
సియాంగ్ డ్యామ్‌పై అరుణాచల్‌లో ఆగ్రహజ్వాలలు..
సీఎం పెమా ఖండూ చర్చల ఆఫర్‌ను తిరస్కరించిన నిరసనకారులు!
అరుణాచల్‌ప్రదేశ్‌లో 11,200 మెగావాట్ల భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతోంది. సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు.
నిరసనలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి పెమా ఖండూ స్వయంగా చర్చలకు సిద్ధమని ప్రకటించినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. తాజాగా ప్రతిపాదలను సియాంగ్ ఆదివాసీల రైతుల ఫొరం, ఎస్యూఎంపీ ప్రభావిత ప్రాంత యువజన సంఘం(ఎస్ఏఏవైఏ) తిరస్కరించాయి. ముందుగా ఎలాంటి చర్చలు జరిపే ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్న నిరసనకారులను విడుదల చేయాలని, భద్రతా బలగాలను ఉపసంహరించాలని పట్టుబట్టాయి.
ఎస్ఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడి విజ్ఞప్తి..
SIFF అధ్యక్షుడు నోబెంగ్ బురాంగ్ కూడా ఆందోళనకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. నిరసనల్లో పాల్గొన్న యువకులు జైళ్లలో ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వారి భవిష్యత్తు గురించి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ఉద్యమానికి ప్రజల మద్దతు అవసరమని కోరారు.
మరోవైపు SIFF ముఖ్య సలహాదారు అనోంగ్ జోంగ్కీ కూడా తమ వైఖరిని స్పష్టం చేశారు. అరెస్టయిన తమ సభ్యులు, ఇతర యువకులను విడుదల చేసే వరకు ప్రభుత్వం నిర్వహించే సమావేశాలకు హాజరుకాబోమని తెలిపారు. సియాంగ్, అప్పర్ సియాంగ్ ప్రాంతాల్లో మోహరించిన సైన్యం, పారామిలటరీ బలగాలను కూడా వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు.
జిల్లా యంత్రాంగం ముఖ్యమంత్రి చర్చలకు ఆహ్వానించిన విషయాన్ని తమకు తెలియజేసిందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రతిపాదనను అంగీకరించడం లేదని జోంగ్కీ వెల్లడించారు. ముందుగా నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేయాలని, ఆ తరువాత ముఖ్యమంత్రి గేకూ, యింగ్కియోంగ్ ప్రాంతాలకు వచ్చి స్థానికులతో మాట్లాడాలని కోరారు.
ఇక ఈ నిరసనలు కేవలం సియాంగ్, అప్పర్ సియాంగ్ ప్రాంతాలకే పరిమితం కావడం లేదు. రాష్ట్ర రాజధాని ఇటానగర్ పరిసర ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. జర్నలిస్టు, సామాజిక కార్యకర్త తకమ్ సోనియా నాయకత్వంలోని పబ్లిక్ రైట్స్ యాక్షన్ కమిటీ (PRAC) నవంబర్ 4న క్యాపిటల్ కాంప్లెక్స్ పరిధిలో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది.
ఈ కమిటీ కూడా సియాంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన తమ అభ్యంతరాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతోంది. నిరసనకారుల విడుదలతో పాటు ప్రజలకు అవసరమైన కనీస సదుపాయాలపై కూడా పలు డిమాండ్లు ముందుకు తెచ్చింది. రోడ్ల నిర్వహణ మెరుగుపరచడం, ఆసుపత్రుల్లో తగినన్ని మందులు అందుబాటులో ఉంచడం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సదుపాయాలు కల్పించడం, మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు సరైన రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.
ఈ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే నవంబర్ 4 నుంచి 8వ తేదీ వరకు నిరవధిక బంద్ నిర్వహిస్తామని కమిటీ హెచ్చరించింది. అంటే సియాంగ్ ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమంతో పాటు ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించాలన్న డిమాండ్లు కూడా నిరసనల్లో భాగమవుతున్నాయి.
ఇదే సమయంలో ఆదీ గాలో వెల్ఫేర్ సొసైటీ కూడా ఉద్యమానికి మద్దతుగా మరో కార్యక్రమాన్ని ప్రతిపాదించింది. గేకూ నుంచి ఇటానగర్ వరకు శాంతియుత పాదయాత్ర నిర్వహించేందుకు అప్పర్ సియాంగ్ జిల్లా కలెక్టర్ అనుమతి కోరింది. నవంబర్ 2న ఈ మేరకు లేఖ రాసింది.
ఈ పాదయాత్ర ద్వారా సియాంగ్ ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటించడంతో పాటు, నిర్బంధంలో ఉన్నవారికి న్యాయం చేయాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరపాలని డిమాండ్ చేయాలని భావిస్తోంది. ఈ యాత్రలో బ్యాకప్ బృందంతో కలిపి గరిష్ఠంగా పది మంది మాత్రమే పాల్గొంటారని, కార్యక్రమం పూర్తిగా శాంతియుతంగా సాగుతుందని సంఘం హామీ ఇచ్చింది.
ఈ పాదయాత్రను మూడు భాగాలుగా నిర్వహించాలని ప్రతిపాదించారు. మొదట అప్పర్ సియాంగ్ జిల్లాలోని గేకూ నుంచి సుమ్సింగ్, కొంకర్, లిగోంగ్ మీదుగా కటాన్ వరకు వెళ్లాలని నిర్ణయించారు. అక్కడి నుంచి మరియాంగ్ క్రాస్‌రోడ్స్, రంగనాథ్, పాసీఘాట్ మీదుగా రెండో దశ కొనసాగుతుంది. చివరి దశలో మెబో, రుక్సిన్, అసోం సరిహద్దులోని జోనై, సిలపథర్, బందర్దేవా గేట్, నహర్లగూన్ మీదుగా ఇటానగర్ చేరుకోవాలని ప్రతిపాదించారు.
ఇలా ఒకవైపు బంద్‌లు, మరోవైపు పాదయాత్రలు, ఇంకోవైపు నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేయాలన్న డిమాండ్లతో ఉద్యమం విస్తరిస్తోంది.
ఇక నవంబర్ 2వ తేదీ ఉదయం ఐదు గంటలకు SIFF, SAAYA సంయుక్తంగా 36 గంటల బంద్ ప్రారంభించాయి. విద్యార్థి, సామాజిక సంఘాలు కూడా ఈ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. నవంబర్ 3వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు బంద్ ముగిసింది. సియాంగ్, అప్పర్ సియాంగ్, ఈస్ట్ సియాంగ్ జిల్లాల్లో ఈ ఆందోళన జరిగింది.
ఈ బంద్ ప్రభావం ముఖ్యంగా అప్పర్ సియాంగ్ జిల్లాలోని యింగ్కియోంగ్, గేకూ ప్రాంతాల్లో తీవ్రంగా కనిపించింది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, మార్కెట్లు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ప్రజా రవాణా కూడా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు రోడ్లపై టైర్లు కాల్చి ఆందోళన చేపట్టారు.
ఈస్ట్ సియాంగ్ జిల్లాలో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించగా, సియాంగ్ జిల్లాలో మాత్రం పెద్దగా అంతరాయం కలగలేదని అధికారులు వెల్లడించారు. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, పాఠశాలలు సాధారణంగానే పనిచేశాయి.
బంద్ సందర్భంగా పెద్దగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకపోయినప్పటికీ ఉద్రిక్తతలు మాత్రం కొనసాగాయి. నవంబర్ 1వ తేదీ రాత్రి నుంచే అప్పర్ సియాంగ్ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. యింగ్కియోంగ్, సిమోంగ్, కొంకర్, గేకూ ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అంతేకాకుండా, జిల్లా యంత్రాంగం BNSS 2023లోని సెక్షన్ 163 కింద ఈ బంద్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించింది.
ఇక అక్టోబర్ 23న జరిగిన హింసాత్మక ఘటనల తరువాత పోలీసులు చేపట్టిన అరెస్టులు కూడా ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా జరిగిన హింసకు సంబంధించి పోలీసులు మొత్తం 69 మందిని అరెస్టు చేయగా, మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పర్ సియాంగ్, సియాంగ్, ఈస్ట్ సియాంగ్ జిల్లాల్లో ఈ అరెస్టులు జరిగాయి.
అరుణాచల్ ప్రదేశ్ అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, 2014 కింద కూడా కేసులు నమోదు చేశారు. అదనంగా భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. చట్టవిరుద్ధంగా గుమిగూడటం, అల్లర్లు సృష్టించడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, నేరపూరిత కుట్ర, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినట్లు నమోదైన ఒక కేసులో ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్‌లోని సెక్షన్ 3ను కూడా ప్రయోగించారు. ఇంకా 201 మందికి భారతీయ నాగరిక్ సురక్ష సంహిత నిబంధనల కింద నోటీసులు జారీ చేశారు.
ఈ కేసుల్లో న్యాయవాది, సామాజిక కార్యకర్త ఎబో మిలి, యువజన నాయకుడు ఒటుల్ జెరాంగ్ అక్టోబర్ 24న పాసీఘాట్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఆ తరువాత వారిని పాసీఘాట్ జైలుకు తరలించారు. అక్కడ వారిద్దరూ నిరాహార దీక్ష ప్రారంభించారు.
ఇదే సమయంలో గేకూ ప్రాంతానికి చెందిన అదుమ్ తయోమ్, ఓమక్ పరోన్, ఓకుట్ పలొహ్, ఓసోన్ పరోన్ అనే నలుగురిని కూడా APUAPA కింద నిర్బంధించారు. వీరిని పాసీఘాట్ నుంచి ఇటానగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వార్తలు వచ్చినప్పటికీ, వారి ప్రస్తుత ఆచూకీపై పోలీసులు అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. పాసీఘాట్ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఐదుగురు మైనర్లను జువెనైల్ హోమ్‌కు పంపగా, మరో ఆరుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.
అయితే, అరెస్టుల విషయంలో SIFF చెబుతున్న వివరాలకు, పోలీసుల అధికారిక లెక్కలకు మధ్య తేడా ఉంది. తమ సంస్థ ప్రతినిధి టగోరి మిజే ప్రకారం పాసీఘాట్ నుంచి కనీసం 27 మందిని, గేకూ నుంచి నలుగురిని, రిగా నుంచి ఆరుగురిని పోలీసులు తీసుకెళ్లారు.
అయితే ఈ వివరాలను పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. మరోవైపు ఈస్ట్ సియాంగ్ ఎస్పీ పంకజ్ లాంబా మాత్రం పాసీఘాట్‌లో అక్టోబర్ 23న జరిగిన హింసకు సంబంధించి 21 మందిని అరెస్టు చేశామని, మరో ఆరుగురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
ఈ అరెస్టులు, నిర్బంధాలే ఇప్పుడు చర్చలకు ప్రధాన అడ్డంకిగా మారాయి. నిరసనకారుల విడుదలకు ముందు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ప్రతిపాదననూ అంగీకరించబోమని SIFF, SAAYA స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ వివాదానికి మరో కీలకమైన కోణం కూడా ఉంది. అదే చైనా నిర్మిస్తున్న భారీ ఆనకట్ట.
సియాంగ్ నది చైనాలో యార్లుంగ్ సాంగ్పో పేరుతో ప్రవహిస్తుంది. ఈ నదిపై చైనా మెడోగ్ కౌంటీ ప్రాంతంలో భారీ డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు 2025 జూలై 19న సమాచారం వెలువడిందని ముఖ్యమంత్రి పెమా ఖండూ తన ప్రకటనలో ప్రస్తావించారు. ఈ ప్రాంతం భారత సరిహద్దుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్మాణానికి సంబంధించి చైనా భారత్‌తో సంప్రదింపులు జరపలేదని, ఎలాంటి సమాచారం కూడా పంచుకోలేదని తెలిపారు.
ఖండూ వివరించిన ప్రకారం, సియాంగ్ లోయకు రెండు రకాల ముప్పులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకటి ఎగువ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా భారీగా నీరు విడుదలైతే వరదలు వచ్చే ప్రమాదం. రెండోది శీతాకాలంలో నీటి లభ్యత తగ్గిపోవడం. ముఖ్యంగా ఆనే సియాంగ్ నదిలో సుమారు 65 శాతం నీరు చైనా ప్రాంతం నుంచి వస్తుందని ఆయన వివరించారు.
ఎగువ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో భారత్ నియంత్రించలేకపోవచ్చని, అయితే మనవైపు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను మాత్రం నిర్ణయించుకోవచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సియాంగ్, బ్రహ్మపుత్ర నదుల్లో పర్యావరణ ప్రవాహాన్ని కొనసాగించే అంశాన్ని శాస్త్రీయంగా, సాంకేతికంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందులో భాగంగానే సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టును ఒక ప్రత్యామ్నాయంగా పరిశీలించవచ్చని ఆయన వాదిస్తున్నారు.
అయితే, చైనా అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుకు స్థానికుల మద్దతు లభిస్తుందని చెప్పలేం. ఎందుకంటే స్థానికుల ఆందోళనలు కేవలం భద్రతాపరమైన అంశాలకే పరిమితం కావడం లేదు. తమ భూములు, ఇళ్లు, ఆనే సియాంగ్‌తో తమకున్న అనుబంధం, సంప్రదాయ జీవన విధానాలపై ప్రాజెక్టు ప్రభావం పడుతుందన్న భయాలు కూడా ఉన్నాయి.
ఈ విషయాన్ని పెమా ఖండూ తన తాజా ప్రకటనలో అంగీకరించారు. ఆదీ సమాజానికి తమ భూములు, నివాసాలు, ఆనే సియాంగ్‌పై ఉన్న ఆందోళనలు సహజమేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా వారి సందేహాలను నివృత్తి చేయడం, ప్రాజెక్టు గురించి వివరించడం తన బాధ్యత అని తెలిపారు.
అంతేకాదు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2008 ఫిబ్రవరి 7న జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించిందని గుర్తుచేశారు. దేశంలో గుర్తించిన 16 జాతీయ ప్రాజెక్టుల్లో సియాంగ్ ప్రాజెక్టు కూడా ఒకటని చెప్పారు.
అయితే, ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఖండూ చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్నది కేవలం ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు తయారీ ప్రక్రియ మాత్రమేనని వివరించారు. అంటే ప్రాజెక్టును నిర్మించడం సాధ్యమా? దాని వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? ఇతర ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలను ప్రాథమికంగా పరిశీలించే దశలోనే ఉన్నామని ఆయన అంటున్నారు.
ఈ నివేదిక తయారైనంత మాత్రాన ప్రాజెక్టుకు తుది అనుమతి లభించినట్లు కాదని, ఆనకట్ట నిర్మాణం తప్పనిసరిగా జరుగుతుందని కూడా అర్థం కాదని స్పష్టం చేశారు.
ఇక భూముల సేకరణ, కుటుంబాల తరలింపు విషయంలోనూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. స్థానికుల అంగీకారం లేకుండా కుటుంబాలను బలవంతంగా తరలించడం, వారి భూములను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. భూసేకరణ, పునరావాసానికి సంబంధించిన 2013 చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 నిబంధనలను అనుసరించాల్సి ఉంటుందని వివరించారు.
ప్రాజెక్టు నిర్మాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముందుగా విస్తృత స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామని, స్థానికుల అంగీకారం లేకుండా ముందుకు వెళ్లబోమని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో చర్చల్లో పాల్గొనాలని ఆదీ సమాజంతో పాటు సియాంగ్, అప్పర్ సియాంగ్ ప్రాంత ప్రజలను కోరారు.
అయితే, శాంతియుత చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ హింస, బంద్‌లు, రహదారుల దిగ్బంధం, దాడులను మాత్రం సహించబోమని ఖండూ స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్న అరుణాచల్ ఇండిజినస్ ట్రైబ్స్ ఫోరం, ఇతర సామాజిక సంస్థలకు కృతజ్ఞతలు కూడా తెలిపారు.
మరోవైపు, అరెస్టయిన యువకుల కేసులను అడ్వైజరీ బోర్డు ముందు ఉంచుతామని అప్పర్ సుబన్సిరి డిప్యూటీ కమిషనర్ అశోక్ తాజో తెలిపారు. వారిని విడుదల చేయాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం ఆ బోర్డు తీసుకుంటుందని చెప్పారు. కేంద్ర బలగాల ఉపసంహరణ అంశాన్ని కూడా పరిస్థితులు మెరుగుపడిన తరువాత పరిశీలిస్తామని వెల్లడించారు.
అంటే ప్రస్తుతం ప్రభుత్వం ఒకవైపు ప్రాజెక్టుపై ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా, మరోవైపు శాంతిభద్రతల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తోంది. నిరసనకారులు మాత్రం ముందుగా తమ సహచరులను విడుదల చేయాలని, భద్రతా బలగాలను వెనక్కి పంపాలని పట్టుబడుతున్నారు.
SIFF అధ్యక్షుడు నోబెంగ్ బురాంగ్ కూడా తమ డిమాండ్లు నెరవేరకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నవంబర్ 4 నుంచి యింగ్కియోంగ్లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు.
మొత్తానికి సియాంగ్ ప్రాజెక్టు వివాదం ఇప్పుడు మూడు ప్రధాన అంశాల చుట్టూ తిరుగుతోంది. ఒకటి.. 11,200 మెగావాట్ల ప్రాజెక్టు వల్ల స్థానిక ప్రజలకు ఎదురయ్యే పరిణామాలపై ఉన్న ఆందోళనలు. రెండోది.. అక్టోబర్ 23 ఘటనల తరువాత జరిగిన అరెస్టులు, భద్రతా బలగాల మోహరింపు. మూడోది.. చైనా ఎగువ ప్రాంతంలో చేపడుతున్న ఆనకట్ట నిర్మాణం నేపథ్యంలో సియాంగ్ నది నీటి భద్రతకు సంబంధించిన అంశాలు.
ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదని, కేవలం సాధ్యాసాధ్యాలను మాత్రమే పరిశీలిస్తున్నామని చెబుతోంది. స్థానిక సంఘాలు మాత్రం ఈ ప్రక్రియపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తమ నాయకులు, యువకులు నిర్బంధంలో ఉన్నంతకాలం ప్రభుత్వంతో చర్చలకు వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టు భవిష్యత్తు కంటే ముందు ప్రభుత్వానికి ఎదురవుతున్న అసలు సవాలు స్థానిక ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడమే. చైనా నుంచి ఎదురయ్యే నీటి భద్రతా సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఒకవైపు ఉంటే, స్థానికుల భయాలు, అభ్యంతరాలు, హక్కులను గౌరవించాల్సిన బాధ్యత మరోవైపు ఉంది. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధిస్తూ సమస్యకు పరిష్కారం కనుగొనడం ఇప్పుడు అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వానికి కీలకంగా మారింది.
Next Story
