
గౌహతి ఐఐటీ లో తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి
కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడానికి వెళ్లిన ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. బాధితురాలు తెలంగాణకు చెందిన విద్యార్థినిగా గుర్తించారు.
కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి హస్టల్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన అస్సాం లో చోటు చేసుకుంది. మృతి చెందిన విద్యార్థిని తెలంగాణకు చెందిన ఐశ్వర్య పుల్లూరు గా గౌహతి ఐఐటీ ఓ ప్రకటనలో తెలిపింది.
వివరాలు.. గౌహతి ఐఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో నాలుగో సంవత్సరం చదువుతున్న ఐశ్వర్య మరో ముగ్గురు స్నేహితులు కలిసి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు డిసెంబర్ 31న రాత్రి హస్టల్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌహతి నగరానికి వచ్చారు. ఆన్ లైన్ లో ఓ హోటల్ రెండు గదులను బుక్ చేసుకున్నారు.
అర్ధరాత్రి తరువాత వీరంతా హోటల్ లో బుక్ చేసుకున్నతమ గదులకు చేరుకున్నారు. అయితే అప్పటికే వారు మత్తులో ఉన్నారని హోటల్ సిబ్బంది చెబుతున్నారు. మరుసటి రోజు ఉదయం మరో సహచర విద్యార్థిని వాష్ రూమ్ లో వెళ్లగా, అక్కడ ఐశ్వర్య అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే ఆమెను గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హస్పిటల్ తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ‘మేము స్నేహితులందరిని విచారిస్తున్నాం, అలాగే అనుమానం కలిగిన ఇతర వ్యక్తులను సైతం ప్రశ్నిస్తున్నాం’ అని విచారణ అధికారి తెలిపారు. ‘ హోటల్ లో రావడానికంటే ముందే వారు మత్తులో ఉన్నట్లు గుర్తించాం, అలాగే ఘటన జరిగిన ప్రదేశాన్ని సైతం పరిశీలిస్తున్నాం’ అని వివరించారు. ఐశ్వర్య తో పాటు మరో ఇద్దరు విద్యార్థులు, ఓ విద్యార్థిని ఉన్నారు.
కాగా గౌహతి ఐఐటీ క్యాంపస్ ఐశ్వర్య మరణంపై విచారం వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులకు సానూభూతి తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. ‘కొత్త సంవత్సర వేడుకల కోసం డిసెంబర్ 31, 2023 గౌహతి ఐఐటీ క్యాంపస్ నుంచి వెలుపలకి వెళ్లి ఓ విద్యార్థిని మరణించిందనే వార్తను చెప్పడం చాలా దురదృష్టకరం. ఈ సంఘటన పై పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు’అని ప్రకటించింది.