నాలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా
x
సీఈసీ జ్ఞానేశ్ కుమార్

నాలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళతో పాటు పుదుచ్చేరిలోనూ ఎన్నికలు


Click the Play button to hear this message in audio format

దేశంలో కీలకమైన నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ ఎన్నికలు జరపనున్నట్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల సదన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు.

తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం తో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో పెద్ద రాష్ట్రాలలో ఒకటైన పశ్చిమ బెంగాల్ లో మాత్రమే రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఈసీ ప్రకటించింది.




కేరళ, అసోంలో ఒకే విడతగా ఏప్రిల్ 9 న ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

బెంగాల్ లో రెండు విడతలు.. ఏప్రిల్ 23 న మొదటి విడత 29 న రెండో విడతగా ఎన్నికల జరగనున్నాయి. మే 4న అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువరిస్తారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన క్షణం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని సీఈసీ ప్రకటించారు.

ఈ రాష్ట్రాలలో 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ వెల్లడించారు. ఎన్నికల కోసం రాజకీయ పార్టీలతో సమావేశం అయినట్లు వెల్లడించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఓటర్లకు అవగాహాన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికలు అన్ని కూడా ఈవీఎంలోనే నిర్వహిస్తామని అన్నారు. ఎస్ఐఆర్ కు సంబంధించి బీఎల్ఓలకు మౌలిక సదుపాయాలు కల్పించి ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పారదర్శక ఎన్నికల కోసమే ఎస్ఐఆర్ నిర్వహించినట్లు చెప్పారు. యువత ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో తాము స్వయంగా పర్యటించినట్లు సీఈసీ వెల్లడించారు. జిల్లా ఎలక్టోరల్ అధికారులు, ఎస్పీలు, డీఐజీలతో సమావేశం నిర్వహించామని భద్రతాపరమైన అన్ని అంశాలను పరిశీలించామని చెప్పారు.
ఎన్నికల కోసం 15 లక్షల మంది సిబ్బంది, 25 లక్షల మంది అధికారులు, 8.5 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల కోసం 2.18 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
భారత్ లో ఎన్నికల నిర్వహణ అంటే ప్రజాస్వామ్య పండగ అని అందరూ దీనిలో భాగస్వామ్యం కావాలన్నారు. దివ్యాంగులు, వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. నాలుగు రాష్ట్రాలలో మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
Read More
Next Story