
రక్షణ బడ్జెట్ పెరుగుతోంది! కాలుష్య నియంత్రణ బడ్జెట్ తగ్గుతోంది!
అసలు ముప్పు ఎక్కడ ఉంది?
దేశ భద్రత గురించి మాట్లాడేటప్పుడు మనం ముందుగా గుర్తు చేసుకునేది సరిహద్దులు, సైన్యం, ఆయుధాలు. అందుకే ప్రతి ఏడాది రక్షణ బడ్జెట్ పెరుగుతోంది. కానీ నిశ్శబ్దంగా, ఎలాంటి హెచ్చరిక లేకుండా మరో శత్రువు మన మధ్యే ప్రాణాలు తీస్తోంది. అదే కాలుష్యం. ప్రతి ఏడాది వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, పరిశ్రమల వ్యర్థాలు, విషపూరిత ప్లాస్టిక్ వల్ల లక్షలాది మంది అకాల మరణాలకు గురవుతున్నారు.
విచిత్రమేంటంటే కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నా, కాలుష్య నియంత్రణకు కేటాయించేబడ్జెట్ మాత్రం తగ్గుతోంది లేదా స్థిరంగా ఉంది. ఆసుపత్రులు నిండిపోతున్నాయి. శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు.
ప్రతి సంవత్సరం దేశంలో 17 లక్షల మంది కాలుష్యం బారిన పడి చనిపోతున్నారని ప్రపంచ బ్యాంకు, లాన్సెట్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అంతే కాదు భారత ఆర్థిక వ్యవస్థ పై దాదాపు ₹30 లక్షల కోట్లు భారం పడుతోందని ఆ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు గాలి నాణ్యత సరిగా లేకపోవడం వల్ల 8-10 సంవత్సరాల ఆయుర్దాయం కోల్పోతున్నారని ఆ నివేదిక స్పష్టం చేసింది. వాస్తవాలు ఇలా వుంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కాలుష్య నియంత్రణకు కేటాయింపులు తగ్గించింది. బడ్జెట్‌లో చూస్తే రక్షణ వ్యయం గత సంవత్సరం కంటే 15% పెరిగింది. కానీ కాలుష్య నియంత్రణకు నిధులు తగ్గాయి. ఈ అంశంపై పర్యావరణవేత్తలు డాక్టర్ లుబ్నా సర్వత్, బాటనీ ప్రొఫెసర్ బయ్యపరెడ్డి ఫెడరల్ తెలంగాణాతో మాట్లాడారు.
తక్షణ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ, దీర్ఘకాలిక ప్రభావాలను పక్కన పెట్టడం, ప్రభుత్వ విధానాల్లో తరచుగా కనిపిస్తోందని పర్యావరణ వేత్త డాక్టర్ లుబ్నా సర్వత్ చెప్పారు. రక్షణ రంగం తక్షణ భద్రతకు సంబంధించినదైతే, పర్యావరణ పరిరక్షణ భవిష్యత్ తరాల భద్రతకు సంబంధించినది. "దేశాన్ని రక్షించేందుకు బలమైన సైన్యం అవసరం. అలాగే, దేశ ప్రజలను కాపాడేందుకు శుభ్రమైన గాలి, స్వచ్ఛమైన నీరు కూడా అంతే అవసరం. బడ్జెట్ కేటాయింపులు ఈ రెండు వాస్తవాలను సమానంగా ప్రతిబింబించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది," అని లుబ్నా సర్వత్ చెప్పారు.
పట్టణాల్లో గాలి కాలుష్యం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే కేంద్ర బడ్జెట్‌లో కాలుష్య నియంత్రణకు కేటాయింపులు తగ్గించడం ప్రమాదకర సంకేతం అంటారు లుబ్నా సర్వత్. కాలుష్యం అనేది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు. ఇది ప్రజారోగ్య సమస్య, ఆర్థిక సమస్య. కాలుష్యం వల్ల వచ్చే అనారోగ్యాలు ఆరోగ్య రంగంపై అదనపు భారం మోపుతున్నాయి. దీర్ఘకాలికంగా చూస్తే, "పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది," అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రక్షణ అవసరాలంటూ వికారాబాద్ దామగుండంలో లక్ష చెట్లను నరకడాన్ని ఆమె గుర్తు చేశారు.
కాలుష్య నిధులను ఇతర బడ్జెట్ ప్రాధాన్యతలతో పోల్చి చూస్తే, రక్షణ వ్యయం సంవత్సరానికి 15% కంటే ఎక్కువ పెరిగిందని, కాలుష్య నిధులు తగ్గాయని ఆమె విశ్లేషించారు. ఇ.వి.వాహనాలు, డేటా సెంటర్‌లు ఇప్పడు పర్యావరణానికి పెద్ద సవాల్ విసురుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో పోల్చితే పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు భారీ ఎత్తునే ఖర్చు పెడుతున్నాయని బాటనీ ఫ్రొఫెసర్ బయ్యపురెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా పర్యవరణ పరిరక్షణకు కేటాయింపులు అవసరం లేదని, కేంద్ర బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడం తక్కువేం కాదని ఫ్రొఫెసర్ చెప్పారు. ఎవరి వల్ల కాలుష్యం జరుగుతుందో, వారే కాలుష్యనియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు బాధ్యత వహించాలి. "పర్యావరణాన్ని కాపాడటం ప్రభుత్వాల పని కాదు, కాలుష్యానికి కారణమైన వారే దాని బాధ్యతను వహించాలి.” అని బయ్యపురెడ్డి చెప్పారు.
పరిశ్రమలు విడుదల చేస్తున్నవిష వాయువులు, రసాయన వ్యర్థాలు గాలి, నీరు, నేలను నెమ్మదిగా విషపూరితం చేస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల్లో ఎక్కువ భాగం పరిశ్రమల నుంచే ఉత్పత్తి అవుతోంది. అవి కరిగిపోకుండావందల ఏళ్ల పాటు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి. కార్బన్ ఉద్గారాల విషయానికి వస్తే పెద్ద పరిశ్రమలు, ఇంధన ఆధారిత ఉత్పత్తులే ప్రధాన కారణాలుగా డేటా స్పష్టంగా సూచిస్తోంది. కాబట్టి ఎవరి వల్ల కాలుష్యం జరుగుతుందో, వారే కాలుష్య నియంత్రణకు పర్యావరణ పరిరక్షణకు బాధ్యత వహించాలి అని బయ్యపురెడ్డి అభిప్రాయపడ్డారు.
యుద్ధంలో చనిపోయినవారిని మనం వీరులుగా గుర్తిస్తాం. కానీ కాలుష్యం వల్ల చనిపోయిన లక్షలాది మందికి ఏ గుర్తింపు లేదు. అసలు నిజం ఏంటంటే, కాలుష్యం కూడా ఒక యుద్ధమే. కానీ ఇది బయట శత్రువుతో కాదు. మన నిర్లక్ష్యంతో జరుగుతున్న యుద్ధం. రక్షణ బడ్జెట్ పెరగడం తప్పు కాదు. కానీ కాలుష్య నియంత్రణ బడ్జెట్ తగ్గడంనేరానికి సమానం. ఎందుకంటే శుభ్రమైన గాలి, నీరు, నేల లేకపోతే ఏ దేశమైనా సురక్షితం కాదు.

