
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు Z-కేటగిరీ.. ఎందుకు?
సెక్యూరిటీ బాధ్యతలు ఇకపై CRPF బలగాల చేతిలోకి..
ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి రేఖ గుప్తా(Rekha Gupta)కు 'జెడ్' కేటగిరీ భద్రత కల్పించనున్నారు. నిన్న(ఆగస్టు20) జరిగిన ఘటనతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సివిల్ లైన్స్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి హాజరయిన సీఎంపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ హఠాత్పరిణామంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
CRPFకు సీఎం సెక్యూరిటీ బాధ్యతలు..
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రేఖా గుప్తా భద్రత బాధ్యతను గురువారం (ఆగస్టు 21) సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) చేపట్టింది. 22-25 మందితో కూడిన CRPF కమాండోల బృందం 24 గంటల పాటు ఆమెకు సెక్యూరిటీ(Security)గా ఉంటారు. ఈ తరహా సెక్యూరిటీ ఇప్పటికే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కర్ణాటక గవర్నర్లతో పాటు అనేక మంది ఉన్నత స్థాయి వ్యక్తులకు కల్పించారు. ఇక నుంచి ప్రజావాణిలో రేఖా గుప్తా సమీపానికి ఫిర్యాదుదారులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.
సీఎంను కలిసిన బీజేపీ ఎంపీలు..
ముఖ్యమంత్రి రేఖ గుప్తాను ఢిల్లీ బీజేపీ ఎంపీలు పరామర్శించారు. గురువారం లేదా శుక్రవారం (ఆగస్టు 22) నుంచి ఆమె తన షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభిస్తానని వారు చెప్పారు.
అసలు దాడి ఎందుకు జరిగింది?
రేఖా గుప్తాపై దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..నిందితుడిని గుజరాత్‌లోని రాజ్‌కోట్ నివాసి రాజేష్ భాయ్జీగా గుర్తించారు. వివరాలు తెలుసుకుని అతడి తల్లితో మాట్లాడారు. తన కొడుకు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అని, ఏ రాజకీయ పార్టీతోనూ తనకు అనుబంధంలేదని తల్లి భానుబెన్ చెప్పింది. జంతు ప్రేమికుడయిన తన కొడుకు.. దేశ రాజధానిలో వీధి కుక్కలను తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్తున్నానని తనతో చెప్పాడని భానుబెన్ పోలీసులకు చెప్పింది. ప్రస్తుతం రాజేష్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు.