
'లోపల కూర్చున్నోళ్లు రోజూ కరుస్తారు'
పార్లమెంట్‌కు వీధి కుక్కపిల్లను తీసుకురావడాన్ని తప్పబట్టిన బీజేపీ ఎంపీ జగ్‌దంబికా పాల్‌పై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఆగ్రహం..
కాంగ్రెస్(Congress) ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) తన కారులో వీధి కుక్కపిల్లతో పార్లమెంటు(Parliament)కు రావడం వివాదానికి దారితీసింది. గేటు వద్ద ఉన్న భద్రతాసిబ్బంది ఆమె కారును ఆపేసి వెనక్కు పంపించేశారు. ఈ ఘటనపై బీజేపీ నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.
జంతువులను తీసుకురావడం నిబంధనలకు విరుద్ధమని, వెంటనే సభాపతి ఆమెపై చర్య తీసుకోవాలని బీజేపీ ఎంపీ జగ్‌దంబికా పాల్ డిమాండ్ చేశారు. "లోపల కూర్చున్న వాళ్లు కరుస్తారు. ప్రతిరోజూ మమ్మల్ని కొరికే వారి గురించి మేం మాట్లాడం" అని రేణుకా చౌదరి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లో పెద్దగా చర్చ జరగలేదు.
ఆ తర్వాత ఇదే విషయాన్ని రేణుకా చౌదరి విలేఖరుల వద్ద ప్రస్తావించారు. ‘‘ఉదయం పార్లమెంటుకు బయలుదేరా. మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటర్-కారు ఢీ కొన్నాయి. బండి చక్రానికి తగిలి రోడ్డు పక్కన అటు, ఇటు తిరుగుతున్న కుక్కపిల్ల నా కంటపడింది. దాన్ని కాపాడి కారులో తీసుకొచ్చా. వీధి కుక్కలను రక్షించకూడదని ఏ చట్టం చెబుతుంది’’ అని అన్నారు.
‘‘వాస్తవానికి కుక్కను పార్లమెంట్‌కు తీసుకురావడం రేణుకా చౌదరి ఉద్దేశ్యం కాదు. ముందుగా ఎంపీని పార్లమెంట్ భవనం వద్ద దింపి, తర్వాత కుక్కను పశువైద్యశాలకు తీసుకెళ్లాలని ఆమె కారు డ్రైవర్ అనుకున్నాడు. అదీ జరిగింది’’ అని రేణుకా చౌదరి సన్నిహితులు అంటున్నారు.

