శీతాకాలం అయినా.. ఇక్కడ వేడిగా ఉంది: ప్రధాని మోదీ
దేశంలో ఈసారి శీతాకాలం ఆలస్యంగా వచ్చిన .. లోక్ సభలో మాత్రం చాలా వేడిగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు
విపక్షాలు ఎన్నికల్లో ఓడిపోయి ఆ నిరాశను పార్లమెంట్ కు మోసుకు వచ్చారని విమర్శించారు. ప్రజలు వారి కోసం పని చేస్తున్న వారిని గుర్తించారన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఆయన మరోసారి మీడియాతో మాట్లాడారు. విపక్షాలు గత పది సంవత్సరాలుగా ఒకే అంశాన్నిపట్టుకుని ఉన్నారని, వాటిని వదిలించి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని, అలాంటి సూచనలను మీ నుంచి కోరుకుంటున్నాని అన్నారు.
దేశం అభివృద్ధి చెందడానికి 2047ను టార్గెట్ గా పెట్టుకున్నామని, అది ఎంతో కాలం లేదని, ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పార్లమెంట్ కార్యకలాపాలను సజావుగా నడిపించడంతో సహకరించాలని కోరారు. ఈ సెషన్ ప్రతిపక్షాలకు ఓ సువర్ణ అవకాశం దీనిని వినియోగించుకోవాలని అన్నారు. ప్రతి ఓటమి నుంచి పాఠాన్ని నేర్చుకోవాలని హితవు పలికారు.
కాగా, తొలిరోజు పార్లమెంట్ సమావేశాలు నిరసనల మధ్య ప్రారంభం అయ్యాయి. మొదట బీఎస్పీ సభ్యుడు డానీష్ అలీ లేచి మెడలో ప్లకార్డు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. తనపై బీజేపీ సభ్యుడు రమేష్ బిధూరి కించపరిచే వ్యాఖ్యలు చేశారని, వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ప్లకార్డులతో సభలో రావడం, నినాదాలు చేయడంపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. సభలోకి ఇలాంటివి అనుమతి లేదన్నారు. అలీకి మద్ధతుగా మిగిలిన ప్రతిపక్షాలు జతకలవడంతో సభను మధ్యాహ్ననికి వాయిదా వేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 22 వరకూ జరగనున్నాయి.