ముస్లింలు, మంగళసూత్రాల వ్యాఖ్యలపై కేసు పెట్టమంటే పెడతామా?
x

ముస్లింలు, మంగళసూత్రాల వ్యాఖ్యలపై కేసు పెట్టమంటే పెడతామా?

ముస్లింలను కించపరిచేలా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు పెట్టేందుకు వెళ్లిన సీపీఎం నేతలకు విచిత్ర అనుభవం ఎదురైంది. అదేమిటంటే..


ట్టం ముందు అందరూ సమానమేనన్నది నానుడి మాత్రమే. కొందరు దానికి మించి ఉంటారనడంలో సందేహం లేదు. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ముస్లింల్ని నానా మాటలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేసు పెడతామంటే ప్రభుభక్తిని చాటడంలో ఆరితేరిన పోలీసులు ఊరుకుంటారా?! తీసుకున్నట్టే తీసుకుని ఇది మా పరిధిలోకి రాదంటే మా పరిధిలోకి రాదంటూ ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ కి ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ కి తిప్పి పంపించారు. ఇదెక్కడో మామూలు మారుమూల పల్లెలోనో, మరెక్కడో గిరిజన ప్రాంతంలోనో జరిగింది కాదు. సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పైగా ఫిర్యాదు చేయడానికి పోయిన వాళ్లు కూడా సామాన్యులేమీ కాదు. చట్టసభల్లో ఆరితేరిన వారే, ప్రజా ఉద్యమాల్లో అందరికీ తెలిసిన వారే.

అసలేం జరిగిందంటే...
సమాజంలోని వివిధ గ్రూపుల మధ్య శతృత్వాన్ని రెచ్చగొట్టేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనలు, ప్రసంగాలు చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పుష్పేందర్‌ సింగ్‌ గరేవాల్‌ ఢిల్లీలోని మందిర్‌ మార్గ్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఎస్.ఐ.ని కలిసి ఫిర్యాదును అందించి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయమన్నారు. ఆయన అటు ఇటు తిప్పి ఇలాంటి కేసులు తమ పరిధిలోకి రావని వేరే చోటికి పొమ్మన్నారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన సీపీఎం నేతలు కాసేపు గందరగోళం చేశారు. అయితే వాళ్లు వింటారా? చివరకు సీపీఎం నేతలు తమ ఫిర్యాదును ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు పంపారు. ఆ తర్వాత ఏమి జరుగుతుందో చూడాలి.
ఇంతకీ వాళ్ల ఫిర్యాదులో ఏముందంటే..
సీపీఎం కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆ ఫిర్యాదులో ఏముందంటే.. 'ప్రధాని నరేంద్ర మోదీ విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలు చేస్తున్నారు. అవన్నీ ఐపిసిలోని 153ఎ, 153బి, 298, 504 సెక్షన్ల కింద విద్వేష ప్రసంగాల కిందకే వస్తాయి. అందుకే వాటిపై ఫిర్యాదు చేస్తున్నాం. మీరు కేసు కట్టండి. రాజస్థాన్‌లోని బన్స్‌వాడాలో ఆదివారం (21వ తేదీ) చేసిన ప్రసంగంలో మోదీ ఉద్దేశ్యపూర్వకంగానే, వ్యూహాత్మకంగానే ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. హిందూ కమ్యూనిటీ ఆస్తులకు ముఖ్యంగా మహిళల బంగారం, మంగళసూత్రాలను కాంగ్రెస్‌ పార్టీ ముస్లిం కమ్యూనిటీ సభ్యులకు పంచిపెడుతుందని, ఆ రకంగా హిందువుల ఆస్తులకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని వారికి ఒక భావం కలిగేలా వ్యాఖ్యలు చేశారు. ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని, విద్వేష ప్రసంగాలు చేస్తూ ఓట్లు అడగడం తీవ్రమైన నేరం. చట్ట వ్యతిరేకం. ప్రధానమంత్రి చేసింది అదే. భారతీయ ముస్లింలను చొరబాటుదారులుగా, దోపిడీదారులుగా, హిందువులకు ముఖ్యంగా హిందూ మహిళలకు ముప్పుగా పేర్కొనడం మతోన్మాదం యొక్క అసాధారణ లక్షణమేమీ కాదు. ఇందుకు సంబంధించి గతంలో ఉదాహరణ చూసినట్లైతే అది, బాబూరావు పటేల్‌ వర్సెస్‌ ఢిల్లీ (అడ్మినిస్ట్రేషన్‌) (1980) 2 ఎస్‌సిసి 402లో సుప్రీం కోర్టు తీర్పులో కనబడుతుంది. గూగుల్‌లో వెతికినా కూడా అనేక ప్రసంగాలు, వ్యాసాలు కనిపిస్తాయి. భారతదేశంలోని ముస్లింలను (మొఘలులతో ముడిపడిన) దురాక్రమణదారులుగా అభివర్ణించారు.

ప్రధాని ఉద్దేశ్యపూర్వకంగానే, రాజ్యాంగ విరుద్ధమైన ‘చొరబాటుదారు లేదా దురాక్రమణదారు’ అనే పదాలను వాడుతున్నారు, వారికి హిందువుల ఆస్తులు పంచిపెడతారని అభివర్ణిస్తున్నారు. దేశంలో వనరులపై ముస్లింలకే మొదటి హక్కు వుందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారంటూ ప్రస్తావించిన తర్వాతనే ఈ వ్యాఖ్యలు చేశారు. హిందువులను, వారి ఆస్తులను మరింతమంది పిల్లలు వున్న చొరబాటుదారులకు (ముస్లింలకు) అప్పగిస్తున్నారనే భావన వారికి కలిగేలా ఈ వ్యక్తీకరణ వుంది. అందువల్ల ముస్లింల చేతుల్లో హిందువులు అణగదొక్కబడతారనే భయందోళనలు కలిగేలా గౌరవనీయులైన ప్రధాన మంత్రి ప్రసంగం వుంది, ఇది దేశ ఐక్యతకు ముప్పు కలిగించేది, పైగా విద్వేష ప్రసంగం కిందకే వస్తుంది' అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇంకా ఆ లేఖలో ఏముందంటే...
ప్రధాని చేసే ప్రకటనలు రెచ్చగొట్టేలా, కమ్యూనిటీల మధ్య చెడు అభిప్రాయాలు పెచ్చరిల్లేలా వున్నాయి. ఇవి చట్టవిరుద్ధం. తల్లుల, సోదరీమణుల బంగారం, మంగళసూత్రాల గురించి మాట్లాడుతూ స్పష్టంగా హిందువులను మోదీ ప్రస్తావించారు. ముస్లింల గురించి మోదీ తన ప్రసంగాల్లో పదే పదే చొరబాటుదారులు, దురాక్రమణదారులని పేర్కొంటున్నారు. పదే పదే ఇదే తరహాలో ప్రసంగాలు చేయడం వల్ల ముస్లిం కమ్యూనిటీ దూషణలకు గురవుతోంది. లౌకికవాదం విలువల గురించి, ఈ దేశ పౌరుల సమానత్వం గురించి వివరించే ఈ దేశ జాతీయ సమగ్రత, ఐక్యతలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీనివల్ల ముస్లిం సభ్యులకు తీవ్ర ముప్పు కలుగుతోంది. ఘోర అవమానం జరుగుతోంది. ముస్లింల, భారతీయ పౌరుల మత విశ్వాసాలు దెబ్బతింటున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.
నేర స్వభావమే ఆ వ్యాఖ్యల లక్ష్యం..
సెక్షన్‌ 153ఎ, బి ల కింద జరిగే నేరాల స్వభావం గుర్తించదగ్గవైనందున, పైన ప్రస్తావించిన ఘటనపై తక్షణమే ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయాలని, దానిపై తగురీతిలో దర్యాప్తు నిర్వహించాలని సీపీఎం నేతలు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని చేస్తున్న ప్రసంగాలను, జరగబోయే ఎన్నికలను దృష్టిని వుంచుకుంటే ప్రధాని మాటలు కచ్చితంగా రెచ్చగొట్టేలా వున్నాయని, తీవ్ర పర్యవసానాలకు దారి తీస్తాయని అర్ధమవుతోంది. పైగా, ఇటువంటి కేసుల్లో ఈ ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రసారమవుతుండడం వల్ల వీటి ప్రభావం కూడా దేశవ్యాప్తంగానే వుంటుందని పేర్కొన్నారు. ఏ పౌరుడైనా, వారు ఎంత ఉన్నతస్థాయిలో వున్నవారైనా చట్టానికి అతీతులు కాదనేది సుస్పష్టం. ఈ పరిస్థితుల్లో పైన పేర్కొన్న నిబంధనలు,సెక్షన్ల కింద ప్రధాని మోడీపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేయాలని సిపిఎం నేతలు కోరారు.


Read More
Next Story