
ఢిల్లీలో 'నో పీయూసీ, నో ప్యూయల్' విధానం అమలు..
విమాన సర్వీసులకు పొగమంచు ఆటంకం..
వాయు కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 'నో పీయూసీ (Pollution Under Control), నో ఇంధనం(Fuel)' విధానం కొనసాగుతుందని స్పష్టం చేసింది. GRAP-IV నిబంధనలు ఎత్తివేసిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించింది. మంగళవారం ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా విలేకరులతో మాట్లాడారు. లోపభూయిష్ట కాలుష్య కేంద్రాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహన తనిఖీ కఠినతరం చేయడంతో పాటు కొత్త కాలుష్య నియంత్రణ చర్యలు అమల్లోకి తెస్తామని చెప్పారు.
పారిశ్రామిక కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) ఇప్పటివరకు 411 మూసివేత నోటీసులు జారీ చేసిందని, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 400 యూనిట్లను సీజ్ చేసిందని వివరించారు. ముఖ్యమంత్రి రేఖ గుప్తా నాలుగు కొత్త ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లను మంజూరు చేశారని పేర్కొన్నారు. హోలంబి కలాన్‌లో ఈ-వేస్ట్ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, ఢిల్లీలో ఈ-వేస్ట్ ప్లాంట్ త్వరలో ఏర్పాటవుతుందన్నారు.
‘‘పొగమంచు కారణంగా విమానాల రద్దు’’
ఇదిలా ఉండగా.. మంగళవారం ఢిల్లీలో గాలి నాణ్యత బాగా పడిపోయింది. వాయు నాణ్యత సూచిక (AQI) 415గా నమోదైంది. దేశ రాజధానిలో చాలా ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేసింది. దీంతో విమాన, రైలు సేవలకు అంతరాయం కలిగింది. దట్టమైన పొగమంచు కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 200 విమానాలను ఆపేశారు. రైళ్లును రీషెడ్యూల్ చేశారు.
ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
రాబోయే కొద్ది రోజులు ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడటానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని IMD అంచనా వేసింది. వచ్చే 24 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.

