NEETపై DMK దారెటు?
x

NEETపై DMK దారెటు?

అసెంబ్లీ తీర్మానానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించకపోవడంతో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఏం చేయబోతున్నారు?


Click the Play button to hear this message in audio format

NEET (నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్)కు వ్యతిరేకంగా తమిళనాడు డీఎంకే (DMK) ప్రభుత్వం కేంద్రంతో పెద్ద యుద్ధమే చేస్తోంది. ఆ పరీక్ష నుంచి తమ రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం కోసం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము(President Droupadi Murmu)కు పంపింది. ఆమె తిరస్కరించడంతో సీఎం ఎంకే స్టాలిన్‌ (CM Stalin) ఇప్పుడు సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఆలోచనలో స్టాలిన్..

వాస్తవంగా ఈ పరీక్షను అధికార డీఎంకే చాలా కాలం నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ పరీక్షకు సంబంధించి 2023 నుంచి కేసు అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. ముందస్తు విచారణ కోసం ఒత్తిడి చేయాలా? కొత్త పిటిషన్ దాఖలు చేయాలా? అన్న ఆలోచనలో ఉన్నారు స్టాలిన్.

పోరాటానికి పార్టీల మద్దతు..

బుధవారం సర్వసభ్య సమావేశం జరిగింది. తమిళనాడు అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి తిరస్కరించిన విషయాన్ని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ శాసససభ్యులకు గుర్తుచేశారు. నీట్‌కు వ్యతిరేకంగా చట్టపర, రాజకీయ పోరాటాన్ని కొనసాగించేందుకు కాంగ్రెస్(Congress), పీఎంకే(PMK), వీసికే నుంచి మద్దతు కూడా డీఎంకేకు లభించింది.

'కరుణానిధి కూడా వద్దన్నారు'

మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కూడా నీట్ పరీక్షను వ్యతిరేకించారని గుర్తుచేస్తూ.. నీట్ పట్ల డీఎంకే కఠిన వైఖరిని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పునరుద్ఘాటించారు. నీట్ వల్ల గ్రామీణ. పేద విద్యార్థులను సీట్లు దక్కడం లేదన్నది స్టాలిన్ వాదన. తీర్మానం బిల్లును కూడా రాష్ట్రపతికి పంపడంలో ఆలస్యం చేసిన గవర్నర్ ఆర్‌ఎన్ రవిని కూడా స్టాలిన్ విరుచుకుపడ్డారు.

‘గట్టిగా పోరాడదాం’

''నీట్ విషయంలో నేను గవర్నర్‌ను వ్యక్తిగతంగా అభ్యర్థించాను. బిల్లును రాష్ట్రపతి తిరస్కరించవచ్చు. కానీ చట్టబద్ధంగా పోరాడితే నీట్ నుంచి మినహాయింపు లభిస్తుందని నమ్ముతున్నా. నీట్‌ను వ్యతిరేకించడానికి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించాలి. పార్లమెంటులోనూ పోరాడాలి,'' అని స్టాలిన్ అన్నారు.

అన్నాడీఎంకే(AIADMK) బీజేపీ(BJP), టీవీకే(TVK) వాకౌట్..

ఇదే అంశంపై అన్నాడీఎంకే, బీజేపీ సమావేశాన్ని బహిష్కరించాయి. ఆ రెండు పార్టీల నేతలు స్టాలిన్ వ్యాఖ్యలను పొలిటికల్ స్టంట్‌గా అభివర్ణించారు. అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి కె. పళనిస్వామి చర్చ "అర్థరహితం" అని పేర్కొనగా.. డీఎంకే నాటకాలు ఆడుతోందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై విమర్శించారు. ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు వైద్య ప్రవేశాలు పొందేందుకు నీట్ దోహదపడిందని అన్నామలై పేర్కొన్నారు. పార్టీ సభ్యులకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో ఉన్న స్వార్థ ప్రయోజనాల వల్ల డీఎంకే నీట్‌ను వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. "నీట్ మినహాయింపు గురించి డీఎంకేకు చిత్తశుద్ధి ఉంటే..సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి నాలుగేళ్లు ఎందుకు వెయిట్ చేశారు?," అని ప్రశ్నించారు.

‘ఓటర్లే బుద్ధి చెబుతారు’

2021 ఎన్నికల ప్రచారంలో నీట్ మినహాయింపు గురించి తప్పుడు వాగ్దానాలు చేసిన డీఎంకే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తమిళగ వెట్రీ కజగం (టీవీకే) చీఫ్ విజయ్ (Vijay) డిమాండ్ చేశారు.

"నీట్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని డీఎంకేకు తెలుసు. నాలుగేళ్లు స్తబ్దుగా ఉండి..ఇప్పుడు మళ్లీ NEETను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తుంది. 2026 ఎన్నికల్లో ప్రజలు పార్టీకి తగిన సమాధానం ఇస్తారు," అని విజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

Read More
Next Story