మణిపూర్‌లో నాగాలు–కుకీల మధ్య మళ్లీ శాంతి చర్చలు?
x
కుకీ- నాగా ప్రతినిధులు

మణిపూర్‌లో నాగాలు–కుకీల మధ్య మళ్లీ శాంతి చర్చలు?

చర్చలతోనే సరిపోతుందా? సాయుధ గ్రూపులు వెనక్కి తగ్గుతాయా?


Click the Play button to hear this message in audio format

మణిపూర్‌లో నెలల తరబడి కొనసాగుతున్న నాగాలు, కుకీల మధ్య ఘర్షణలకు ముగింపు పలికేందుకు మరో ప్రయత్నం మొదలైంది. ఇరు వర్గాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు చర్చి పెద్దలు మళ్లీ రంగంలోకి దిగారు.

కోల్‌కతాలో మూడు రోజుల పాటు జరిగిన శాంతి చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా హింసకు విరామం ప్రకటించాలని పిలుపునిచ్చారు.

అయితే ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇరు వర్గాల నాయకులు చర్చలకు సిద్ధమైనప్పటికీ.. క్షేత్రస్థాయిలో సాయుధ గ్రూపులు ఎలా స్పందిస్తాయన్న దానిపైనే శాంతి ప్రక్రియ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

గతంలోనూ విఫలమైన ప్రయత్నం

నాగాలు, కుకీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో చర్చి సంస్థలు గతంలోనూ ఇరు వర్గాలను దగ్గరకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయి. అయితే ఈ ఏడాది మే నెలలో ముగ్గురు కుకీ చర్చి నాయకులు హత్యకు గురికావడంతో ఆ ప్రయత్నాలకు గండి పడింది. ఈ హత్యల్లో ఒక నాగా సాయుధ గ్రూపు సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటన ఇరు వర్గాల మధ్య నమ్మకాన్ని మరింత దెబ్బతీసింది. తాజాగా మరోసారి చర్చలు ప్రారంభం కావడాన్ని కుకీ, నాగా సంఘాలు స్వాగతించాయి. కుకీ వర్గానికి చెందిన కమిటీ ఆన్ ట్రైబల్ యూనిటీ ప్రతినిధి ఎన్‌జీ లున్ కిప్‌జెన్ ఈ ప్రయత్నాన్ని సాధారణ పరిస్థితులను పునరుద్ధరించే దిశగా సానుకూల అడుగుగా అభివర్ణించారు.

కోల్‌కతాలో మూడు రోజుల చర్చలు

నవంబర్ 22 నుంచి 24 వరకు కోల్‌కతాలో ఫోరం ఫర్ నాగా రీకన్సిలియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు శాంతి సమావేశం జరిగింది. కుకీ, నాగా వర్గాలకు చెందిన చర్చి సంస్థలు, సామాజిక సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
ఇరు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణలకు అసలు కారణాలను గుర్తించాలని, వాటిని పరస్పర గౌరవం, అవగాహనతో కూడిన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
ఈ చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు క్రిస్మస్‌కు ముందే మరో విడత సమావేశం నిర్వహించాలని కూడా అంగీకరించారు. ఇందులో అన్ని వర్గాల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు.

క్రిస్మస్ ట్రూస్‌కు పిలుపు

ఈ సమావేశంలో తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం క్రిస్మస్ ట్రూస్. అంటే క్రిస్మస్ సందర్భంగా ఇరు వర్గాలు హింసకు విరామం ఇచ్చి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని ఫోరం ఫర్ నాగా రీకన్సిలియేషన్ విజ్ఞప్తి చేసింది.
హింస కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు తక్షణ ఉపశమనం కల్పించడం, మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా చూడటం, శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశం.
అదే సమయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, పుకార్లు, విద్వేషపూరిత వ్యాఖ్యలు ఆపాలని ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేసింది. ఇవి ఇప్పటికే ఉన్న విభేదాలను మరింత పెంచుతున్నాయని పేర్కొంది.

సాయుధ గ్రూపుల వైఖరే కీలకం

అయితే చర్చలు జరగడం ఒక ఎత్తయితే.. వాటి ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించడం మరో ఎత్తు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే సాయుధ గ్రూపుల వైఖరి ఈ శాంతి ప్రయత్నానికి అత్యంత కీలకంగా మారింది.
కుకీ మేధావి ఒకరు మాట్లాడుతూ.. ఇరు వర్గాల చర్చి, సామాజిక సంస్థలు చర్చలకు ముందుకు రావడం మంచి పరిణామమే అయినప్పటికీ, సాయుధ గ్రూపులు కూడా అదే దిశగా స్పందించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
యునైటెడ్ నాగా కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్‌జీ లోర్హో కూడా శాంతి సాధించాలంటే కేవలం విజ్ఞప్తులు సరిపోవని స్పష్టం చేశారు. నిజమైన సయోధ్య అవసరమని, అది లేకుండా శాంతి సాధ్యం కాదని పేర్కొన్నారు. సాధారణ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారన్న విషయాన్ని సాయుధ గ్రూపులు గౌరవిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఈ శిఖరాగ్ర సమావేశానికి కుకీ ఇన్ఫి మణిపూర్, యునైటెడ్ నాగా కౌన్సిల్, కుకీ క్రిస్టియన్ చర్చ్, కుకీ బాఫ్టిస్ట్ చర్చ్ లు, నాగా క్రిస్టియన్ ఫోరమ్ మణిపూర్, నాగా పీపుల్స్ ఇనిషియేటివ్ ఫర్ పీస్ మణిపూర్ వంటి అనేక చర్చి, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
సదస్సులోల పాల్గొన్న యూఎన్స అధ్యక్షుడు ఎన్గ్ లోర్హో ‘ది ఫెడరల్ ’ తో మాట్లాడుతూ.. సంప్రదింపుల శాంతిని పునరుద్ధరించడంలో సహయపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘విజ్ఞప్తులు చేయడం వేరు.. దానిపై పనిచేయడం వేరు.. మనకు నిజమైన సయోధ్య అవసరం. అది లేకుండా శాంతి ఉండదు’’ అని అన్నారు.
ఈ చొరవ విజయవంతం కావడానికి సాయుధ బృందాల ప్రతిస్పందన కీలకమని ఆయన అంగీకరించారు. శాంతి కోరుకునే వ్యక్తులు సాధారణ ప్రజల మనోభావాలను గౌరవిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కుకీ సంస్థల డిమాండ్లు.. ప్రభుత్వానికి గడువు

మరోవైపు కుకీ సంస్థల ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఉద్రిక్తతలను మొత్తం కుకీ, నాగా సమాజాల మధ్య ఘర్షణగా చూడకూడదని కిప్‌జెన్ స్పష్టం చేశారు. కొన్ని నాగా ఉప తెగలకు సంబంధించిన ఘర్షణలను మొత్తం నాగా సమాజానికి ఆపాదించకూడదని అన్నారు.
ఇదిలా ఉంటే, కుకీ సంస్థ కోటూ ప్రభుత్వానికి ఐదు డిమాండ్లతో కూడిన గడువు విధించింది. నవంబర్ 27 నుంచి జాతీయ రహదారులపై నిరవధిక దిగ్బంధం చేపడతామని హెచ్చరించింది.
అక్టోబర్ 28న తఫౌ ప్రాంతంలో ఇద్దరు కుకీ-జో యువకుల హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడం, నిందితులను అరెస్టు చేయడం వీటిలో ప్రధానమైనవి. ఉప ముఖ్యమంత్రి లోసీ దిఖోను తొలగించాలని, తఫౌ గ్రామ పోలీసు పరిధిని కాంగ్‌పోక్ఫీ జిల్లాకు మార్చాలని కూడా డిమాండ్ చేసింది.
సేనాపతి ప్రాంతంలోని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్‌ఎస్‌సీఎన్-ఐఎం హుథ్రాంగ్ బ్రిగేడ్ శిబిరాన్ని తొలగించాలని కోరింది. ఐదు డిమాండ్లలో ఇప్పటివరకు ఎన్ఐఏ విచారణకు అప్పగించాలన్న ఒక్క డిమాండ్ మాత్రమే నెరవేరింది.

71 మందిని బలిగొన్న ఘర్షణలు

మణిపూర్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న కుకీ–నాగా ఘర్షణల్లో ఇప్పటివరకు కనీసం 71 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు వర్గాల సమాచారం. వీరిలో 38 మంది కుకీ-జో వర్గానికి చెందినవారు కాగా, 33 మంది నాగాలు.
ఈ నేపథ్యంలో కోల్‌కతాలో జరిగిన శాంతి సమావేశం మరోసారి ఇరు వర్గాల మధ్య చర్చలకు మార్గం సుగమం చేసింది. అయితే చర్చి పెద్దలు, సామాజిక సంఘాలు చూపిస్తున్న చొరవను సాయుధ గ్రూపులు కూడా గౌరవిస్తాయా? క్రిస్మస్ ట్రూస్ ఆచరణలోకి వస్తుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
మొత్తానికి మణిపూర్‌లో శాంతి స్థాపనకు మరో అవకాశం ఏర్పడింది. కానీ అది కేవలం చర్చలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో హింస ఆగి, ఇరు వర్గాల మధ్య నమ్మకం తిరిగి ఏర్పడినప్పుడే నిజమైన ఫలితం దక్కుతుంది.
Read More
Next Story