మాకు ప్రత్యేక యూటీ కావాలంటున్న ఆ గిరిజన జాతులు
x

మాకు ప్రత్యేక యూటీ కావాలంటున్న ఆ గిరిజన జాతులు

గౌహతి సమావేశంలో పాత డిమాండ్ కే కట్టుబడ్డ కుకీ- జో తెగలు


మణిపూర్ లో ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్దరించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అత్యున్నత కుకీ-జో కౌన్సిల్, కుకీ జో శాసన సభ్యులు సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్(ఎస్ఓఓ) కింద తమకు ప్రత్యేక భూభాగం కావాలనే డిమాండ్ ను బలపరిచింది.

దానికి ప్రత్యేకంగా శాసనసభ సైతం ఉండాలని తీర్మానించింది. కుకీ- జో కమ్యూనిటీలతో సంప్రదింపుల సమావేశం గౌహతిలో జరిగింది. ఇందులో రెండు తెగలు తమ డిమాండ్లను ఏమాత్రం మార్చడానికి ఇష్టపడక వాటికే కట్టుబడి ఉన్నాయి.

గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి మణిపూర్ అసెంబ్లీ సుప్తచేతన స్థితిలో ఉంది. దానిని పునరుద్దించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయితే తమ ప్రధాన రాజకీయ డిమాండ్లను నెరవేరిస్తేనే మీ ప్రతిపాదలనకు సహకరిస్తామని గిరిజన తెగలు అంటున్నాయి.
ప్రభుత్వంలో భాగస్వామ్యం..
మణిపూర్ లో అన్ని తెగల భాగస్వామ్యంతో ప్రజా ప్రభుత్వాన్ని పునరుద్దరించడానికి దీర్ఘకాలంగా జరుగుతున్న ప్రయత్నాలు ఇటీవల కాలంలో ఊపందుకున్నాయి.
ఎలాగైన ఇక్కడ ఉన్న రాజకీయ అనిశ్చితిని తొలగించాలని ప్రభుత్వ పెద్దలు కంకణం కట్టుకున్నారు. అయితే ఇక్కడ జరిగే చర్చలు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అనేలా ఉంది.
మే 2023 లో ఇక్కడ కుకీ- మెయితీ జాతుల మధ్య సంఘర్షణ మొదలైంది. అప్పటి నుంచి ఇరువర్గాలకు చెందిన శాసనసభ్యులు ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
గౌహతీ తీర్మానం ప్రకారం ఎన్నికైన ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే కుకీ- జో ప్రజలకు శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కావాలని, వాటికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు లిఖిత పూర్వక హమీ ఇవ్వాలని వాటికి కచ్చితమైన కాలపరిమితి ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి.
తీర్మానంలో ఏం ఉంది?
‘‘రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేయడం గురించి సమావేశం తీసుకున్న తీర్మానంలో.. రాజ్యాంగం ప్రకారం శాసనసభతో యూటీ కోసం చర్చల ద్వారా కుదిరిన రాజకీయా పరిష్కారానికి మద్దతు ఇవ్వడానికి కొత్త ప్రభుత్వం రాతపూర్వకంగా హమీ ఇవ్వాలి.
ఇది కూడా కాలపరిమితితో అమలు చేయాలి, ముఖ్యంగా ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలంలో ఈ హమీని అమలు చేయాలి’’ అని తీర్మానంలో పేర్కొన్నారు.
ఇందులో తమ వైఖరిని కుకీ- జో తెగ సభ్యులు సమర్థించుకున్నారు. గత సంవత్సరం జరిగిన జాతిహింస వల్లే ఇలాంటిది తలెత్తిందని చెప్పే ప్రయత్నం చేసింది. తమ జాతులే లక్ష్యంగా జరిగిన దాడుల్లో రాష్ట్ర సంస్థల సహకారం ఉందని ఆరోపించింది. అందుకే తమకు ప్రత్యేక యూటీ ప్రాంతం కావాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంది.
‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాజకీయ నిబద్ధత లేనప్పుడూ మణిపూర్ లో ఎన్నికైన ప్రతినిధులు ప్రభుత్వ ఏర్పాటులో ఎటువంటి పాత్ర పోషించకుండా ఉండాలని తీర్మానం చేస్తున్నాం’’ అని పేర్కొంది.
‘‘మా భూమి, యాజమాన్య హక్కుల రక్షణకు తగిన రాజ్యాంగ రక్షణలతో పాటు, శాసనసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం కోసం మా డిమాండ్ ను నెరవేర్చడానికి కేంద్రం రాజకీయ పరిష్కారాన్ని వేగవంతం చేయాలి’’ అని డిమాండ్ చేస్తూ.. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సమస్య పరిష్కారం చేయాలని కోరింది.
Read More
Next Story