
తేజస్వి యాదవ్ అన్నంత పని చేస్తారా?
ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రికి మిత్రపక్షాల మద్దతు ఇస్తాయా ?
బీహార్(Bihar)లో జూలై 1న ప్రారంభమైన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) శుక్రవారంతో ముగియనుంది. అయితే SIRను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఓటర్లు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు జూలై 1, 1987 తర్వాత జన్మించిన వారు వారి తల్లిదండ్రుల తేదీ, బర్త్ సర్టిఫికేట్ సమర్పించాలని ఈసీ పేర్కొంది. అయితే జూలై 10న జరిగిన విచారణలో ఆధార్, రేషన్ కార్డు, ఓటరు ఐడీలో ఏదో ఒకదాన్ని పరిగణలోకి తీసుకోవాలని ECకి అత్యున్నత న్యాయస్థానం సూచిస్తూనే.. SIR ప్రక్రియ కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 28వ తేదీ మరోసారి ఈ కేసు విచారణకు రానుంది. ఈ సారి SIRపై కోర్టు స్టే విధిస్తుందన్న ఆశాభావంతో ప్రతిపక్షాలు ఉన్నాయి.
‘‘ఎన్నిలను బహిష్కరిస్తాం..’’
ఇండియా బ్లాక్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పిటిషనర్లలో ఒకరైన సీనియర్ ఎంపీ ది ఫెడరల్‌తో మాట్లాడుతూ.. జూలై 28 సుప్రీం కోర్టు ECకి అనుకూలంగా తీర్పు చెబితే.. బీహార్ ఎన్నికలను బహిష్కరించే అంశాన్ని తమ పార్టీ పరిశీలిస్తుందని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, RJD నాయకుడు తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. తేజస్వి (Tejashwi Yadav) నిర్ణయంపై మహాఘట్బంధన్ (గ్రాండ్ అలయన్స్)లో మిగతా పార్టీలు CPI-MLL, VIP తమ స్పందన ఇంకా వెల్లడించలేదు.
‘NDAకు ఈసీ తొత్తుగా వ్యవహరిస్తుంది’
ఇటు ఢిల్లీలో ఇండియా బ్లాక్ పార్టీలు గురువారం ఉదయం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో SIRకి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ కూడా ప్రతిపక్ష ఎంపీలతో కలిసి ఓటర్ల జాబితా సవరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీహార్‌లో NDAను తిరిగి అధికారంలోకి రావడానికి పోల్ ప్యానెల్ "కుట్ర" చేస్తుందని ఆరోపించారు.
ఈసీ వాదనేంటి?
ఈసీ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. పైగా SIRను సమర్థించుకుంది. మరణించిన ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, రెండు చోట్ల ఓటు హక్కు నమోదు చేసుకున్న ఓటర్లను లిస్టులో అలాగే ఉంచడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించింది. 18 లక్షల మంది ఓటర్లు చనిపోయినట్టు తమ దృష్టికి రాగా, 26 లక్షల మంది వివిధ నియోజకవర్గాలకు షిఫ్ట్ అయ్యారని, రెండు చోట్ల పేర్లు నమోదు చేసుకున్న వారు 7 లక్షల మంది ఉన్నారని పేర్కొంది. తీర్పు ఈసీకి అనుకూలంగా వస్తే తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 30, 2025న ప్రచురించే అవకాశం ఉంది. మొత్తంమీద జూలై 28న సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.