
మరోసారి రాహుల్ డిక్లరేషన్ కోరిన ఈసీ
ఈసీ పనితీరుపై పార్లమెంటులో చర్చను అనుమతించడానికి ఎందుకు భయపడుతున్నారు? అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును ప్రశ్నించిన కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్..
కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కేంద్ర ఎన్నికల సంఘంపై చేసిన ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీ(BJP), ఈసీ(EC) కుమ్మకై ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీలోని AICC కార్యాలయంలో ఈనెల 7న ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మహాదేవపుర శాసనసభ స్థానానికి చెందిన ఓటర్ల జాబితాను ఆయన విశ్లేషించారు. సుమారు లక్ష ఓట్లు చోరీ అయినట్లు ఆరోపించారు. ‘‘ఈ నియోజకవర్గంలో 11,965 డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు. 40,009 మంది తప్పుడు చిరునామాలు సమర్పించారు. 10,452 మంది ఒకే చిరునామాలో ఉన్నారు. 4,132 మంది ఓటర్లవి తప్పుడు ఫొటోలున్నాయి. 33,692 మంది ఫారం-6ను దుర్వినియోగం చేశారు’’ అని రాహుల్ ఆరోపించారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇలాంటి అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
అయితే రాహుల్ ఆరోపణలను ఈసీ కొట్టిపడేసింది. తన మాటలకు కట్టుబడి ఉంటే డిక్లరేషన్‌పై సంతకం చేయాలని లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలని ఆగస్టు 8న ఈసీ డిమాండ్ చేసింది. స్పందించిన రాహుల్ తాను సంతకం చేయనని స్పష్టం చేశారు. పార్లమెంటు సభ్యుడిగా ఇప్పటికే ప్రమాణం చేశానని కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో డిక్లరేషన్ ఇవ్వాలని ఈసీ శనివారం (ఆగస్టు 9న) మరోసారి రాహుల్‌ను కోరింది.
మాణికం ఠాగూర్ సూటిప్రశ్న..
ఈసీ పనితీరుపై పార్లమెంటులో చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదని కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ శనివారం ప్రశ్నించారు. ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల్లో ధనబలం వినియోగంపై గతంలో పార్లమెంటులో చర్చ జరిగిన సందర్భాలను ఆయన ఉదహరించారు. “పార్లమెంటులో ఎన్నికల సంఘం పనితీరుపై చర్చను అనుమతించడానికి గౌరవనీయ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎందుకు భయపడుతున్నారు?” అని ఠాగూర్ ప్రశ్నించారు. 1993లో ఎన్నికలను వాయిదా వేయడం లాంటి CEC నిర్ణయాలను కూడా ఉభయ సభలలో బహిరంగంగా చర్చించారని ఈ సందర్భంగా ఠాగూర్ గుర్తుచేశారు.