బెంగాల్: గవర్నర్ వర్సెస్ సీఎం మమతా బెనర్జీ..
x

బెంగాల్: గవర్నర్ వర్సెస్ సీఎం మమతా బెనర్జీ..

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనందబోస్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. తాజాగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం..


పశ్చిమ బెంగాల్ లో గవర్నర్, సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య రోజురోజుకి అగాధం పెరిగిపోతూనే ఉంది. ఈ ద్వేషం లేదా శత్రుత్వం పెరగడంతో కొత్తగా ఎన్నికైన ఇద్దరు శాసనసభ్యులకు శాపంగా మారింది. భగవంగోలా ఎమ్మెల్యే రేయత్ హొస్సేన్ సర్కార్, బారానగర్ ఎమ్మెల్యే సయంతిక బెనర్జీ వారు ఎన్నికైన 22 రోజులైన ఇప్పటి దాకా ప్రమాణస్వీకారం చేయలేదు.

దీనితో వారి ప్రజాప్రతినిధులుగా వారి విధులకు ఆటంకం కలుగుతోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఎక్కడ చేయాలనే అంశంపై గవర్నర్, సీఎం మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఈ అంశంపై ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ వెలుపల ధర్నా చేస్తున్నారు. మమతా సర్కార్ వారిని అసెంబ్లీ లోపల ప్రమాణ స్వీకారం చేయాలని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ను డిమాండ్ చేస్తున్నారు.

వేదిక విషయంలో..
ఇద్దరు ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయాలని గవర్నర్ సీవీ ఆనంద బోస్ పట్టుబట్టడంతో సమస్య మొదలైంది. వీరి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారనే విషయం చెప్పకుండానే జూన్ 26న ప్రమాణస్వీకార షెడ్యూల్ చేశారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు వేచి చూస్తామని ఎమ్మెల్యేలకు గవర్నర్ లేఖలో తెలిపారు. మరోవైపు తాము అసెంబ్లీలో ప్రమాణం చేస్తామని, స్పీకర్ బిమన్ బెనర్జీ చేత ప్రమాణ స్వీకారం చేయాలని ఇద్దరు ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు తెలియజేశారు.
ఇద్దరు శాసనసభ్యులు బుధవారం అసెంబ్లీ కాంప్లెక్స్ వద్ద ప్లకార్డులు పట్టుకుని ధర్నాకు కూర్చున్నారు. గవర్నర్ ఇక్కడ రావాలని, వారి రాక కోసం వేచి చూస్తున్నామని ప్లకార్డులు పట్టుకున్నారు. వీరికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సోవాందేబ్ ఛటోపాధ్యాయ కూడా తోడయ్యారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గవర్నర్‌ కోసం ఎదురుచూస్తూ అక్కడే కూర్చున్నారు. శాసనసభ్యులు నిరశన దీక్షలో నిమగ్నమై ఉండగానే గవర్నర్‌ ఢిల్లీకి వెళ్లిపోయారు.
న్యాయ సలహా
ప్రతిష్టంభనను తొలగించేందుకు న్యాయ సలహా తీసుకోవాలని బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించారు. "అవసరమైతే, నేను రాష్ట్రపతి (ద్రౌపది ముర్ము)ని కూడా కలుస్తాను" అని స్పీకర్ బెనర్జీ మీడియాతో అన్నారు. బోస్ ప్రమాణస్వీకారాన్ని "ఓ యుద్ధం"గా మార్చారని, ఉద్దేశపూర్వకంగా సమస్యను జటిలం చేశారని ఆరోపించారు.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేతో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. అయితే సాంప్రదాయకంగా, శాసనసభ్యులతో ప్రమాణం చేయడానికి గవర్నర్ స్పీకర్ లేదా డిప్యూటీని కేటాయిస్తారు. “శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ఎప్పుడూ స్పీకర్ చేయిస్తారు. బీఆర్ అంబేద్కర్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. స్పీకర్‌కు తెలియజేయాల్సిన అవసరం కూడా గవర్నర్ భావించకపోవడం చాలా దురదృష్టకరం” అని బెనర్జీ అన్నారు.
మొదటిసారి కాదు
కొత్తగా ఎన్నికైన సభ్యులు గవర్నర్ ముందు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా గత ఏడాది సెప్టెంబర్‌లో రాజ్‌భవన్‌లో గవర్నర్ బోస్ చేత ధూప్‌గురి తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మల్ చంద్ర రాయ్ ప్రమాణం చేయించారు.
ఇలాంటి ప్రతిష్టంభన ఏర్పడడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని సంవత్సరాల క్రితం TMC తరఫున ఎన్నికైన బాలీగంజ్ ఎమ్మెల్యే బాబుల్ సుప్రియో ప్రమాణ స్వీకారం రెండు వారాల పాటు ఆలస్యమైంది. ఎందుకంటే ఈ వేడుకకు ఎవరు అధ్యక్షత వహించాలనే దానిపై అసెంబ్లీ స్పీకర్, అప్పటి గవర్నర్ జగదీప్ ధంఖర్ మధ్య వాగ్వాదం జరిగింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 188ని ఉటంకిస్తూ, కొత్త శాసనసభ్యులు "గవర్నర్ ముందు ప్రమాణం చేయవలసి ఉంటుంది, లేదా ఆయన చేత అలా అప్పగించబడిన వ్యక్తి ముందు ప్రమాణం చేయాలి" అని పేర్కొంటూ ధంఖర్ ఆ ఉద్యోగాన్ని డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీకి అప్పగించారు. గవర్నర్ ప్రతిపాదనకు స్పీకర్ అంగీకరించడంతో ప్రతిష్టంభన సద్దుమణిగింది.
లైంగిక వేధింపుల అభియోగం
పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న బోస్ పై సార్వత్రిక ఎన్నికల వేళ లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీనితో మమతా సర్కార్ కు గవర్నర్ కార్యాలయానికి మధ్య సంబంధాలు చాలా అధమ స్థాయికి దిగజారాయి. గవర్నర్ బోస్ తన పదవిలో ఉన్నంత వరకు తాను రాజ్ భవన్‌ను సందర్శించబోనని ఎన్నికల ర్యాలీలో ముఖ్యమంత్రి చెప్పడంతో టిఎంసి ఈ ఆరోపణను ప్రధాన ఎన్నికల అంశంగా మార్చింది.
గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పని సంబంధాలు పూర్తిగా విచ్ఛిన్నం కావడాన్ని సూచిస్తున్నందున తాను ముఖ్యమంత్రితో మాటల పోటీకి దిగబోనని బోస్ ఇటీవల ప్రకటించారు.
Read More
Next Story