
ఒడిశాలో తుఫాను బీభత్సం.. ముగ్గురు మృతి
వరదలు, విరిగిపడిన కొండచరియలు
ఒడిశాలో తుఫాను ‘అర్నాబ్’ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారీ వర్షాలు, వరదలతో దక్షిణ ఒడిశాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. కొండచరియలు విరిగిపడటంతో తొమ్మిది నెలల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వందలాది గ్రామాలు వరద నీటిలో చిక్కుకోవడంతో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది.
తొలుత ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువ ప్రభావం చూపుతుందని, ఒడిశాలో నష్టం తక్కువగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ తుఫాను దిశ మార్చుకోవడంతో గంజాం, గజపతి, కంధమాల్ జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. ఈ మూడు జిల్లాల్లో నిరంతరంగా కురిసిన భారీ వర్షాలతో నదుల్లో నీటిమట్టాలు పెరిగాయి.
దాదాపు డజను ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. కంధమాల్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దంపతులు, వారి తొమ్మిది నెలల కుమారుడు మరణించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది.
పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాను దిశ మారిన విషయం తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వ సాయం కోరినట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్‌కు చెందిన నాలుగు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. గంజాం జిల్లాలో 21 ప్రాంతాలను గుర్తించి ఆహార పొట్లాలను హెలికాప్టర్ల ద్వారా పంపిణీ చేశారు.
ఎన్డీఆర్ఎఫ్, ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పడవల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారికి వండిన ఆహారాన్ని అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 313 సహాయక బృందాలను ఏర్పాటు చేయగా, వీటిలో వందకు పైగా బృందాలు గంజాం, గజపతి జిల్లాల్లో పనిచేస్తున్నాయి. ఇప్పటికే 23 వేల మందికి పైగా సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
వరదల కారణంగా గంజాంలో సుమారు 50 వేల మంది, గజపతిలో 30 వేల మంది, కంధమాల్‌లో 12 వేల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గంజాం జిల్లాలో సహాయక, పునరావాస చర్యల కోసం ప్రభుత్వం అదనంగా 20 కోట్ల రూపాయలు కేటాయించింది. నవంబర్ 2న కేంద్ర బృందం ఒడిశాలో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేయనుంది.
గంజాం జిల్లాలో రుషికుల్య నది పొంగిపొర్లడంతో అనేక గ్రామాలు నీటమునిగాయి. వంతెనలు దెబ్బతినడంతో పాటు రహదారులు కొట్టుకుపోయాయి. సోరడా, ఆస్కా, భంజానగర్, పురుషోత్తంపూర్ ప్రాంతాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. బాధితులకు సహాయం అందించేందుకు 30 మంది సీనియర్ ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది.
ఇదిలా ఉంటే, వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ ప్రభుత్వం తగిన ముందస్తు చర్యలు తీసుకోలేదని బీజేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు విమర్శించాయి. అయితే ప్రజలకు ఆహారం, తాగునీరు, అత్యవసర వైద్య సేవలు అందించడమే ప్రాధాన్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దెబ్బతిన్న రహదారులు, వంతెనల పునరుద్ధరణతో పాటు విద్యుత్ సరఫరాను తిరిగి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు, బహుదా నదిలో నీటిమట్టం తగ్గడంతో కోల్‌కతా–చెన్నై మధ్య ఉన్న జాతీయ రహదారి-16పై రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. రైలు సర్వీసులు కూడా పునరుద్ధరించినప్పటికీ, కొన్ని మార్గాల్లో నీరు నిలిచిపోవడం, రద్దీ కారణంగా పలు రైళ్లను రద్దు చేయడం లేదా గమ్యస్థానానికి ముందే నిలిపివేయడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
