జైలు నుంచే ఢిల్లీ పాలన.. కేజ్రీవాల్ తొలి ఆదేశం దేనిపైనంటే..
x
అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల చేసిన ఆర్డర్ ను చూపిస్తున్న మంత్రి అతిశ్

జైలు నుంచే ఢిల్లీ పాలన.. కేజ్రీవాల్ తొలి ఆదేశం దేనిపైనంటే..

‘నన్ను మాత్రమే జైల్లో పెట్టారు కాని నా అధికారాలను, మనసును కాదు కదా’ అని కేజ్రీవాల్ పదేపదే చెప్పారు. ఇప్పుడదే చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నంత పని చేశారు. ‘నన్ను మాత్రమే జైల్లో పెట్టారు కాని నా అధికారాలను, మనసును కాదు కదా’ అని కేజ్రీవాల్ పదేపదే చెప్పారు. ఇప్పుడదే చేశారు. దేశచరిత్రలోనే తొలిసారి ఓ ముఖ్యమంత్రిని అధికారంలో ఉండగా అరెస్ట్ చేయడం, అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి జైలు నుంచి పాలన సాగించడం కూడా దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దేశ రాజ్యాంగంలో జైలు నుంచి పాలనచేయకూడదనే నిబంధన ఎక్కడా లేదు. దాన్ని ఉపయోగించుకున్న కేజ్రీవాల్ జైలు నుంచి ఢిల్లీకిసంబంధించి పాలనాపరమైన ఆదేశాలు ఇచ్చారు. ఆదివారమైనా కేజ్రీవాల్ తన విధి నిర్వహణ కొనసాగించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ తొలిసారి ఢిల్లీ మంచినీటి సరఫరాకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఓ నోట్ రూపంలో జలమంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఆ శాఖను నిర్వహిస్తున్న మంత్రి అతిశీ మార్లీనాకు ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 8 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడమే కాకుండా కావాలనుకుంటే తనను అరెస్ట్ చేసుకోమన్నట్టుగా వ్యవహరించారు. ఈడీ అధికారులు ఎట్టకేలకు మార్చి 21న అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన్ను ఈనెల 28వరకు ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది. అయినా ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. ‘‘మేము అంతకు ముందే చెప్పా. కేజ్రీవాల్‌ ప్రభుత్వ పాలన కొనసాగిస్తార. జైలు నుంచి పాలన సాగించకూడదని ఏ చట్టమూ చెప్పలేదు. కేజ్రీవాల్ పై ఆరోపణలు రుజువుకాలేదు. అందుకే ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగుతారు’’ అని మంత్రి ఆతిశీ మార్లీనా ప్రకటించారు.

పంజాబ్ సీఎం ఏమన్నారంటే...

జైలులోనే సీఎం కార్యాలయం ఏర్పాటు చేస్తామంటున్నారు పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మాన్ సింగ్. సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి ఇందుకు పర్మిషన్ తీసుకుంటామన్నారు. అయితే ఇందుకు కోర్టులు అంగీకరిస్తాయో లేదో చూడాలి. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నడిపిన కేజ్రీవాల్ కి కావాలనే అవినీతి మురికి అంటించాలని చూస్తున్నారని పంజాబ్ సీఎం ఆరోపించినా బీజేపీ మాత్రం కేజ్రీవాల్ అవినీతిపరుడేనని, దేశ విద్రోహ శక్తులకు ఆయన తోడ్పడ్డారని తిప్పికొట్టింది. కేజ్రీవాల్‌ ఒకవేళ రాజీనామా ప్రకటిస్తే ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సీఎంగా ప్రభుత్వాన్ని నడపొచ్చు అన్నారు సీనియర్‌ బ్యూరోక్రాట్‌, ఢిల్లీ మాజీ చీఫ్‌ సెక్రటరీ ఉమేశ్‌ సైగల్‌. జైలు మాన్యువల్‌ ఇందుకు విరుద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడానికి జైలు మాన్యువల్ అనుమతించదని సైగల్ అభిప్రాయపడ్డారు.


Read More
Next Story