కర్ణాటక: విందుకు విడివిడిగా సీఎం, డిప్యూటీ సీఎం..
x

కర్ణాటక: విందుకు విడివిడిగా సీఎం, డిప్యూటీ సీఎం..

ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య కొనసాగుతోన్న అంతర్గత పోరు..


Click the Play button to hear this message in audio format

కర్ణాటక(Karnataka) రాష్ట్రం బెళగావి (నార్త్) మాజీ ఎమ్మెల్యే ఫిరోజ్ సైత్ గురువారం (డిసెంబర్ 11) రాత్రి ఇచ్చిన విందుకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar), కొంతమంది మంత్రులు సహా 30 మందికి పైగా కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరిలో మంత్రులు కేహెచ్‌ మునియప్ప, మంకాల్‌ వైద్య, డాక్టర్‌ ఎంసీ సుధాకర్‌, ఎమ్మెల్యేలు ఎన్‌ఏ హరీస్‌, రమేష్‌ బండిసిద్దెగౌడ, హెచ్‌సీ బాలకృష్ణ, గణేష్‌ హుక్కేరి, దర్శన్‌ ధృవనారాయణ, అశోక్‌కుమార్‌ రాయ్‌, కేవై నంజేగౌడ ఉన్నట్లు సమాచారం. బహిష్కృత బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, శివరాం హెబ్బార్ కూడా విందుకు హాజరయ్యారు.


డిన్నర్‌కు సిద్ధరామయ్య బ్యాచ్..

అంతకుముందు (డిసెంబర్ 10) రోజు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah), మంత్రులు, సీఎంకు సన్నిహితంగా ఉన్న కొంతమంది శాసనసభ్యులు ఫిరోజ్ సైత్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. విందుకు హాజరయిన నాయకులు ఇది సాధారణ విందేనని, విశేషమేమీ లేదని చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవిపై అధికార పార్టీలో సీఎం, డిప్యూటీ సీఎంలకు మధ్య పోరు జరుగుతున్న తరుణంలో విందు సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


లోపాయికారి ఒప్పందం?

2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీపడ్డారు. పార్టీ అధిష్టానం జోక్యంతో డీకే ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఐదేళ్ల పదవీకాలంలో రెండున్నరేళ్ల పాటు సిద్ధరామయ్య, మిగతా రెండున్నరేళ్లు డీకే ముఖ్యమంత్రిగా కొనసాగేలా ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం జరిగినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో నవంబర్ 20నాటికి సిద్ధరామయ్య పదవీ కాలం పూర్తయ్యింది. ఇద్దరి మధ్య ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని ప్రజలకు చెప్పేందుకు పార్టీ అధిష్టానం సూచనమేరకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరూ ఒకరి నివాసాలలో ఒకరు అల్పాహారం చేశారు. బెళగావి విందు ఇద్దరి మధ్య నాయకత్వ పోరుకు విరామం చెప్పడానికి, సిద్ధరామయ్య ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించడానికి విందు ఒక సంకేతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More
Next Story