
దుర్గా పూజకు ‘పద్మ హిల్సా’ చేపలు - కిలో రూ.1800 ఎక్కడంటే..
బెంగాలీ సంస్కృతిలో భాగమైన ఇలిష్ చేపల దిగుమతి సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 5 వరకు కొనసాగుతుంది.
దసరా(Dasara) పండుగ దగ్గర పడుతుండడంతో పొరుగు దేశం బంగ్లాదేశ్(Bangladesh) నుంచి పద్మ హిల్సా చేపలు భారత్‌కు దిగుమతి అవుతున్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి ఎనిమిది ట్రక్కుల్లో 32 టన్నుల చేపలు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నాయి. ఈ దిగుమంతి సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 5 వరకు కొనసాగుతుంది.
"బుధవారం రాత్రికి కోల్‌కతా హోల్‌సేల్ మార్కెట్లకు హిల్సా చేపలు చేరుకుంటాయి. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తాయి. వినియోగదారుడి వద్దకు చేరుకునేటప్పటికి వీటి ధర కిలో రూ.1,800 అవుతుంది’’ అని చెప్పారు చేపల దిగుమతిదారుల సంఘం కార్యదర్శి సయ్యద్ అన్వర్ మక్సూద్
బెంగాలీ సంస్కృతిలో ఒక భాగం..
ఇలిష్ చేపగానూ పిలిచే హిల్సా(Hilsa) చేపలు బెంగాలీ సంస్కృతిలో ఒక భాగం. కొన్ని బెంగాలీ(West Bengal) కుటుంబాలు ఈ చేపతో తయారుచేసిన వంటకాన్ని లక్ష్మీ దేవతకు నైవేధ్యంగా సమర్పిస్తారు. పెళ్లి వేడుకల్లోనూ ఈ చేపతో తయారుచేసిన వంటకం ఉంటుంది. హిల్సా చేపలకు బంగ్లాదేశ్ అతిపెద్ద ఎగుమతిదారు కాగా.. భారత్ అదే స్థాయిలో దిగుమతి చేసుకుంటుంది.
హిల్సా ఫిష్ గురించి..
హిల్సా ఫిష్ శాస్త్రీయ నామం టెనువాలోసా ఇలిషా. క్లూపీడే కుటుంబానికి చెందిన ఈ చేప దాదాపు 50 సెం.మీ వరకు పెరుగుతుంది. ఉప్పునీరు, మంచినీళ్లలో పెరుగుతాయి. ఒక్కో చేప 3 కిలోలకు పైగానే బరువు ఉంటుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం 2024 సెప్టెంబర్లో భారతదేశానికి హిల్సా చేపల ఎగుమతిని నిషేధించాలని నిర్ణయించింది. కాని దుర్గా పూజ సందర్భంగా సుమారు 1,200 టన్నుల చేపల ఎగుమతికి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అంగీకారం తెలిపింది.