
ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడి అరెస్ట్
బొగ్గు కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు ఐ ప్యాక్ కు ఎదురుదెబ్బ తగిలింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఐప్యాక్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు అయిన వినేష్ చందేల్ ను ఈడీ అరెస్ట్ చేసింది.
ఈ రోజు సాయంత్రం ఆలస్యంగా ఢిల్లీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల కింద చందేల్‌ను అదుపులోకి తీసుకున్నారని ఒక అధికారి తెలిపారు. విచారణ నిమిత్తం చందేల్ కస్టడీ రిమాండ్ కోరేందుకు, ఈ రోజు రాత్రి అతడిని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఐ-ప్యాక్ 2021 నుంచి టీఎంసీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి రాజకీయ సలహాలు అందిస్తోంది.
రాజకీయ కుదుపు కారణం...
ఈ దర్యాప్తులో భాగంగా ఏప్రిల్ 2న, ఢిల్లీలోని చందేల్ నివాసంతో పాటు, బెంగళూరులోని ఐ-ప్యాక్ మరో సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అయిన రిషి రాజ్ సింగ్ నివాసం, ముంబైలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ విజయ్ నాయర్ నివాసంపై ఈడీ దాడులు చేసింది. ఈ కేసుకు సంబంధించి జనవరి 8న ఐ-ప్యాక్ కార్యాలయం, దాని వ్యవస్థాపకుడు, డైరెక్టర్లలో ఒకరైన ప్రతీక్ జైన్ కోల్‌కతా నివాసంపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది.
అయితే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ఆ ప్రదేశానికి చేరుకుని పత్రాలను తీసుకెళ్లడంతో ఇది వివాదానికి దారితీసింది. కోల్‌కతాలో ఐ-ప్యాక్, జైన్‌లపై తాము జరిపిన సోదాలను ముఖ్యమంత్రి బెనర్జీ "అడ్డుకున్నారని", సంబంధిత పత్రాలు, పరికరాలను ఆమె, రాష్ట్ర యంత్రాంగం బలవంతంగా తీసుకెళ్లారని ఈడీ పేర్కొంది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఐ-ప్యాక్ ప్రాంగణం నుంచి తమ ఎన్నికల వ్యూహానికి సంబంధించిన పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి, టీఎంసీ ఈ ఆరోపణలు చేశారు.
బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు..
ముఖ్యమంత్రి చేసిన ఈ 'తీవ్రమైన అధికార దుర్వినియోగం'పై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు మమతా బెనర్జీని తీవ్రంగా మందలించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ కేసును విచారిస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్, దాని పరిసర ప్రాంతాల్లోని కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లో ఉన్న ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ గనులకు సంబంధించి కోట్లాది రూపాయల బొగ్గు అక్రమ రవాణా జరిగిందని ఆరోపిస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నవంబర్ 2020లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ నుంచి ఈ ఈడీ కేసు మొదలైంది.
ఈ ఆరోపిత బొగ్గు స్మగ్లింగ్ ముఠాతో సంబంధం ఉన్న ఒక 'హవాలా' ఆపరేటర్, ఐ-ప్యాక్ రిజిస్టర్డ్ కంపెనీ అయిన ఇండియన్ ప్యాక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు పదుల కోట్ల రూపాయల లావాదేవీలను సులభతరం చేశారని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.
అరెస్టు సమయంపై అభిషేక్ విమర్శలు..
ఇదిలా ఉండగా, చందేల్ అరెస్టు ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోందని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సోమవారం అన్నారు. "బెంగాల్ ఎన్నికలకు కేవలం 10 రోజుల ముందు ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్ అరెస్టు కావడం ఆందోళనకరం మాత్రమే కాదు. ఇది సమాన అవకాశాలను కూలదోస్తుంది’’ అని బెనర్జీఎక్స్ లో ట్వీట్ చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. తీవ్రమైన అవనీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు పార్టీ మారగానే కేసులు మాఫీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు దీనిని గమనిస్తున్నారని అన్నారు.
"ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన సంస్థలు ఒత్తిడి సాధనాలుగా మారడం ప్రారంభించినప్పుడు, విశ్వాసం సన్నగిల్లడం మొదలవుతుంది. ఒకవైపు ఎన్నికల సంఘం. మరోవైపు, అత్యంత సున్నితమైన సమయంలో ఈడీ, ఎన్ఐఏ, సీబీఐ వంటి ఏజెన్సీలు రంగంలోకి దిగుతున్నాయి. ఇది న్యాయాన్ని కాకుండా, భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది" అని బెనర్జీ అన్నారు.
కేంద్ర ప్రభుత్వ నాయకత్వానికి నేరుగా సందేశం ఇస్తూ బెనర్జీ ఇలా అన్నారు, "అమిత్ షా, బీజేపీ అధికార వర్గానికి - మే 4, 5 తేదీలలో బెంగాల్‌లో ఉండండి. జ్ఞానేష్ కుమార్, మీరు మోహరించే ప్రతి ఏజెన్సీతో రండి. బెంగాల్ బెదిరింపులకు లొంగదు, నోరు మూయించబడదు, తలవంచదు. ఇది ఒత్తిడికి ప్రతిఘటనతో సమాధానమిచ్చే గడ్డ, దాని అర్థం ఏమిటో ఇది మీకు కచ్చితంగా చూపిస్తుంది."
Next Story

