLO విధుల నుంచి తప్పించాలని అభ్యర్థించారు. కానీ కలెక్టర్ తిరస్కరించారు" అని ఉషా సోలంకి భర్త ఇంద్రసింహ్ సోలంకి చెప్పారు.
గత వారం ప్రారంభంలో జునాగఢ్‌లోని అనిల్ వాఘేరా, ఖేడాలోని రమేష్ పర్మార్ అనే ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తమ జీవితాలను ముగించారు. గోద్రాకు చెందిన మరో ఉపాధ్యాయుడు బిను బమానియా 'అధిక పని ఒత్తిడిని భరించలేక పోతున్నానని తన జీవితాన్ని ముగించాలనుకుంటున్నానని ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ఇప్పటివరకు మరో ముగ్గురు BLOలు గుండెపోటుతో మరణించగా.. వడోదర జిల్లాలోని పద్రాలో మరో ఉపాధ్యాయుడు జుల్ఫికర్ పఠాన్ విధి నిర్వహణలో స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
నవంబర్ 24న జామ్‌నగర్, చోటా ఉదేపూర్లలో ఇద్దరు BLOలు విధి నిర్వహణలో కుప్పకూలిపోయారు, ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై మౌనంగా ఉండటంతో BLOలు ఎదుర్కొంటున్న పోరాటాలకు గుర్తింపు దక్కడం లేదు. ఇంతలో గుజరాత్ ఎన్నికల సంఘం సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను విడుదల చేసింది. ఉపాధ్యాయులతో చేయిస్తున్న పని అంతకష్టమైనది కాదని, S.I.R దాదాపు పూర్తయ్యే దశలో ఉందని పేర్కొంది.

