సమ్మె విరమించిన వైద్యులు..
x
ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు విచారణను టీవీలో చూస్తున్న డాక్టర్లు

సమ్మె విరమించిన వైద్యులు..

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు తమ 11 రోజుల సమ్మెను విరమిస్తున్నట్లు గురువారం ప్రకటించారు.


ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు తమ 11 రోజుల సమ్మెను విరమిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. కోల్‌కతా ఆర్‌జి కర్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా వారు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. కేసును విచారిస్తున్న సుప్రీం కోర్టు వైద్యులను విధులకు హాజరుకావాలని కోరింది. డ్యూటీలో ఎలాంటి ప్రతికూల ఘటనలు జరగవని కూడా హామీ ఇచ్చింది.

"మాకు భద్రత కల్పిస్తామని సుప్రీం కోర్టు చెప్పింది. కోర్టు ఆదేశాలతో మేం విధులకు హాజరవుతున్నాం. రోగుల ఆరోగ్యం కూడా మా బాధ్యతే’’" అని AIIMS రెసిడెంట్ డాక్టర్ ఒకరు పేర్కొన్నారు.

పోలీసుల జాప్యం అత్యంత ఆందోళనకరం..

ట్రైనీ డాక్టర్ అసహజ మరణంపై కోల్‌కతా పోలీసులు స్పందించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. గురువారం విచారణ సందర్భంగా పోలీసుల తీరు "అత్యంత ఆందోళనకరం" అని పేర్కొంది. ఇదే సమయంలో ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వైద్యుల భద్రత, నిరసనలకు సంబంధించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. రెసిడెంట్ డాక్టర్లకు ప్రాతినిధ్యం వహించే సంఘాలతో సహా ఆరోగ్య సంరక్షణ నిపుణుల భద్రత కోసం జాతీయ ప్రోటోకాల్‌ను రూపొందించేటప్పుడు.. సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్ (NTF) ఆ సూచనలను పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొంది.

పోస్టుమార్టం తర్వాత అసహజ మరణంగా కేసు నమోదు చేస్తారా?

అత్యాచార ఘటనలో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ వైఖరిని కూడా తప్పుబట్టింది కోర్ట్. ఆయన ఎవరితో టచ్‌లో ఉన్నారు? ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడంలో ఎందుకు ఆలస్యం చేశాడు? అందువల్ల ఆయనకు ప్రయోజనం ఏమిటి?" అని బెంచ్ ప్రశ్నించింది. ‘‘అసహజ మరణం అని నమోదు చేయడానికి ముందే పోస్ట్‌మార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉంది. ఆగస్టు 9 సాయంత్రం 6:10 గంటలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆ తర్వాత అసహజ మరణం అని అదే రోజు రాత్రి 11:30 గంటలకు కేసు ఫైల్ చేశారు? ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది" అని న్యాయమూర్తులు జెబి పార్దివాలా మనోజ్ మిశ్రా పేర్కొన్నారు.

Read More
Next Story