ప్రజలకు కావలసింది మాటలు కాదు, చేతలు: మోదీ
భారత ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ ఓ మాయని మచ్చలా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గడిచిన టర్మ్ లో ప్రతిపక్షం తన బాధ్యతను సరిగా నిర్వర్తించలేదని..
ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యంపై మాయని మచ్చ( బ్లాక్ స్పాట్) అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రజలు నినాదాన్ని కాదు, పదార్ధాన్ని కోరుకుంటున్నారని ప్రతిపక్షానికి హితవు పలికారు. 18 వ లోక్ సభ మొదటి సెషన్ కు ముందు ప్రధాని మోదీ కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుపడ్డారు. కాంగ్రెస్ ఒకప్పుడు రాజ్యాంగాన్ని విస్మరించి ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుందని నేరుగా ఆరోపణలు ఎక్కు పెట్టారు. ప్రజలు చర్చలు, శ్రద్ధను కోరుకుంటున్నారని, నాటకీయత, గందరగోళం కాదని ఆయన చెప్పారు. ఇప్పటికే ప్రొటెం స్పీకర్ ఎంపికతో సహ అనేక ప్రతిపక్షాలు ఎన్డీఏ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రధాని స్పందించారు.
బాధ్యతాయుతమైన ప్రతిపక్షం
ప్రజలు మాటలను కాదు, చేతలను కోరుకుంటున్నారని మోది వ్యాఖ్యానించారు. అధికార- ప్రతిపక్షాల మధ్య జరిగే గొడవల కారణంగా పార్లమెంట్ లో తరుచుగా సమయం వృథా అవుతోందని అసలు చర్చే జరగకుండా కొన్ని సెషన్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన విలేకరులతో అన్నారు.
లోక్‌సభ ఎన్నికలలో బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మెజారిటీ సాధించింది. అయితే క్రితం సారి కన్నా ప్రతిపక్ష కూటమికి ఎంపీల సంఖ్య పెరగడంతో పార్లమెంట్ లోపల, వెలుపల తన దూకుడు పెరుగుతుందని అధికార పక్షం భావిస్తోంది. ప్రజలు మంచి, బాధ్యతాయుతమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నారన, గతంలో ప్రతిపక్షం తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించలేదని, ఈసారి ప్రజాస్వామ్యబద్ధతను కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మూడవ టర్మ్
ఎన్నికలలో తన కూటమి విజయం గొప్పదని, గర్వించదగ్గ విషయమని ప్రధాని అభివర్ణించారు, గత 60 ఏళ్లలో ఒక ప్రభుత్వం వరుసగా మూడవసారి అధికారం చేపట్టడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. తన ప్రభుత్వ ఉద్దేశాలు, విధానాలపై ప్రజలు ఆమోద ముద్ర వేశారని అన్నారు.
"మా బాధ్యతలు మూడు రెట్లు పెరిగింది. మూడవ టర్మ్‌లో మేము మూడు రెట్లు ఎక్కువ పని చేస్తాము. మూడు రెట్లు ఎక్కువ బట్వాడా చేస్తామని దేశ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను" అని ప్రధాని అన్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణస్వీకార కార్యక్రమం తొలిసారిగా కొత్త పార్లమెంట్ భవనంలో జరగనుండడం గర్వించదగ్గ విషయమన్నారు.
అత్యవసర పరిస్థితి ప్రకటించిన రోజు
ఎమర్జెన్సీని ప్రకటించిన రోజు జూన్ 25 న రానుందని, రాజ్యాంగాన్ని రద్దు చేసి దేశాన్ని జైలుగా మార్చారని, దేశ పార్లమెంటరీ చరిత్రలో ఇదోక నల్లమచ్చగా మిగిలిపోయిందని పరోక్షంగా ఇందిరాగాంధీ హాయాంలో జరిగిన సంఘటనను ఆయన కాంగ్రెస్ పేరు ఎత్తకుండానే విమర్శించారు.
1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, కాంగ్రెస్ నాయకురాలు, ఎమర్జెన్సీని విధించారు, పౌర హక్కులను సస్పెండ్ చేశారు, ప్రతిపక్ష నాయకులు, అసమ్మతివాదులను జైలులో పెట్టారు. పత్రికా సెన్సార్‌షిప్‌ను అమలు చేశారు.
ప్రభుత్వాన్ని నడపడానికి మెజారిటీ అవసరమని, అయితే దేశం ఏకాభిప్రాయంతో నడుస్తుందని పునరుద్ఘాటించిన మోదీ, దేశానికి సేవ చేసేందుకు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరినీ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు, ఏకాభిప్రాయాన్ని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని చెప్పారు.
18వ లోక్‌సభ తొలి సెషన్ దేశానికి కొత్త వేగాన్ని, ఔన్నత్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇది కలలతో నిండి ఉంది. 2047 నాటికి "శ్రేష్ఠ భారత్", "వికసిత భారత్" చేయాలని సంకల్పించబడుతుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
Next Story