ఎన్నిసార్లు ఎన్నికలు వస్తే అంత మంచిది


ఎన్నిసార్లు ఎన్నికలు వస్తే అంత మంచిది. ఉప ఎన్నికలు జరుగుతుంటే ఇంకా మంచిది.


బడ్జెట్‌ కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే జరుగుతున్నాయి. పదవుల ఎంపిక కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జరుగుతుంటుంది. జనాన్ని చూస్తే జనం గుంపంటారు. అదే ఓటర్లను చూస్తే ఓటరు మహాశయులారా అంటారు. పలకరింపులు, ముద్దులు, పిల్లల్ని ఎత్తుకోవటాలు ఇలా ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అన్నారు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు. దీనిని మార్చి చెప్పాలి. ఓటర్లే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అనాలి. ఓటర్ల కేంద్రంగానే అన్ని పనులూ జరుగుతున్నాయి.
మనం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను తీసుకుంటే ఎన్నికలు ఏ రాష్ట్రాల్లో జరగబోతున్నాయో ఆ రాష్ట్రాలపై అత్యంత ప్రేమ వలగబోస్తూ ఆ రాష్ట్రంలోని తమ పార్టీ వారికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో మొదలు నామినేటెడ్‌ పదవులు, పలు రాయితీలతో పథకాల కుంభవృష్టి ఆరాష్ట్రాలపై కురిపిస్తాయి. అధికార పక్షం ఇలా చేస్తుంటే ప్రతిపక్షం కూడా ఇలాంటి హామీలే ఇస్తూ అడుగులు వేస్తుంది. పెండింగ్‌ ఫైల్స్‌కు దుమ్ము దులుపుతారు. సాక్షాత్తూ ప్రధానితో సహా ఉన్నత స్థాయి ప్రజా ప్రతినిధులందరూ ఆ రాష్ట్రాలపై చక్కర్లు కొడుతుంటారు. పెండింగ్‌ పనులు వాయు వేగంతో ఊపందుకుంటాయి. అందుకే ఎన్నికలు వర్థిల్లాలి. అప్పుడైనా మనం ఆశించే సంక్షేమం, అభివృద్ధి సంక్షోబాల బాట నుంచి గట్టెక్కే దిశగా అడుగులు పడతాయి.
ఎన్నికల కోసం ఎదురు చూస్తుంటారు. ఎవరనుకుంటున్నారా.. ఎనలిస్ట్‌లు, సర్వే బృందాలు, ఈవెంట్‌ మేనేజర్లు, మైకులు అద్దెలకు ఇచ్చే వారు, డ్రమ్స్‌ కొట్టే వారు, కల్చరల్‌ యాక్టివిస్ట్‌లు, ఫ్లెక్సీలు తయారు చేసే వారు, వాల్‌ రైటింగ్‌ రాసేవారు, బాణా సంచా అమ్ముకునే వారు, మీడియా, సోషల్‌ మీడియా, అద్దెకు కార్లు ఇచ్చే వారు, బొకేలు కట్టే వారు, పూలదండలు అమ్మేవారు, రోజూ కితకితలాడుతుంటే హాటల్‌ యజమానులు, రోడ్ల మరమ్మతు పనులు చేసేవారు.. ఇలా ఎందరో ఉంటారు. వారి జేబులు కళకళలాడతాయి. ఇక చర్చలు, సమాలోచనలు మొదలవుతాయి. బార్‌ షాపులు, టీకొట్ల వద్ద సందడే సందడి.
నాయకుడిని అనుసరించే అనుచర గణం నిత్యం తిరుగుతూ ఉంటుంది. యాత్రలు, పాదయాత్రలు, చైతన్య యాత్రలు, విజయభేరీలు, బస్‌ యాత్రలు, అలకలు, లుకలుకలు, బుజ్జగింపులు ఉంటాయి. ఎన్నికలప్పుడే ప్రేమ, కపట ప్రేమలు వస్తాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే బైండోవర్లు, జైళ్ల నుంచి విడుదల కావటాలు, రౌడీషీటర్ల గ్రామ బహిష్కారాలు జరుగుతాయి. పోలీసుల హడావుడి చెప్పటానికి వీలు లేకుండా ఉంటుంది.
ఎన్నికల సమయంలో పండగలు ప్రత్యేక శోభను సంతరించుకుంటాయి. పోటా పోటీగా కార్యక్రమాలు ఉంటాయి. అప్పుడే పుట్టల్లో నుంచి చీమలు బయటకి వచ్చినట్లు ఎన్నాళ్లుగానో దాచిన నోట్ల కట్టలు బయటకొస్తాయి. ఎన్నో రోజుల నుంచి గాలాడకుండా ఉన్న నోట్ల కట్టలు కాస్త గాలి పీల్చుకునేందుకు ఇదే మంచి సందర్భం. ఎక్కడెక్కడో ఉండే వారు పోటీ చేయడానికి వస్తారు. స్థానిక భాష రాని నాయకులు భాష నేర్చుకుని సభల్లో పొడిపొడిగా మాట్లాడి చప్పట్లు కొట్టించుకుంటారు.
పంచాయతీ ఆఫీసులు కళకళలాడతాయి. ఎందుకంటే పోటీ దారులు పంచాయతీకి చెల్లించాల్సిన బకాయిలు ఎంత ఉన్నా చెల్లించి రసీదులు పొందాలి. దీంతో మొండి బకాయిలు కూడా వసూలవుతాయి.
బ్యాంకుల వారు కూడా ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. రుణమాఫీలు ఉంటాయి. ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు వాళ్ల అకౌంట్స్‌కు జమవుతాయి. కాబట్టి బ్యాంకుకు కట్టాల్సిన బకాయిలు కట్‌ చేసి మిదిలినవి వారి అకౌంట్‌లోనే ఉంచుతారు. అందుకనే బ్యాంకర్లు కూడా హ్యాపీగా ఉంటారు. పేపర్లకు, టీవీ చానల్స్‌ అడ్వర్‌టైజ్‌ మెంట్లు ఉంటాయి. పెయిడ్‌ ఆర్టికల్స్‌ ఇచ్చేవారి పంట పండుతుంది.
పార్టీ ఏదైనా, నాయకుడు ఎవరైనా.. సమావేశం ఏదైనా, సందర్భం ఏదైనా.. తర ళింపబడే అదే జనాలు. వారికి సమకూర్చే సకల సదుపాయాలు, అంతా సందడే సందడి. అందుకే ఎన్నికలు వర్థిల్లాలి.
ఎన్నికల రోజు ఓటర్ల తరలింపుకు అద్దె వాహనాలు, తనిఖీ బృందాల చేతినిండా డబ్బు, నిరంతరం పని, పండగ రోజు కంటే ఇప్పుడే ఎక్కువ పండగ వాతావరణం కనిపిస్తుంది.
ఎన్నికల అనంతరం ర్యాలీలు, విజయోత్సవ సభలు, విందులు, వినోదాలు ఉంటాయి. పథకాల క్యాలెండర్‌ మాదిరి ఎన్నికల క్యాలెండర్‌ను కూడా ముందుగానే ప్రకటిస్తే ఇంకా మంచిది. అందుకే ఎన్నికలు వర్థిల్లాలి.
Next Story